ప్రతిభావంతునికి తండ్రి లేఖ....           (30-Nov--0001)


 ప్రతిభావంతునికి తండ్రి లేఖ

 

నాన్నా!

 

నీకు నేను నాన్ననైనా నిన్నలా పిలవడమే నాకిష్టం. మెడికల్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో నీకు మొదటి ర్యాంక్ వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. నీకష్టం ఫలించి నీవు లక్ష్యంగా పెట్టుకొన్న స్పెషాలిటీలోనే డాక్టర్ వి కాబోతున్నావు. నీ లక్ష్యాన్ని సాధిస్తున్నందుకు ఒక తండ్రిగా నాకు అత్యంత సంతోషం. ఎందుకంటే తమ పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో, ఆడిటర్లో, కలెక్టర్లో కావాలని నిర్ణయించడం తల్లిదండ్రుల పనికాదని గట్టిగా విశ్వసించేవాణ్ణి నేను. తమ ఆసక్తిని బట్టి పిల్లలే తమ భవిష్యతును నిర్ణయించుకోవాలి గాని, తల్లిదండ్రుల కోసమో, వారి సంతృప్తి కోసమో తమ అభిరుచులకు భిన్నంగా పిల్లలు నిర్ణయాలు తీసుకోరాదు. ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషీ ఒక ప్రత్యేక వ్యక్తే. తోటివారిని ఇబ్బంది పెట్టకుండా, తనకు కావలసిన విధంగా తను బ్రతకగలగడమే గదా విజయం అంటే!

 

ఈ సందర్భంలో నా అనుభవం ద్వారా తెలుసుకొన్న ఐదారు విషయాలను నీ దృష్టికి తేవాలనే నీకీ ఉత్తరం రాస్తున్నాను.

అందులో మొదటి అంశం నీ ప్రతిభ”. అది కేవలం నీ ఒక్కడి సొంతం కాదు. ఇలా చెప్పడం నీకు ఆశ్చర్యంగా ఉందేమో! చిన్నప్పటి నుండి డాక్టరు కావాలనే లక్ష్యంతో చేసిన నిరంతర శ్రమ వల్లనే నాకీ మొదటి ర్యాంక్అనిపిస్తుందా? కాదనను. కాని, నీ ప్రతిభ వెనుక మూడు నాలుగు తరాల కష్టం ఉంది. అసలెవరికైనా ప్రతిభ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి జెనెటిక్ గా. చర్మం రంగు, కంటి రంగు, జుట్టు, పొడవు వంటి మన రూపురేఖలు మన ముందు తరాల నుండి సంక్రమిస్తాయని మనకు తెలుసు. భావోద్వేగాలు, ఆసక్తులు కూడా అంతే.

 

జీన్స్ (జన్యువులు) ద్వారా వచ్చిన ఈ ప్రత్యేకతలకు మనం పెరిగే వాతావరణం తోడవుతుంది. విద్యపై ఎంతగా ఆసక్తి ఉన్న పిల్లవాడైనా తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక నేపథ్యం వాళ్ళు చదువుకోవడానికి తగిన వాతావరణం లేకపోతే రాణించలేడు. మైదానాలలో పెరిగిన పిల్లలకున్న అవకాశాలు లేక, ప్రభుత్వ ప్రోత్సాహాలు అందని గిరిజన తెగలలోని చురుకైన పిల్లలు ఒకప్పుడు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయేవారు. కాస్త అటూ ఇటూగా అత్యధిక శాతం పిల్లల తెలివితేటలు సమానంగానే ఉంటాయి. ఆసక్తులు, బలాబలాలే భిన్నంగా ఉంటాయి. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ అభిరుచులు, శక్తియుక్తులు ఒకేవిధంగా ఉండకపోవచ్చు. అతి తక్కువమంది పిల్లల్లో మాత్రం అసాధారణ ప్రతిభ ఉట్టి పడుతుంది. ఐతే, తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి కొంతైనా ప్రోత్సాహం ఉంటేనే వారి ప్రతిభ అయినా రాణించేది.

 

మన ముందుతరాల నుండి సంక్రమించిన తెలివితేటలు, కష్టించి పనిచేసే తత్త్వం, ఇంటి వాతావరణం, సామాజిక ప్రోత్సాహం ఇవన్నీ వెరసి మన ప్రతిభ! ఉదాహరణకు నీ విషయమే తీసుకొందాం. మీ ముత్తాత గారు నిరక్షరాస్యుడు. వ్యవసాయంలో కాయకష్టం చేస్తూ, మీ తాతగారిని టీచరు ఉద్యోగం చేసేంత చదువు చదివించారు. మీ తాతగారు నా ఆసక్తిని, పట్టుదలను గమనించి, ప్రోత్సహించి ఎం.బి.బి.ఎస్. చదివించారు. నీ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లుగా ఉండటం, చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే నీ అభిరుచి, అందుకు నీ పెద్దల నుండి అందిన ప్రోత్సాహం, నీ కఠోర శ్రమ ఇవన్నీ కలిస్తేనే ప్రవేశ పరీక్షలో నీ ఫస్ట్ ర్యాంక్! ఇలా ప్రతిభ చూపే ఎవరి వెనుకైనా రెండు మూడు తరాల కష్టం ఉంటుంది లేదా తోటి సమాజం యొక్క ప్రోత్సాహం ఉంటుంది అని నా అభిప్రాయం.

