My way to EAMCET....           (03-July-2020)


 గుంటూరు మెడికల్ కాలేజీ 1977 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీ-యూనియన్ సావనీర్ లో ప్రచురించబడిన మెడికో వరుణ్ వ్యాసం

 

 

My way to EAMCET

 

 

అప్పుడే చేరాను వికాస్ లో. వికాస్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాయడం, వికాస్ లో చేరడం చాలా త్వరగా జరిగిపోయింది. ఆ రోజు (05.06.1999) రాత్రి నాకింకా గుర్తే. కొత్త ప్రదేశం కావడం వల్లో, ఎందుకోగానీ అసలు నిద్ర పట్టలేదు. అందుకే తెల్లవారేదాకా మధ్య మధ్యలో లేచి కారిడార్ లో కిందకి చూసేవాడిని. ఎప్పుడు చూసినా, ఎవరో ఒకరు చదువుకుంటూనే కనిపించేవారు. అప్పుడే తెలుసుకున్నాను, మనుషులు ఇలా కూడా చదువుతారని.

 

 

తర్వాత కొన్నాళ్ళకు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. మా టీచర్లు నాకు 550 దాకా వస్తాయని అనుకున్నారు. నేను 540 (90%) వస్తే బాగుండునని అనుకున్నాను. కానీ 530 వచ్చాయి. కొంచెం బాధపడ్డాను.

 

 

మొదట్లో నా సెక్షన్ J 10. 10 వ తరగతి తెలుగు మీడియంలో చదివిన వారి కోసం అది ప్రత్యేక సెక్షన్. అక్కడ మరీ స్లోగా చెప్తుండటంతో అమ్మ వాళ్లకి చెప్పాను. వాళ్ళ రికమండేషన్ మీద నన్ను J7 లో వేశారు (J7 Bi.P.C. లో 2ND Section) 1ST Weekly Test లో ఇంగ్లీష్ సిలబస్ ఏమీ అవ్వకపోవడంతో గ్రామర్ మాత్రమే పెట్టారు. దానిలో చాలామందికి 25 మార్కులకి 20 కూడా రాలేదు. కానీ నాకు 23 వచ్చాయి. తెలుగు మీడియం నుంచి, అందులోనూ పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థి ఇంగ్లీష్ గ్రామర్ లో అన్ని తెచ్చుకోవడం కొందరిని ఆశ్శర్యపరిచింది. నాకు అలా మొట్టమొదటిసారిగా కొంతమంది వద్ద గుర్తింపు వచ్చింది. సంతోషించాను.

 

 

టెన్త్ లో తక్కువ వచ్చిన బాధతోనో ఏమో మరి మొదట్లో చాలా బాగా చదివాను. హాస్టల్ ఫుడ్ అలవాటు లేకపోవడం వలన కొంత చిక్కానని నేను హోమ్ సిక్ హాలిడేస్ కు వచ్చినప్పుడు అమ్మ బాధపడింది. ఎప్పుడు చూసినా తగ్గాలి తగ్గాలి అనే అమ్మ ఇప్పుడు నువ్వు పెరగాలి అని అంటే థ్రిల్లింగ్ గా అనిపించి మళ్ళీ అలాగే అనిపించుకోవాలని యుద్ధ ప్రాతిపదిక మీదుగా 5 కేజీలు తగ్గాను దీపావళికి వచ్చేటప్పటికి. కానీ, అప్పుడు అమ్మ చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో బాగానే తినడం మొదలుపెట్టాను.

 

 

మాకు వికాస్ లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని కాకుండా కాంప్రెహెన్సివ్ ఎగ్జామ్స్ అని పేరు మార్చి పెట్టేవారు. మొదట్లో బాగా చదివాను కాబట్టి మొదటి కాంప్రెహెన్సివ్ లో మా క్యాంపస్ లో 3వ ర్యాంక్ (420/440) వచ్చింది. దీనితో పొంగిపోయానో, ఏమో మరి చదువు కాస్త తగ్గింది.

