ప్రియమైన రఘోత్తం,....           (09-September-2021)


 లెటర్ ఫ్రం డాక్టర్( 44)

 
ప్రియమైన రఘోత్తం,
 
మీరు  స్పష్టంగా - -  స్వచ్చంగా - - ఉన్నది ఉన్నట్లుగా- - రాస్తూ ఉంటే- - ఎలా ఉంటుంది - -అంత నిబద్ధతతో ఎక్కువమంది ఉండలేరు - -
  ? బరిలోకి దిగాక యుద్ధం నచ్చదంటే - - కుదరదు- -  నిలబడి  కొట్లాడాల్సిందే మరి -- అంటారా?
 
నగునూరు దగ్గరి గ్రామం నుంచి ఒక వృద్ధ జంట క్రమంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ మధ్యలో. కొంత చనువు  ఏర్పడ్డాక వీళ్ళ దగ్గర  ఫీజు డబ్బులు తీసుకోవాలా అనిపిస్తూ ఉంటుంది. వృత్తి వృత్తే, స్నేహం స్నేహమే - - అనే మిత్రులూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తక్కువగా ఫీజు తీసుకునే వాడిని. ఒకసారి ఆమె అంది..".బిడ్డా నీకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..వాళ్ళ పెళ్ళిళ్ళు , చదువులు ఇట్ల ఖర్చులు మస్తుగానే  ఉంటయ్  కదా ...నీవు అందరికి పైసలు వాపస్ ఇచ్చుడు, తక్కువ చేసుడు చేస్తే  తర్వాత కష్టం కాదా... మాకు ఫీజు తక్కువ చెయ్యకు   ... నా కొడుకులు గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నారు..మంచిగనే ఇస్తరు మాకు" అంది .  నా గురించి కూడా ఆలోచిస్తున్నవా - - నా బంగారు తల్లి  --అనుకున్నాను. అవసరం మేరకే స్నేహం,ఆ తర్వాత బహుదూరం లాంటి కొత్త కొత్త ధోరణిలు  కనిపిస్తున్నాయి  కదా ఈ మధ్యలో మన చుట్టూరా.  
 
"ఏంటమ్మా మాట్లాడకుండా ఏదో ఆలోచనలో వున్నావు" అని ఒక పెద్దావిడితో నా ఒపీ లో  అంటే "నీ గురించే బిడ్డా ,ఇంతమందికి ఇన్ని రకాల సేవ చేస్తున్నావ్, నీవు ఎంత ఒత్తిడితో వుంటావో, ఎంతమందికి సమాధానం చెప్పాలో  పాపం  అన్న ఆలోచన నన్ను  అప్పటినుంచిసతాయిస్తుంది  "అంది ఆవిడ బాధతో.
 
లక్షేట్టిపేటలో షాపింగ్ కు మామూలుగా అమ్మ ఎప్పుడూ వెళ్ళేది కాదు. చెల్లి చనిపోయిన తదుపరి మార్కెట్ వెళ్ళినప్పుడు మధు(మా చెల్లి),   మధు ముద్దు మాటలు  గుర్తుకు వచ్చి  ఆ జ్ఞాపకాలతో దుఖం ఆపుకోలేక ఆ నిర్ణయం తీసుకుంది అమ్మ. ఒకసారి  నాన్న నాన్న క్లర్క్, పనివాళ్ళు ,పాలేర్లుఎవ్వరూ సమయానికి  లేకపోవడంతో ఖచ్చితంగా చుట్టాలకు బట్టలు కొనాల్సిన అవసరం ఉండటంతో అమ్మ షాప్ కు వెళ్లిందట.  బట్టలు తీసుకున్నాక ఆ సేటు" మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటానమ్మా? లక్షెట్టిపేట గ్రామం  వాళ్ళమని నాకు, నా భార్యకు ఫీజు తీసుకోలేదు...మొన్న పోతే లాబ్ టెస్టులు కూడా ఫ్రీగా చేయించిండు మీ కొడుకు.. ఆయన మా -- డాక్టర్ సాబ్..నేను మీ దగ్గర ఏం పైసలు తీసుకోవాలి? నాకు పడ్డ రేటు కు తీసుకోండి అమ్మా" అన్నాడట. "కోట్ల ఆస్తి సంపాదించినా ఇవ్వలేని, ఇవ్వని సంతోషం కలిగింది బాబ్జీ...ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను "అని ఉత్తరం రాసింది అమ్మ.
 
