నాకీ మతం వద్దు....           (26-Jun-2020)


గత కొద్దిరోజులుగా శబరిమలైలోని స్వామి అయ్యప్ప గుడిలోనికి కొంతమంది స్త్రీ భక్తులు వెళ్ళటానికి ప్రయత్నిస్తే అక్కడున్న పూజారులు, పురుష భక్తులు అడ్డుకుని వెనక్కి పంపిచెయ్యడం అనే వార్త విన్న తర్వాత నాకు కలిగిన భావాలు ఇవి.

 

నేను పుట్టడం హిందూ మతం ఆచరించిన కుటుంబంలో పుట్టాను. నేను చిన్నతనంలో భక్తుడినే. భక్తితో పూజలు చేసే వాడిని. కానీ కొంతకాలం అయిన తరువాత నాకు జాగ్రతగా ఆలోచిస్తే ఇవన్నీ కేవలం నమ్మకాలు తప్పితే ఇందులో నిజం ఏమి లేదని అనిపించింది. తర్వాత ఇంకా వివరంగా పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ మతం ప్రజలకు ఉపయోగపడక పోగా అనేకమైన గొడవలు, యుద్ధాలు, చంపుకోవడాలు వంటి ఘోరాలు తప్పితే ఏ మతం కూడా ఈ ప్రపంచంలో నాకు ఉపయోగపడినట్లు దాఖలాలు కనిపించలేదు. అప్పటి నుండి నేను మతరహితుడు గానే భావిస్తున్నాను. ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలలో Religion అని అడిగినప్పుడు నాకు ఏ మతం లేదని రాస్తున్నాను.

 

సుప్రీం కోర్టు అయ్యప్ప స్వామిని చూడడానికి స్త్రీలు కూడా అర్హులే అని తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద జరుగుతున్న వాదప్రతివాదాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. హిందూ మతస్తులు కొంత మంది ఈ దేశంలో క్రైస్తవ మతం బాగా అభివృద్ది చెందుతోంది, ఎలాగైనా అడ్డుకోవాలి అని అది పెద్ద ప్రమాదంగా, భూతంగా భావిస్తున్నారు. క్రైస్తవ మతం అట్టడుగు ప్రజల సాంఘీక,మానసిక అవసరాలను తీర్చడంతో ఆ మత ప్రచారం బాగా జరుగుతోంది. కానీ దాన్ని చూసి కూడా హిందూ మతస్తులు, ప్రవక్తలు ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యకుండా ఊరకనే ప్రవచనాలు చెప్పడం మూలంగా వచ్చే ఉపయోగం జనానికి ఏమి లేదు. బాగా డబ్బున్న వారికి ఈ ప్రవచనాలు వింటే సంతోషంగానో , ప్రశాంతంగానో ఉండచ్చు కాని తరువాత అన్నీ మామూలే. అట్టడుగు వర్గాల వారికి హిందూ మతం ప్రత్యేకంగా చేసిన కృషి ఏమీ లేదు. మిగతా మతాలను చూసి కూడా వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. అట్లాగే స్త్రీ వివక్ష అనేది మొదట్నుంచి కూడా అన్నీ మతాలలో ఎంతో కొంత ఉంది. హిందూ మతంలో కూడా ఏమీ తక్కువ లేదు.

 

సతీసహగమనానికి వ్యతిరేకంగా రాజారామ్మోహన్ రాయ్ ఒక చట్టంగా తయారుచేయించినప్పుడు అది మతవ్యతిరేకంగానే భావించారు. అట్లాగే కందుకూరి వీరేశలింగం విధవలకు వివాహాలు చేసినప్పుడు కూడా హిందూ మతానికి వ్యతిరేకంగానే భావించారు.

 

ప్రకృతి లో పురుషుడు, స్త్రీ సమానమైన వ్యక్తులు అన్న అత్యంత చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోలేని ఈ మతం నాకు అక్కర్లేదు. నేను హిందువుగా పుట్టినా నేను హిందువుని కాను. నేను మళ్లీ హిందువు గా మారటానికి నాకేమీ ప్రత్యేకమైన ఉపయోగం కనిపించలేదు. ఈ మూఢ నమ్మకం పెరగటం మూలంగా ఇది ముందుముందు మానవాళికి మరింత ప్రమాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

అందుకే నాకు ఈ మతం వద్దు, ఏ మతమూ వద్దు.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి – 23/10/2018