 

 

అసలు ఫస్ట్ ఇయర్ లో క్లాసులను బాగా నెగ్లెక్ట్ చేసేవాడిని. చివరి బెంచ్ చివరి ప్లేస్ లో కూర్చొనేవాడిని. కొన్ని క్లాసుల్లో నిద్రపోయేవాడిని కూడా. మొదటి కాంప్రెహెన్సివ్ తరువాత స్టడీ అవర్స్ లో కూడా అప్పుడప్పుడూ నిద్ర పోయేవాడిని. దాంతో మార్కులూ తగ్గాయి. రెండవ కాంప్రెహెన్సివ్ లో 16వ ర్యాంక్ (411/440) వచ్చాయి. చాలా బాధపడ్డాను. ఈసారి చాలా బాగా చదవాలని అనుకున్నాను. రెండవ కాంప్రెహెన్సివ్ తరువాత నాన్నగారి బ్యాచ్ alumni జరిగింది. అది మా నాన్నగారికేమో గానీ, నాకు మాత్రం చాలా ఉపయోగపడింది. అందులోనే నేను నాన్నగారి ఫ్రెండ్, డాక్టర్ ప్రసన్న గారి అబ్బాయి విక్రమ్ ని కలిశాను. అప్పుడే విక్రమ్ అన్నయ్యకి MBBS సీట్ వచ్చింది. సలహా అడిగితే EAMCET మీద ముఖ్యంగా శ్రద్ధ చూపమని ఐ.పి.ఇ.ని గురించి పెద్దగా పట్టించుకోవద్దని చెప్పాడు. అంతకు ముందే, దీపావళి సెలవుల్లో తెలిసిన ఫిజిక్స్ లెక్చరర్ సలహా మీద ఒక ఫిజిక్స్ ప్రొబ్లెమ్స్ బుక్ ని స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక్కో ప్రాబ్లం దాదాపు 10-15 నిమిషాలు పట్టేది. తర్వాత కూడా అప్పుడప్పుడూ ఆ బుక్ చేస్తూ ఉండేవాడిని.

 

 

3వ కాంప్రెహెన్సివ్ కి చాలా బాగా చదివాలని అనుకున్నానే గానీ, అంత బాగా చదవలేకపోయాను. అప్పుడు అర్థం అయింది, ఒకసారి కోల్పోయిన MOMENTUM ని మళ్ళీ అందుకోవడం చాలా కష్టమని. చివరికి 3వ కాంప్రెహెన్సివ్ లో 404/440, 18వ ర్యాంక్ వచ్చాయి. ఇలా అడిగడుగునా నా పెర్ఫార్మెన్స్ తగ్గుతున్నప్పటికీ, అమ్మా నాన్నగారు మాత్రం నన్నేమీ అనేవారు కాదు. కేవలం “ఈసారి ఇంకా బాగా చదువు” అనేవారు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలాగే అనేవారు. ఆ స్టూడెంట్స్ అందరూ ఈసారి నుంచి బాగా చదవాలి అనే పాజిటివ్ ఎప్రోచ్ తో వుండేవారు. అయితే, కొంతమంది మాత్రం చదివినప్పుడు కొడుకుని హీరోగాను, చదవనప్పుడు జీరోగాను చూసేవారు. వీరిలో చాలామంది ఇంకా పనికి రాకుండా పోయేవారు. ఆ వయస్సులో పిల్లల మీద అంత వత్తిడిని తీసుకొని రావడం అస్సలు మంచిది కాదని నా అభిప్రాయం. అడాలెసెంట్ ఏజ్ లో స్టూడెంట్స్ చాలా ఇగోయిస్టిక్ గా వుంటారు. “నువ్వు బతికి వుండాలి” అంటే “నా బతుకు నా యిష్టం, నేను చస్తాను” అని పలికిస్తుంది వారి వయస్సు. అందుకే, వారికి ఎడ్వైజ్ చేసేటప్పుడు వారి తప్పులను వాళ్లకు చూపించేటప్పుడు చాలా నేర్పుతో డీల్ చెయ్యాలి. లేకపోతే నెగిటివ్ వేలో వెళ్ళిపోతారు వాళ్ళు. చదువుకో అంటే నేను చదవను అని మొండికేసే ఛాన్స్ వుంది.

