కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు....           (25-Jun-2020)


 21-02-2018వ తేదీన జరిగిన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యక్రమంపై కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు:

 

1. ప్రజల ప్రవర్తనలో మార్పు రావడానికి కార్యకర్తలందరూ నిరంతరం కౌన్సిలింగ్ చేయవలసిందే!
అవకాశం ఉన్నప్పుడల్లా రకరకాల జనసముదాయాలతో స్వచ్ఛ చల్లపల్లి భావజాలాన్ని చర్చిస్తూ ఉండాలి. (ఉదాహరణకు – ఉపాధ్యాయులు, విద్యార్థులు, లయన్స్, రోటరీ, వాసవి, ధ్యానమండలి వంటి స్వచ్ఛంద సంస్థలు, ఆటో-టాక్సీ డ్రైవర్లు, పూల-పళ్ళ వ్యాపారులు, సినీ హీరోల అభిమాన సంఘాలు, వృత్తిసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలు, డ్వాక్రా గ్రూపులు వగైరా వారితో)

 

వార్డులోకి వెళ్ళినప్పుడు వార్డు మెంబర్లను ఆహ్వానించాలి. ఆ వార్డులో ఉండే పెద్దలను కూడా కలుపుకోవాలి. రేపు చెయ్యబోయే కార్యక్రమ ప్రాంతానికి ఈరోజు సాయంత్రమే వెళ్లి ఆ ప్రాంతవాసులతో మాట్లాడి మన కార్యక్రమానికి ఆహ్వానించాలి. కౌన్సిలింగ్ చేయాలి. మనం పనిచేసే ప్రాంతంలోని బాలలను కార్యక్రమంలోకి ఆహ్వానించాలి. ఉదయంపూట కార్యక్రమంలో కూడా 6-00 గంటల నుండి 6-30 వరకు కౌన్సిలింగ్ చేయవచ్చు.

 

స్వచ్ఛ ఇంటికి నిదర్శనంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి జెండా ఎగరవేయవచ్చు.

 

2. కొంతకాలం పాటు వార్డులలో శుభ్రం చేసి ఆ తరువాత మళ్ళీ ఊరి బయట పని చేద్దాం.

 

ఆ ప్రాంతంలోని డ్రెయిన్ లపై కూడా శ్రద్ధ పెట్టాలి.

 

శుభ్రం చేసిన ప్రాంతాల్లో మన బోర్డులను పెట్టవచ్చు.

 

3. హరిత వేడుకలను ప్రోత్సహించడం.

 

క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ప్లాస్టిక్ స్ట్రాలు, ఐస్ క్రీం తినటానికి వాడే ప్లాస్టిక్ స్పూన్లు, ఒక్కరోజుకు మాత్రమే పనికివచ్చే ఫ్లెక్సీలు వాడకుండా ఉండటం గురించి కౌన్సిలింగ్ లో మనం చెప్పాలి.

 

- రోజువారీ జీవితంలోను, వేడుకల లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలో వివరించాలి.

 

ప్లాస్టిక్ మెమెంటోలను, ప్లాస్టిక్ బహుమతులను నిరుత్సాహపరచాలి.

 

మన వంట ఇంట్లో ఉపయోగపడే పదార్థాలను బహుమతిగా ఇవ్వవచ్చు.

 

గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్ కాగితం, రంగు కాగితం కాకుండా మామూలు కాగితంతోనే చేయాలి.

 

4. RMP డాక్టర్లు, మందుల షాపుల వారు SAFENVIRON వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోమని చెప్పాలి. ఇంజెక్షన్ సిరంజిలు, సూదులు, కట్టుగుడ్డలు రోడ్లపక్కన కనపడకూడదు.

 

5. వచ్చే సంవత్సరం వినాయక చవితికి అందరూ మట్టి వినాయకుడినే ప్రతిష్టించేటట్లు చూడాలి.
దీపావళికి మందులు కాల్చడం మానేయడంపై ప్రచారం చేయాలి.
రోడ్ల మీద టపాసులు కాల్వడం వలన రోడ్ల మీద చెత్త పోగడుతుంది. కనుక కాల్చవద్దని చెప్పడం – కాల్చవలసి వస్తే శుభ్రం చేసే బాధ్యత వారే తీసుకోవాలని చెప్పడం.... ఇదంతా పంచాయతీ సహకారంతో చేయాలి.

 

6. వచ్చే సంవత్సరం స్కూల్స్ తెరవగానే చిన్నపిల్లలకు, కాలేజీ విద్యార్థులకు చెప్పటానికి మనం స్కూల్స్ కి, కాలేజీలకు వెళ్లి ప్రచారం చేద్దాం.

 

7. ప్రజలకు మనం ఏమి చెప్తామో వాటన్నింటిని కార్యకర్తలందరూ తప్పక ఆచరించాలి.

 

-ఆచరణ మాత్రమే కదా ప్రభావశీలంగా ఉండేది!

 

8. కార్యకర్తలు చాలా సహనంగా ఉండాలి. జనంలో ఎవరన్నా అనవసరంగా వాదిస్తూ ఉంటే మనమే వెనక్కి తగ్గడం మంచిది.

 

9. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు జాబు కార్డు తీసుకోవచ్చు. NREGS కార్యక్రమాలను మనం చేస్తే ఉద్యమ ఖర్చులకు కొంత సహాయంగా ఉంటుందేమో ఆలోచించాలి.

 

10. సినిమా పోస్టర్లు అతికించేటప్పుడు పాత వాటిని చించి కింద పడేసి కొత్త పోస్టర్లను అతికిస్తున్నారు. కనుక పోస్టర్లు అంటించే వారికి సినిమా హాలు వారికి కౌన్సిలింగ్ చేయాలి.

 

11. కార్యకర్తల సంఖ్య పెరిగితే మరింత త్వరగా ఫలితాలు వస్తాయి. కనుక మన పరిచయస్తులను ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటట్లుగా ఒప్పించాలి.

 

12. ప్రధాన రహదారుల ప్రక్కన ఉన్న ప్రహరీ గోడలకు మంచి రంగులు వేయించి, నినాదాలు రాయించాలి.

సాయంత్రం పూట కౌన్సిలింగ్ కి రాయపాటి రాధాకృష్ణ గారు, గోళ్ళ విజయ్ కృష్ణ, సజ్జా ప్రసాద్ గారు, ప్రాతూరి శాస్త్రి గారు, సామ్రాజ్యం గారు, డా. గోపాలకృష్ణయ్య గారు, గురవయ్య మాష్టారు సమయాన్ని కేటాయిస్తానన్నారు.

 

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
    23-02-2018