 

ఇక్కడ మరొక అంశం కూడా ప్రస్తావించాలి. నీ జీన్స్, నీవు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం మాత్రమే కాక, పరోక్షంగా మరొక అదృశ్య హస్తం నీ విజయం వెనుక దాగి ఉంది. మన కులమతాలకు, రంగుకు, ప్రాంతానికి కాదు దేశానికే చెందని ఒకానొక వ్యక్తికి ఈ విజయంలో మనం రుణపడి ఉండాలి. కృష్ణానదిపై ఆనకట్ట వల్ల లక్షలాది ఎకరాల సాగును కల గని, అప్పటి ఆంగ్ల ప్రభుత్వాన్ని ఒప్పించి, స్వీయ పర్యవేక్షణలో కట్టించి, కృష్ణా, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసి, ఆర్థిక పరిపుష్టి చేకూర్చిన సర్ ఆర్థర్ కాటన్మహాశయుని మనం మరువకూడదు. మన తాత ముత్తాతల వలెనే ఆయనా మనకు ఆరాధ్యుడే!

 

రెండో విషయం మన జీవిత లక్ష్యం

 

వైద్య వృత్తిని స్వీకరించాక మన లక్ష్యం వృత్తిపరమైన తృప్తి” (PROFESSIONAL SATISFACTION) పొందుతూ ఉండడమే తప్ప, డబ్బు సంపాదనలో మునిగి తేలడం కాదని నా అభిప్రాయం. వ్యాపారాలలో వలె విపరీతమైన సంపాదన లేకపోవచ్చుగాని, నిజాయితీగా కష్టపడి పనిచేసే డాక్టర్ని ఈ దేశంలో ఏ మూలకు వెళ్ళినా జనం బ్రతికించుకుంటారు, గౌరవిస్తారు. తన కనీస అవసరాలకు, కుటుంబ పోషణకు, బిడ్డల భవిష్యత్తు స్థిరపరచుకోవడానికి ఢోకాలేనిది వైద్య వృత్తి. డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా పెట్టుకొంటే ఎప్పటికైనా మిగిలేది అసంతృప్తే! ఎంత సంపాదించినా మనను మించిన ధనవంతుడు కనపడుతూనే ఉంటాడు. ఈవృత్తి ద్వారా బిల్ గేట్స్, వారన్ బఫెట్ స్థాయికి చేరడం అసాధ్యమూ, అనవసరమూ కూడా! మన దగ్గరకు వచ్చిన రోగి బాధను విని, పరీక్షించి, జబ్బు కనిపెట్టి అతడిని వెతల నుండి విముక్తి చేసినప్పుడు కలిగే తృప్తే వృత్తిపరమైన తృప్తి. ఐతే, అన్నిసార్లూ మనం జబ్బు కనిపెట్టలేకపోవచ్చు. లేదా ఆ జబ్బు వైద్యంతో తగ్గకపోవచ్చు. నమ్ముకొన్న రోగులకు సాధ్యమైనంత ఉపశమనం ఇవ్వడమే మన పని.

 

ఇక మూడో విషయం

 

మనం రోగులకు చేయగలిగిందంతా శక్తివంచన లేకుండా మనస్పూర్తిగా చేయాలే తప్ప వారి కృతజ్ఞతను ఆశించవద్దు. మా ముందుతరాల డాక్టర్లు పొందినంత గౌరవం బహుశా మేం పొందలేదు. కొద్దిగానే సైన్సు’, ఎక్కువ భాగం కళగా ఉండేది ఒకనాటి వైద్యం. రానురానూ అది ఎక్కువభాగం సైన్స్అతి తక్కువ కళాత్మకంగా మారిన క్రమంలో రోగుల డబ్బు మరింత ఎక్కువగా ఆవిరైపోతున్నది. వైద్యంలో మానవతా స్పర్శ మాత్రం నానాటికీ తగ్గిపోతున్నది. వైద్య వృత్తిని డబ్బు శాసించడం పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల పట్ల సమాజంలో గౌరవం తరిగిపోతున్నది. మన ఊరులో వెంకట కృష్ణయ్య గారని ఒక డాక్టర్ ఉండేవారు. 40 ఏళ్ళకు పైగా వైద్య వృత్తిలొ ఉన్న ఆయన ఏనాడూ ఏరోగినీ డబ్బు అడగలేదు. రోగులను డబ్బు అడగరాదనీ, చేయవలసిన వైద్యసేవ చేశాక ఇచ్చినంత మాత్రమే పుచ్చుకోవాలనీ ప్రాక్టీసు పెట్టిన మొదటిరోజే ఆయన నిర్ణయించుకున్నారట. రోగులు తమంతట తామే వారి కుటుంబం తరపున సంవత్సరానికి వందో, నూట ఏభయ్యో ఇచ్చేవారు. చల్లపల్లి నుండి నిష్క్రమించిన చాలా ఏళ్ల తర్వాత ఆయన ఈరోజుకు కూడా మన ప్రాంత ప్రజల హృదయాలలో చెరిగిపోని ఒక అద్భుత జ్ఞాపకం!