 

 

ఈలోగా మా సీనియర్లకు EAMCET మోడల్ పరీక్షలు పెట్టడం ప్రారంభించారు. ఆ పరీక్షల్లో టాప్ వచ్చేవాళ్ళని మేము వింతజీవుల్లా చూసేవాళ్ళం. దానికో చిన్న ఉదాహరణ : ఆ సంఘటన ఇంకా నాకు బాగా గుర్తు. ఒకరోజు ప్రార్థన కోసమని అందరం అసెంబ్లీలో నించున్నాం. సీనియర్లకి, జూనియర్లకి ప్రార్థన ఒకే సమయంలో వుండేది. అప్పుడే మొదటిసారి నేను పి.వి. కిరణ్ అనే టాపర్ ని చూసాను. నా ఫ్రెండ్ ఒకతను చూపించాడు. ఓహో ఇతనేనా అనుకొని నేను మళ్ళీ ముందుకు తిరిగాను. ఇంతలో నా ముందున్న ఇద్దరు ఒక్కసారిగా ‘ఒరేయ్! పి.వి. కిరణ్ కు నవ్వడం కూడా వచ్చురోయ్!’ అని ముక్తకంఠముతో అరిచారు. నేను ఉలిక్కిపడి అటు తిరిగితే అతను నిజంగానే నవ్వుతున్నాడు. ‘అరే!!! నిజంగానే నవ్వుతున్నాడు’ అని సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాను. ఇప్పుడు తలుచుకుంటేనే విపరీతంగా నవ్వు వస్తున్నది. (ఆ పి.వి. కిరణ్ అనే అతను నాకు ఇప్పటికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్).

 

 

ఆ తర్వాత మాకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ పెడతారనుకుని మా కాలేజీ వాళ్ళు మాకు ఐ.పి.ఇ.కి ఇంటెన్సివ్ కోచింగ్ లాంటిది పెట్టారు. నాకు అసలే ఎగ్జామ్స్ వ్రాసేటప్పుడు టైం సరిపోదంటే వాళ్ళు ప్రతి పరీక్షకి పావుగంట తగ్గించారు. పైగా నేను మరీ అంత extra ordinary గా కూడా చదవడం లేదు. కాబట్టి అసలే కోతి, ఆపైన…….. వరుసలా మారింది నా పరిస్థితి. మూడు గంటల టైములో నాలుగు పేపర్లనీ (గ్రూప్ సబ్జక్ట్స్) ఒకేసారి యిచ్చి వ్రాయమనేవారు. దాంతో, మొదటి రెండు పేపర్లు బాగా వ్రాసి బోటనీ, జువాలజీ కొచ్చేసరికి టైం సరిపోక సరిగ్గా వ్రాసేవాడిని కాదు. 2, 6, 81/2 … ఇలాంటి మార్కులు కూడా వచ్చేవి. ఫాంలో లేని క్రికెటర్ లాంటిది నా పరిస్థితి. అమ్మా నాన్నగార్లకు చెప్తే వాళ్ళూ అర్థం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ బాగానే చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా బాగానే వ్రాసాను. 411/440 వచ్చాయి.

 

 

ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో విక్రమ్ అన్నయ్య సలహా మీద చలపతి రావు ఫిజిక్స్ బుక్ ను స్టార్ట్ చేసి, ఆ సెలవుల్లోనే ఆ బుక్ లోని జూనియర్ ఇంటర్ పార్ట్ ని పూర్తి చేశాను. కాలేజీ తిరిగి ప్రారంభమైనాక, జూనియర్ ఇంటర్ EAMCET కోచింగ్ మొదలుపెట్టారు. మొదట్లో చాలా ఎక్కువ చదవాలనే భ్రమలో పెద్ద పెద్ద పుస్తకాలు వేటి వేటినో చదివేవాడిని. తర్వాత త్వరగానే రియలైజ్ అయి స్టాండర్డ్ బుక్స్ కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని, వాటినే చదవడం మొదలు పెట్టాను. జూనియర్ ఇంటర్ EAMCET కోచింగ్ లో ఆరు పరీక్షలు పెట్టారు. అందులో వరుసగా నా మార్కులు…

 

186/200

191/200

189/200

194/200 3వ ర్యాంక్

181/200 2వ ర్యాంక్

132/150

 