పాత పేషెంట్లకు ఫీజు కొంత వాపస్ ఇస్తే సంతోషపడుతారు. అడిగినా  డబ్బులుఇవ్వని కొడుకులున్న  తల్లులు...మనవళ్ళు మనుమరాళ్ళకు చిన్నవి కొనివ్వాలన్నా పైసా లేని తాతలు...చాటుగా తాగే తెల్లకల్లు ,బీడీల కోసం ఎవ్వరినీ అడగలేని  పెద్దమనుషులు - -  ఇలా రకరకాలుగా. మనం కొంత తగ్గించుకొని వాళ్లకిస్తే నష్టమేమిటీ అనిపిస్తుంది, వాళ్ళను చూస్తే . నీ సంపాదన చాలా తక్కువ, ఫ్రీ పేషెంట్లు ఎక్కువ అని వాపోయారు వుచ్చిడి మోహన్ రెడ్డి అంకుల్,, ఎక్స్ ఎమ్మెల్యే ఒకసారి.   
 
 
రెండేళ్ల క్రితం బాగా దగ్గరి బంధువు చనిపోయిన విషయం ఫోన్ ద్వారా రాత్రి తొమ్మిదింటికి తెలిసింది . మరుసటి రోజుకు ఆల్రెడీ  ఆ సాయంత్రం ఆరు గంటలకు నా అప్పాయింటుమెంట్స్ ఇచ్చేశారు   . దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు ఇబ్బంది పడతారని ఆ రాత్రంతా ప్రయాణం చేసి కష్టపడి ఉదయం పదకొండు గంటలకు ఖమ్మం నుండి తిరిగి ఒపీ చూడటం కోసం  వస్తే  "నాకు చెప్పిన టైం కన్నా గంట ఆలస్యంగా చూస్తున్నావు, నీకు టైం విలువ తెలీదా "అని నిలదీసాడు ఒకాయన .  
 
డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉన్న ఒక సీజన్ లో రాత్రి పదకొండు అయ్యింది ," కొంచం తిని వస్తాను "అని రిపోర్ట్స్ తో  ఒపీలో  వెయిట్ చేస్తున్న పేషెంట్స్ కు చెప్పి పైకి వెళ్తుంటే" పైసలు  వస్తుంటే తినకపోతే ఏమైతది అట "అని ఒకాయన  వ్యంగ్యంగా అన్న మాటలు విన పడి మనసు అదో రకంగా అయిపోయింది.   వెనక్కి తిరిగి సమాధానం ఇద్దామని అనుకొని  మళ్లీ డాక్టర్ గోపీనాథ్ సర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయాను "Never compromise on your ethical values for the irresponsible attitude of few idiots   "అన్నారు మా సర్ ఒక సందర్భంగా .ఇలా
ఎన్నో రకాల అనుభవాలు కొన్ని సంతోషపెట్టేవి, కొన్ని బాధ పెట్టేవి -  కొన్ని తన్మయ పరిచేవి - -  కొన్ని విషాదంలో ముంచెత్తేవి  -ప్రతి వైద్యుడి జీవితంలో  ఉంటాయి. రోగులు కష్టంలో ,కష్టంతో వస్తారు కాబట్టి వీలున్నంతవరకు వాళ్ళను సౌకర్యంగా   ఉంచితే మనకూ రోగులకూ  మంచిది అన్న    స్పృహలో వైద్యులు ఉంటే మంచిది అనిపిస్తుంది నాకైతే.ఒక్కోసారి మనస్సుకు కష్టం కలిగినా అల్టిమేట్ గా బ్యాలెన్సుడ్ గా ఉండటమే వైద్యుడికి ఉత్తమం . 
 
  కొంతమందితో   కాలం గడిపితే కొన్ని కొత్త ఆలోచనలు కలుగుతాయి మనలో, అలానే వారి అనుభవాలు మనతో పంచుకుంటే కొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయి. ఉండనా మరి.
 
డా. మేకా విజయ మోహన్ రెడ్డి