ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడవద్దు September 7, 2018....           (14-July-2020)

మళ్ళీ ఈ మధ్యకాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం వైరస్ జ్వరాలే. చాలామంది వారంతటి వారే స్వయంగా రెండు మూడురోజుల పాటు సొంత వైద్యం చేసుకుని, గాని మెడికల్ షాపు ద్వారా గాని, తెలిసిన వాళ్ళ ద్వారా గాని మందులు తెచ్చుకుని వేసుకుంటున్నారు.

 

ఇందులో భాగంగా జ్వరం తగ్గించే Paracetamol బిళ్ళలు మాత్రమే కాకుండా యాంటీబయాటిక్స్, Combiflam వంటి బిళ్ళలు కూడా వాడుతున్నారు. ఒకరోజు ఒకరకం యాంటీబయాటిక్స్ మరొకరోజు మరో రకం యాంటీబయాటిక్స్ ఇలా రకరకలుగా వాడుతున్నారు.

 

యాంటీబయాటిక్స్ మందులను కచ్చితంగా డాక్టర్ మాత్రమే మొదలుపెట్టాలి, డాక్టరే ఆపాలి. ప్రజలు ఎవరికంతటివారుగా యాంటీబయాటిక్స్ మొదలుపెట్టడం అనేది మంచిది కాదు. అలాగే మొదలుపెట్టిన తర్వాత రెండు మూడు రోజులు వాడి జ్వరం తగ్గిందని ఆపెయ్యడం మంచిది కాదు. ఏ జబ్బుకి యాంటీబయాటిక్స్ పెట్టాలి అనేది డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది. బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరాలకు మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగపడతాయి. వైరస్ ల వల్ల వచ్చే జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగపడవు. కానీ ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ వాడటం అనేది మామూలైపోయింది. అంతేకాకుండా అసలు యాంటీబయాటిక్ లేకుండా జ్వరం ఎలా తగ్గుతుంది అనే అపోహలో జనమంతా ఉన్నారు.

 

దీని వలన మనకు వచ్చే నష్టం ఏమిటంటే అనవసరంగా మందులు వాడటమే కాకుండా, ఈ మందులకి చనిపోవాల్సిన బాక్టీరియా యాంటీబయాటిక్స్ వాడినా వీటికి అలవాటయిపోయి బ్రతకడం నేర్చుకుంటాయి. ‘దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు’. ఈ ప్రపంచంలో యాంటీబయాటిక్స్ కి రెసిస్టంట్ గా తయారయ్యే బాక్టీరియాల వలన మనకు ఎంతో ప్రమాదం ఉన్నది. ఎలాపడితే అలా యాంటీబయాటిక్స్ వాడటం వలన ఈ ప్రమాదం ఎక్కువ అవుతుంది.

 

అసలు ఇప్పుడు మనకున్న యాంటీబయాటిక్స్ చాలా తక్కువ. రకరకాల కారణాల వలన ఇప్పుడు కొత్తగా రిసెర్చ్ చేసి కొత్త యాంటీబయాటిక్స్ కనుక్కోవడం అనేది బాగా తగ్గిపోయింది. అందుకని ఉన్న యాంటీబయాటిక్స్ ని జాగ్రతగా అవసరమైన వారికి అవసరమైన మోతాదులో ఇస్తేనే ఇప్పుడున్న యాంటీబయాటిక్స్ మనం ఎక్కువ కాలంపాటు ప్రజలకు ఉపయోగపడేట్లు చేసుకోవచ్చు. లేకుంటే అవి వృధా అయిపోతాయి.

 

*విజ్ఞప్తి* : జ్వరం వచ్చినప్పుడు కంగారు పడకుండా Paracetamol బిళ్ళను ఎవరంతటవారు వాడుకోవచ్చు, మెడికల్ షాపులో తీసుకోవచ్చు, మెడికల్ షాపు వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ యాంటీబయాటిక్స్ మాత్రం దయచేసి సొంతంగా వేసుకోవద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపు వారు అమ్మవద్దు. అలాగే డాక్టర్ యాంటీబయాటిక్స్ వాడమని చెప్పిన తరువాత వారు ఆపమనకుండా ఆపవద్దు. కచ్చితంగా రమ్మన్న రోజు మళ్ళీ వెళ్ళి సరైన వైద్యం చేయించుకోవాలి.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు,
జనవిజ్ఞానవేదిక, చల్లపల్లి,
బుధవారము – 05/09/2018