 

మళ్ళీ నాకదే సమస్య. ఎక్కువ వస్తే సరిగా చదవను. తగ్గితే చదువుతాను. ఈ పరిస్థితి నాకప్పటికే అర్థం అయినది. అయినా ఏమీ చేయలేక పోయేవాడిని. మనస్సుని కంట్రోల్ లో వుంచుకోగల్గితే దేనినైనా సాధించవచ్చునని అనిపించేది. అయితే నేను సెలవుల్లో పడ్డ కష్టం ఊరికే పోలేదు. అప్పుడు నాకు ఫిజిక్స్ లో మొదటి నాలుగు టెస్ట్ ల్లో 48, 50, 50, 50 వచ్చాయి. (చివరి రెండూ గుర్తు లేవు)

 

 

తర్వాత సీనియర్ ఇంటర్ మొదలుపెట్టారు. మొదట్లో బాగా చదివాను. మళ్ళీ బద్ధకించాను.

 

 

కాబట్టి మొదటి కాంప్రెహెన్సివ్ లో నా ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకప్పుడు ఏ ర్యాంక్ వచ్చిందో ఇప్పటికీ తెలియదు. కానీ 50 పైనే అని తెలుసు. అప్పట్లో EAMCET మీద మరీ ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కాస్త దెబ్బకొట్టింది. అసలు చేయాల్సింది అదే అయినా, తక్కువ వచ్చేసరికి చాలా బాధపడ్డాను. కాబట్టి మళ్ళీ బాగా చదవడం మొదలు పెట్టాను. ఆ టైం లో చాలా బాగా చదివాను. క్లాసుల్లో ముందు కూర్చునే వాడిని, శ్రద్ధగా వినేవాడిని, స్టడీ అవర్స్ ను కూడా చాలా బాగా యుటిలైజ్ చేసుకునేవాడిని. అప్పట్లో గంటకి ఒకోసారి వంద ఫిజిక్స్ బిట్స్ కూడా చేయగలిగేవాడిని.

 

 

అప్పుడే నాన్నగారు నన్ను పట్టాభిరాం గారి ఎన్.ఎల్.పి. (న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్) క్లాసులకు పంపించారు. నాకది నిజంగా మాజిక్ లా ఉపయోగపడింది. వెంటనే దాని ఉపయోగం తెలీలేదు కానీ, EAMCET క్లాసులు మొదలైన తరువాత తెలిసింది దాని ఉపయోగం.

 

 

కాంప్రెహెన్సివ్ లో తక్కువ వచ్చినందువల్ల, చాలా బాగా చదవడంతో సీనియర్ ఇంటర్ EAMCET మొదటి పరీక్షలో 191, 2వ ర్యాంక్ వచ్చాయి. అప్పట్లో వికాస్ లో మొదటి రెండు ర్యాంక్ లు వచ్చినవాళ్ళకి ఒక పెన్ ఇచ్చేవారు. నాకూ ఇచ్చారు. అప్పుడు నాకెలాగైనా సరే మళ్ళీ ఆ పెన్ తెచ్చుకోవాలనిపించింది. దాంతో కాస్త వత్తిడికి లోనయ్యాను. అప్పుడు ఎన్.ఎల్.పి.ని ప్రయోగించాను. బ్రహ్మాండమైన ఫలితం వచ్చింది. ఏ రోజు ఎన్.ఎల్.పి. ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఆ రోజు టెన్షన్ వచ్చి సరిగ్గా చదవలేక్ పోయేవాడిని. అలా బాగా చదివి రెండవ పరీక్షలో 197, 1వ ర్యాంక్ తెచ్చుకున్నాను. వికాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం అదే మొదటిసారి. దాంతో చాలా సంతోషించాను. అలా మళ్ళీ చదవబుద్ధి కాలేదు. అందుకని ఈసారి నాలో డిటర్మినేషన్ ను పెంచుకునేందుకు ఎన్.ఎల్.పి.ని వాడాను. మళ్ళీ రిజల్ట్ చాలా బాగుంది. మూడవ పరీక్షలో 198, 2వ ర్యాంక్ వచ్చింది. ఇలా నన్ను నేను ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేసుకుంటూ చక్కగా పెర్ఫార్మ్ చేశాను.