ఐతే ఆయన మాకిచ్చిన సలహాను కూడా నీవు గుర్తుంచుకో. చల్లపల్లిలో వైద్య వృత్తి ప్రారంభిస్తున్నామని ఆయన్ని కలిసి చెప్పినప్పుడు తన సేవలను పొందిన కొందరు ఆర్థిక స్తోమతు ఉండి కూడా డబ్బు ఇవ్వని విషయం ప్రస్తావించి, “మీరు మాత్రం వైద్య సేవలకు ప్రతిఫలం అడగరాదనే సిద్ధాంతం పెట్టుకోవద్దు. నిజాయితీగా సేవ చేసి, తగినంత ఫీజు తీసుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారుఅని హితబోధ చేసారు. ఈ సంగతిని నీతో ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కొందరు తమకు ఫలితం బాగున్నప్పుడు మనం చేసిన చిన్న సేవను కూడ మరీ మరీ పొగుడుతారు. పొంగిపోవద్దు. ఎంతో పెద్ద సేవ పొంది కూడా దూషిస్తారు మరికొందరు. దిగులు పడవద్దు. జనంలో కొందరి పోకడ అలానే ఉంటుంది. ఏ విషయంలోనైనా మన అంతరంగమే మన న్యాయమూర్తి.

 

నాలుగో అంశం

 

ప్రతిభామూర్తులంతా మాతృదేశం వదలి పరదేశాలకు పయనమౌతున్న ప్రస్తుత కాలంలో మన దేశస్తుల కష్టార్జితంతో చదువుకుంటున్నావు కనుక ఉన్నత విద్యానంతరం నీ దేశప్రజలతోనే ఉంటూ, సేవలందించాలనే నీ నిర్ణయం నాకు అత్యంత సంతోషదాయకం. ఇక్కడి ప్రభుత్వ ఖర్చుతో చదువుకొన్న డాక్టర్లు ధన-కనక-వస్తు-వాహనాల కోసం ధనిక దేశాలకు వెళ్ళడం స్వార్ధమనే నా ఉద్దేశం. ఐతే మానవాళి మొత్తానికీ ఉపయోగపడే పరిశోధనల కోసమే ఐతే ఏ దేశం వెళ్ళినా తప్పు కాదు.

 

ఐదో సంగతి

 

మనం ఎంత గొప్ప వైద్యవిద్య నేర్చుకున్నా, మన వైద్య విధి విధానాలను రూపొందించేవి ప్రభుత్వాలే. అంటే ఆ ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలే. అలా రూపొందిన విధానాలు ప్రజల మేలు కోరుతాయా? ప్రజలను బలి చేస్తూ, కార్పొరేట్ల కొమ్ము కాస్తాయా అనేది గమనిస్తూ ఉండాలి. వైద్యంలో ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టటానికి పాటుపడే, ఒత్తిడి పెంచే సంఘాల (PRESSURE GROUPS)తో నిరంతర సంబంధాలు కలిగి ఉండటం మన బాధ్యత.

 

ఆఖరుగా…. ఈ జీవితం తర్వాత మరో జీవితం లేదని మనకు తెలుసు. ఇప్పటివరకు జరిగిన జీవ పరిణామ క్రమంలో చిట్టచివరి అద్భుత జీవులైన మానవులం మనం. ఈ భూమి మీద మన వంతు బాధ్యతాయుత పాత్రను సజావుగా నిర్వహించి, సంతోషపడదాం.

 

చిన్నప్పటి నుండి నీవు వేసిన ప్రతి అడుగూ నాకు సంతోషాన్నే ఇచ్చింది. నీ విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన విజ్ఞాన ప్రస్థానం నాకు గర్వకారణం. నీ గతానికీ, భవితవ్యానికీ సంధి సమయమైన ఈరోజున పాతకాలపు నీతి పద్యభావం ఒకటి నా మదిలో మెదలుతున్నది. పుత్రుడు జన్మించినంత మాత్రాన పుత్రోత్సాహం కలగదు, అతని సుగుణాలను, ఆదర్శాలను ప్రజలు మెచ్చినప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం!”.

 

నీ భావి జీవితం ఇదే వరవడిలో సాగాలని ఆశిస్తూ

 

మీ నాన్న

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి, చల్లపల్లి

కృష్ణాజిల్లా – 521 126

సెల్ – 9885051179