రాజకీయాలు – ఫిలాసఫీ (తత్వచింతన)....           (26-Jun-2020)


02-04-2017 ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో రాధాకృష్ణ గారు రాసిన ‘కొత్తపలుకు’ చదివిన తరువాత గుర్తుకొచ్చిన విషయాలు, కలిగిన భావాలు:

 

 రాజకీయాలు – ఫిలాసఫీ (తత్వచింతన)

 

 

5 సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వాధికారి వైద్య పరీక్షల నిమిత్తం నా దగ్గరకు వచ్చారు. ఆయనతోపాటు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. తండ్రిని పరీక్ష చేయటం పూర్తి అయిన తరువాత ఆ కుర్రవాడితో పిచ్చాపాటి మాట్లాడటం జరిగింది. ‘భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నావు?’ అని అడిగితే ‘రాజకీయాలలోకి వెళ్ళాలనుకుంటున్నాను’ అని చెప్పాడు. చిన్నవయసులోనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆశ్చర్యము, సంతోషము కలిగాయి. ‘ఎందుకీ నిర్ణయం తీసుకున్నావు?’ అని అడిగితే చాలాసేపు సమాధానం చెప్పలేదు. ‘ఏదైనా పదవి ఆశించి రాజకీయాలలోకి వెళ్ళాలనుకుంటున్నావా? లేక ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించటానికి రాజకీయాలలోకి వెళ్ళాలనుకుంటున్నావా?’ అని అడిగాను. అయినా సమాధానం చెప్పలేక ఆలోచనలో పడ్డాడు. ఎంతసేపటికీ మాట్లాడకపోతే నేనే ఇలా చెప్పాను – ‘పదవుల కోసం రాజకీయాలలోకి వెళ్ళేటట్లయితే పదవులు రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయినట్లయితే నువ్వు కుంగుబాటుకు గురవ్వవచ్చు. అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలలోకి వెళితే సమస్యలు పరిష్కారం అయితే ఎంతో ఆనందం వస్తుంది. ఒకవేళ పరిష్కారాలు లభించకపోయినా ప్రజల కోసం పని చేశానన్న ఆత్మసంతృప్తి లభిస్తుంది’.

 

 

ఆ కుర్రవాడు నా మాటలు విని ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత అతని జాడ నాకు తెలియలేదు.

 

 

స్వర్గీయ ఎన్.టి. రామారావు గారి ప్రేరణతో ఎం.ఎల్.ఏ. అయిన ఒక మిత్రుడు ఆ తరువాత రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. 15 సంవత్సరాల క్రితం అతను కలిసినప్పుడు రాజకీయాలలో ఎందుకు కొనసాగలేదని అడిగాను. అతని సమాధానం ఇది –

 

“రాజకీయాలలో డబ్బు సంపాదించడం జనం హర్షించరు. డబ్బు లేకుండా రాజకీయాలలో రాణించడం సాధ్యం కాదు. రాజకీయాలలో శత్రువు ఉండేది ఎదుటి పార్టీలో కాదు, మన పక్కనే ఉంటూ, మనతో పాటు పనిచేస్తూ అవకాశం ఉన్నప్పుడు మనను తొక్కి పైకి వెళ్లిపోవాలని చూసే మిత్రుడే! అందుకే నేను ఇమడలేక తప్పుకున్నాను”.

 

 

మరో మిత్రుడు పాశ్చాత్య దేశాలలో కొంతకాలం ఉద్యోగం చేసి కొద్ది సంవత్సరాల క్రితం మన దేశం తిరిగి వచ్చి రాజకీయాలలో పనిచెయ్యటం మొదలుపెట్టాడు. నిజాయితీగా పనిచేసి మన వ్యవస్థను సన్మార్గంలోకి తీసుకు వెళ్లాలని అతని ఆశ. అయితే ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న ఒక పెద్దమనిషి ఆయనతో ఇలా అన్నారు –

 

“జనం మీద ఎంత ఖర్చు పెట్టయినా అధికారం సంపాదించుకోవటం – ఆ అధికారంతో డబ్బు సంపాదించటం, ఆ సంపాదనలో కొంత మళ్ళీ అధికారం పొందటానికి ఖర్చు చెయ్యటం – ఇదే ఈరోజున ఏ పార్టీకయినా ఎజెండా” అని వివరించి “నువ్వు ఈ రాజకీయాల్లో ఇమడలేవు. మళ్ళీ నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటే మంచిది” అని సలహా ఇచ్చారు.

 

 

ఒక అభ్యుదయవాది నవ్యాంధ్రప్రదేశ్ లో తన సొంత ఊరిని అభివృద్ధి చేయటానికి హైదరాబాదు నుండి వచ్చి ఒక సంవత్సరం పాటు ఆ ఊరిలో తన సొంత డబ్బు, మిత్రుల డబ్బు సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. తను చేసిన కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలలాగా చూపించి బిల్లులు పెట్టుకుని కొంతమంది నాయకులు జేబులో డబ్బులు వేసుకున్నారట. ఈ విషయం తెలిసి అతను చాలా బాధపడ్డాడు. “తమ కార్యకర్తలను నిలుపుకోవాలంటే ఏదోరకంగా డబ్బు సంపాదించే అవకాశాన్ని వారికి కలిగించటం నాయకులకు తప్పనిసరిగా ఉంది” అనేది అతని అభియోగం.

 

 

ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీల వలే, భారత జాతీయోద్యమ సమయంలోని కాంగ్రెస్ పార్టీ వలె సరైన ఫిలాసఫీ లేదు. ఎక్కువ మందికి ఉన్న ఫిలాసఫీ ‘డబ్బుతో పదవిని, పదవితో డబ్బును సంపాదించుకోవటమే’.

 

నీతి నిజాయితీలతో పనిచేసే నాయకులను ఇప్పటికీ తగినంత మందిని చూస్తూనే ఉన్నాం. సంతోషం! కానీ ఇటువంటి నాయకులు ముందుముందు రాజకీయాలలో నిలబడలేరేమో అనే భయం కూడా వేస్తోంది.

 

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి

తేది : 05-04-2017

 

 

ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ గారు రాసిన ‘కొత్తపలుకు’లో కొంతభాగం….