 

 

4వ పరీక్ష – 191, 2వ ర్యాంక్

5వ పరీక్ష – 194, 2వ ర్యాంక్

6వ పరీక్ష – **, 1వ ర్యాంక్

7వ పరీక్ష – **, 1వ ర్యాంక్

8వ పరీక్ష – 195, 2వ ర్యాంక్

 

చాలా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేశాను. మధ్యలో విపరీతంగా టెన్షన్ కి లోనవ్వడంతో, ఎన్.ఎల్.పి.తో పాటు Alprax-0.25 కి కూడా పనిచేప్పక తప్పలేదు. ఆ విధంగా సీనియర్ ఇంటర్ EAMCET టెస్ట్ ల్లో నేనో టాపర్ గా పేరు తెచ్చుకున్నాను. టాపర్స్ గురించి ఎప్పుడూ జూనియర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా నా గురించి వాళ్ళు మాట్లాడుకున్నది నేను స్వయంగా విన్నాను. ఒకరోజు ఎందుకో, జూనియర్స్ తో కలిసి నేను మెస్ లో కూర్చున్నాను. అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. “ఇప్పుడు మన సీనియర్లకు పెట్టే టెస్ట్ ల్లో వరుణ్ అనే అతను టాప్ లో వస్తున్నాడు కదా, వాళ్ళ అమ్మ కార్డియాలజిస్ట్, నాన్న న్యూరాలజిస్ట్ అంట”. నేను సైలెంట్ గా నవ్వుకుని, ‘కాదనుకుంటా’ అని అన్నాను నెమ్మదిగా. కానీ ఆ జూనియర్ నాతోనే చాలా గట్టిగా వాదించాడు – అతను చెప్పింది కరక్టేనని. తరువాత విపరీతంగా నవ్వుకున్నాను. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. తర్వాత ఇంటర్ పరీక్షలప్పుడు కొంచెం ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇంటర్ తర్వాత గ్రాండ్ టెస్ట్స్ అని జూనియర్ ఇంటర్, సినియర్ ఇంటర్ రెండింటిని కలిపి EAMCET పరీక్షలు పెట్టేవారు. అన్ని పరీక్షలని బాగానే వ్రాశాను. కానీ, చివర్లో ఏదైనా కొత్త పాయింట్ కనిపిస్తే, చాలా టెన్షన్ వచ్చేది. Alprax-0.25 కూడా వేసుకొనేవాడిని. దాంతో చివరి పది రోజులు దాదాపు ఏమీ చదవలేదు. కేవలం కొన్ని మోడల్ పేపర్లు మాత్రమే చేసేవాడిని. చివరికి EAMCET వ్రాసాను. వ్రాసిన తరువాత కాన్ఫిడెంట్ గానే వున్నాను. రెండు సంవత్సరాలు కలిసి ఉన్నవాళ్ళం విడిపోతున్నామనే తప్ప వేరే బాధేమీ లేదు. అప్పుడిక ఎవ్వరితోను పేపర్ గురించి డిస్కస్ చేయలేదు కానీ, మా ఫ్రెండ్స్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటుంటే విన్నాను. రెండే బిట్స్ విన్నాను, అవి రెండూ నేను తప్పు పెట్టాను. రెండూ ఫిజిక్స్ లోనే. కెమిస్ట్రీ లో అసలు ఒక బిట్ తెలియలేదు. దాంతో మూడు బిట్స్ చూసుకున్నాను, మూడూ పోయినట్లయింది. దాంతో కొంచెం భయం వేసింది. కీ వచ్చిన తరువాత చూసుకొని 195 ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాను. ఎందుకంటే ఒక బిట్ ని కీలో తప్పు ఇచ్చాడు, ఇంకో మార్కుని మార్జిన్ గా వేసుకున్నాను. చివరికి రిజల్ట్స్ వచ్చినప్పుడు నా ఆనందానికి, ఆశ్చర్యానికి అంతులేదు. ఇంటర్వ్యూలు, ఫోటోలు ఇంకా సంతోషింపజేశాయి. అలాంటి రోజు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మూడవ ర్యాంక్ తెచ్చుకునేందుకు నేను పడ్డ కష్టం ఇప్పటికీ నాకు సంతోషాన్ని తెచ్చిపెడుతూనే వుంది. సీనియర్స్ దగ్గర, క్లాస్ మేట్స్ దగ్గర నేనంటే కాస్త స్పెషల్ ఇంప్రెషన్ వుండేది. అందులోనూ, మొదటి ప్రయత్నంలో మూడవ ర్యాంక్ అనేసరికి సీనియర్స్ నా మీద స్పెషల్ ఇంట్రస్ట్ చూపేవారు. నిజానికి ర్యాంక్ వచ్చినందుకు సీనియర్స్ నన్ను ర్యాగ్ చేసేవారెవ్వరూ లేరు. ఎప్పుడైనా MBBS లో డిప్రెషన్ వస్తే, నా ర్యాంక్ ను తలచుకుంటే చాలు – దానిలో నుంచి నేను బయటపడగలను. నిజంగా ఎనాటమీ ఎగ్జామ్స్ వ్రాయగలనో, లేదో అని భయపడినప్పుడు నా ర్యాంకే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

