నిజమైన ప్రజా వైద్యుడు, సమాజ సేవకుడు “డా. శివన్నారాయణ”....           (26-Jun-2020)


డా. శివన్నారాయణ గురించి ఎంత రాసినా తక్కువే. శారీరకంగా, మానసికంగా అత్యంత బలవంతుడు.

 

 

సృజనాత్మకంగా ఆలోచించటం, దానిని అమలుచేయగల ధైర్యం, సత్తా కలిగి ఉండటం, ఎదురుగా ఉన్నది ఎవరైనా నిజాన్ని సూటిగా, నిర్భయంగా మాట్లాడగలగటం అతని లక్షణాలు. ఈ లక్షణం కొంతమందికి కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఈ లక్షణాల వల్లనే ప్రజలకి – ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకి అత్యున్నత సేవలు అందడమే కాకుండా, మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేయాలనే కార్యకర్తలకు దిశా నిర్దేశంగా కూడా ఉంటుంది.

 

 

డాక్టర్లు, మూస ధోరణిలోనే ఆలోచించే శాస్త్ర ప్రచార కార్యకర్తలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రభుత్వాలు కూడా వారి సలహాలు తీసుకుని, చిత్తశుద్ధితో అమలు చేస్తే పాడైపోయిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు.

 

 

ఒక వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసే కాలాన్ని (సమయ దానం లేదా సమయ త్యాగం) బట్టి అతను సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడో కొలవవచ్చు. శని, ఆదివారాలలో తాను చేసే 30 క్యాంపుల వల్ల ప్రజలకు ఆర్థికంగానూ, సామాజిక కార్యకర్తలకు ప్రేరణ గానూ ఒనగూడే లాభాన్ని వెలకట్టడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి కొన్ని వందల మంది కార్యకర్తలను తయారు చెయ్యటం అనే విషయం సామాన్యమైనది కాదు. కీర్తి కోసం గాని, డబ్బు కోసం గానీ లేశమంతైనా ఆశ లేని నాయకునికి మాత్రమే ఇది సాధ్యం!

 

 

“ప్రతివారం రెండు రోజులు తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పని చెయ్యటం” అనే అంశం నిజంగా అద్భుతమైన విషయం. ఆ రకంగా చూస్తే సమకాలీన ప్రపంచంలో డా. శివన్నారాయణ సమాజం పట్ల తన బాధ్యతని తీర్చుకోవటం ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటుంది.

 

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి ఆర్ధిక సహాయం ఇవ్వడమే కాకుండా తనకు వీలున్నప్పుడల్లా వచ్చి కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఎన్నో సంస్థలకు, అవసరమైన వ్యక్తులకు ఆర్ధిక సహాయం చేయడం తెలిసిన విషయమే.

 

 

దేశంలో ప్రతిష్టాత్మకమైన త్రివేండ్రం లోని శ్రీ చిత్ర తిరునాళ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుండి న్యూరాలజీలో అత్యున్నత డిగ్రీ అయిన D.M.ను పొంది చెట్టు కింద బీద రోగులను చూడటం అనేది నమ్మలేని నిజం. ఇటువంటి డాక్టర్ మన ప్రాంతంలో ఉండేవాడంటే కొంతకాలం తరువాత యువ డాక్టర్లు నమ్మడం కష్టమేమో!

 

అతను రాసిన ‘కనిపించని రెండో తల్లి’ వ్యాసం హైస్కూల్ స్థాయిలో పాఠ్యాంశంగా బోధించవలసిన విషయం. ‘మనిషి ఉన్నతస్థితికి ఎదగాలంటే’ అనే వ్యాసాన్ని సామాజిక కార్యకర్తలందరూ చదవాల్సిందే!

 

 

ఈ ప్రయాణంలో తననుకున్నవన్నీ చెయ్యగలగటానికి శ్రీమతి కోమలి ఇస్తున్న ప్రోత్సాహం, పడుతున్న శ్రమ సామాన్యమైనదేమీ కాదు. సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు కానీ, సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అతనితో చర్చించటం తప్పనిసరి అని నేను భావిస్తున్నాను.

 

 

అతని మీద నాకున్న ఒకే ఒక్క ఆరోపణ స్పీడ్ డ్రైవింగ్. ఆ ఒక్క విషయం గురించి భయపడుతుంటాను.

 

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

24-11-2017