ఆచరణాత్మక ఆదర్శం....           (26-Jun-2020)


జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలారా! ఉపాధ్యాయ మిత్రులారా!

 

 

శ్రీశ్రీ చెప్పినట్లు “ఆచరణకు దారి తీస్తేనే ఆశయానికి సార్థక్యం!” చల్లపల్లి జనవిజ్ఞాన వేదికలో సుమారు 20 ఏళ్ల నుండి శ్రీ సూర్యదేవర నాగేశ్వరరావు (ఫిజిక్స్ లెక్చరర్) గారు, శ్రీమతి ప్రమీలారాణి (జెడ్.పి. స్కూల్ హెచ్.ఎం.) గారు చురుకైన కార్యకర్తలు. వారి పిల్లలిద్దరూ కూడా అవకాశాన్ని బట్టి కార్యకర్తలుగా పని చేస్తున్నారు.

 

 

విశేషమేమిటంటే డాక్టర్లయిన ఈ పిల్లలిద్దరూ పాఠశాల విద్యను చల్లపల్లి లోని తెలుగు మీడియం పాఠశాలలోనే పూర్తి చేశారు.

 

 

పెద్దవాడు ప్రణీత్ తొలి ప్రయత్నం లోనే ఎంసెట్ లో వైద్య విద్యావకాశం పొందాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఎం.డి. (జనరల్ మెడిసిన్) సీటు పొంది చదువుతున్నాడు.

 

 

చిన్నవాడు వరుణ్ కూడా అదే పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి, ఇంటర్ తర్వాత ఎంసెట్ లో మెడిసిన్ సీటు సంపాదించి, కాకినాడలో ఎం.బి.బి.ఎస్. ముగించాడు. ఇక ఇప్పుడు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన “పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్” (పిజిఐ) చండీఘడ్ లో చదివేందుకు 5వ ర్యాంకు సాధించాడు.

 

 

ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఎప్పుడైనా ఆశయం కంటే ఆచరణే ముఖ్యం. జనంలో పని చేయాలనుకొనే నాయకుల, కార్యకర్తల మాటల కంటే “ఆచరణే” సాటి ప్రజల మీద ప్రభావం చూపుతుంది.

 

 

మాతృభాషలో పాఠశాల విద్య శాస్త్రీయమనీ, ప్రయోజనకరమనీ నమ్మిన మనలో కూడా ఎందరం మన పిల్లల్ని తెలుగు మీడియం బడులలో చదివిస్తున్నాం? మహానగరాల్లో తెలుగు మాధ్యమంలో చదివించడం చాలావరకు అసాధ్యమనేది నిజమే! తెలుగు మీడియం పాఠశాలలు ఉన్న పట్టణాల్లో, పల్లెటూళ్ళలోనైనా, మనలో అత్యధికులు అందులో చదివించడం లేదు కదా! ఇందుకు నేననుకొనే కారణం మనలో కొందరికి అవగాహన, నిబద్ధత చాలకనే! సమాజంలో ఆలోచనకు, ఆచరణకు పొంతన లేకపోవడం కూడా మరొక కారణమనుకొంటాను.

 

 

కనుక జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలకు, ఉపాధ్యాయ మిత్రులకు నా విన్నపమేమంటే…. బోధనా మాధ్యమం విషయాన్ని మరింతగా అవగాహన చేసుకొని, మనందరం పిల్లల్ని తెలుగు మీడియంలోనే చదివిద్దాం.

 

 

నమ్మిన ఆశయాన్ని ఆచరించి చూపిన నాగేశ్వరరావు – ప్రమీల దంపతులకు, వారి పిల్లలకు అభినందనలు.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

 

డిసెంబర్ 2014