 

 

నా ఇంటర్మీడియెట్ రెండేళ్ళల్లో నేను చాలా నేర్చుకున్నాను. వాటిల్లో కొన్ని –

 

ఫిజిక్స్ బిట్స్ మీద ముందు నుంచి కాన్సన్ ట్రేట్ చెయ్యాలి. అది మనకు ఆత్మాస్థైర్యాన్నిస్తుంది. ఒకవేళ కరెక్ట్ గా EAMCET కోచింగ్ స్టార్ట్ అయిన తరువాత మొదలు పెడితే, కొత్త కాబట్టి అన్నీ రావు, ఫాస్ట్ గా చేయలేము. ముందే మొదలుపెట్టిన వాళ్ళు ఫాస్ట్ గా చేయడం చూసి మనం డిప్రెస్ అయ్యే ప్రమాదముంది. ఇదే స్టేజిలో చేతులెత్తేసిన వాళ్ళను కూడా చాలామందిని చూశాను.


తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అది కేవలం వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే. వాళ్లకి కావాల్సిందల్లా అడ్జస్ట్ అవడానికి కొంత టైమ్. కొంతమందికి అది నెల కావచ్చు, మరికొందరికి ఆరు నెలలు కావచ్చు. కానీ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరిన వారానికే వీక్లీ టెస్ట్ లు పెట్టడం వలన, వాళ్లకి కంపారిటివ్ గా మార్కులు చాలా తక్కువ వస్తాయి. కొంతమంది మావల్ల కాదని అక్కడే చతికిలబడి పోతారు. కొంతమంది ఇంకొంత దూరం వెళ్లి వదిలేస్తారు. కానీ, పట్టుదల వదలకుండా,


ఆత్మస్థైర్యాన్ని వీడకుండా ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీషు మీడియం నుంచి వచ్చిన వారితో సమానంగా పోటీపడేవారు.

 

 

కొంతమంది ఐ.పి.ఇ. మీద బాగా శ్రద్ధ చూపుతారు, కొంతమంది దాని గురించి అస్సలు పట్టించుకోకుండా EAMCET నే పట్టించుకుంటారు. అలా కాకుండా బాలెన్స్ డ్ గా చదవాలి. ముందు క్లాస్ వింటే, ఒక ఓరియంటేషన్ వస్తుంది. దానిని మరింత పెంచుకోవడానికి టెక్స్ట్ బుక్ లో బ్రాడ్ గా చదవాలి. అంటే ఐ.పి.ఇ ఓరియంటెడ్ గా (మరీ లైన్ టు లైన్ బట్టే పట్టాల్సిన అవసరం లేదు) తర్వాత కార్నర్ పాయింట్స్ కోసం వెతకాలి. అంతే గానీ, మొదటి నుంచి వాటి కోసం వెదకడం ప్రారంభిస్తే, బేసిక్ కాన్సెప్ట్ ను కోల్పోయే ప్రమాదముంది. అసలు EAMCET లో మెజారిటీ బిట్స్ బేసిక్ కాన్సెప్ట్ నుండే ఇస్తారు.


మెంటల్ స్టెబిలిటీ అనేది ఏ కెరీర్ కైనా చాలా ముఖ్యం. మన బేసిక్ ప్లాన్ ఇలా వుండాలి.
ఒక టార్గెట్ పెట్టుకొని పరీక్ష వ్రాయాలి. తక్కువ వస్తే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ వస్తే టార్గెట్ ని పెంచుకోవాలి. తక్కువ వస్తే depress అవ్వకూడదు. ఎక్కువ వస్తే ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు.

 

మన కష్టానికి ఫలితాలను వెంటనే ఆశించకూడదు. లాంగ్ రన్ లో అది మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.


నేను సీనియర్ ఇంటర్ ఫస్ట్ కాంప్రెహెన్సివ్ లో తక్కువ వచ్చినందుకు చాలా బాధపడి సీరియస్ గా చదవడం మొదలు పెట్టాను. కానీ నాకు వెంటనే మంచి ఫలితం ఏమీ రాలేదు. అయితే మూడు, నాలుగు నెలల తర్వాత పెట్టిన మొదటి EAMCET పరీక్షలో రెండవ ర్యాంక్ వచ్చింది. కష్టపడటం మొదలుపెట్టగానే ఫలితం దక్కడం లేదు అని బాధపడుంటే ఆ రిజల్ట్ వచ్చేదే కాదు, దాని వలన వచ్చిన ఆ తర్వాతి ఫలితాలు కూడా నాకు దక్కేవి కాదు.


అలాగే, మనం ఒక టైం లో కష్టపడి ఫలితం ఏమీ లేదని, వదిలేస్తే కొంతకాలం తర్వాత మనం ఇంతకు ముందు పడ్డ కష్టానికి మనకొక మంచి ఫలితం వస్తుంది. దాంతో నేను చదవకపోయినా మంచి మార్కులొస్తున్నాయని ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యే ప్రమాదముంది.


సాధారణంగా కాలేజీల్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకునే వారి కంటే తక్కువ కష్టపడి ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకే చాలా క్రేజ్ వుంటుంది. అది నాకు కరెక్ట్ అనిపించదు.


వికాస్ లో మా క్యాంపస్ డైరెక్టర్ సుఖ్ దేవ్ గారు నాకొక మాట చెప్పారు. ఎంత బాగా చదువుకొనే వాళ్ళైనా సరే, అంత బాగా చదవని వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సింది చాలా వుంటుంది. అందుకని మనం బాగా చదువుతున్నట్లయితే, తెలిసి తక్కువ చదివే వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు 5 పాయింట్లు తెలిసినా మనకు తెలియని ఒకే ఒక పాయింట్ వాళ్లకి తెలిసి ఉండవచ్చు. వాళ్ళతో ఇంటరాక్షన్ వుంటే దానిని తెలుసుకోవచ్చు కదా!


కొంత పాపులారిటీ వచ్చినప్పుడు మన ప్రమేయం, తప్పు గానీ ఏమీ లేకుండానే మన మీద నిందలు పడుతుంటాయి. వాటిని గూర్చి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. “Unjust criticism is a blessing in disguise” అది మీరు పాపులర్ అవుతున్నారనడానికి మొదటి సంకేతం. ఇది నిత్య జీవిత సత్యం.


విక్రమ్ అన్నయ్యని కలవడం, నాకు ఇంటర్మీడియేట్ లో చాలా ఉపయోగపడింది. అలా ఎప్పుడు ఎవరికైనా ఒక సీనియర్ సలహా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా EAMCET గోయింగ్ స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ చదివితే వారికి అది తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

 

 

చివరి మాట, నాన్నగారి ఆలమ్నిలో విక్రమ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని స్టేజి మీదకు పిలిచినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి, ప్రసన్న అంకుల్ ని ప్రౌడ్ ఫాదర్ అన్నారు. నేనూ అలా స్టేజి ఎక్కాలని ఆశపడ్డాను. మీ బ్యాచ్ ఆలమ్నీలో నా కోరిక నెరవేరింది. నా కలలను నిజం చేసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు.

 

 

-వరుణ్