కార్యకర్తలు ఎలా తయారవుతారు?....           (25-Jun-2020)


మరింత మెరుగైన సమాజం కోసం ప్రజలలో పనిచేసే కార్యకర్తలలో చర్చ కోసం……

 

 

కార్యకర్తలు ఎలా తయారవుతారు?

 

ఒక ఉద్యమానికి కాని, వ్యవస్థకి కాని కార్యకర్తలే ఆస్తి. ప్రతి మనిషి తనకు ఇబ్బంది లేనంత వరకు ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉంటుంది, అన్యాయాన్ని ఎదిరించాలనీ ఉంటుంది. నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం సరైన తత్త్వచింతన (Philosophy)తో ఉద్యమాన్ని నడిపిస్తున్నప్పుడు అనేకమంది ఆ ఉద్యమంలో పని చేయటానికి సిద్ధం అవుతారు.

 

బ్రిటిష్ వారి పాలనపై తీవ్రమైన నిరసన భారతదేశ ప్రజలలో ఉండేది. మహాత్మా గాంధీ లాంటి అనేకమంది నిస్వార్థంగా పనిచేసే నాయకుల స్ఫూర్తితో లక్షలాది మంది జనం జాతీయోద్యమంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తయారైన అనేకమందికి గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వారు ఆదర్శంగా కనిపించేవారు. పి.సి. జోషి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, జ్యోతి బసు, ప్రమోద్ దాస్ గుప్తా, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, ఎ.కె. గోపాలన్ లాంటి కాకలు తీరిన యోధుల స్ఫూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు తయారయ్యారు.

 

పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, అన్నాదురైల నాయకత్వంలో వేలాదిమంది కార్యకర్తలు ద్రవిడ ఉద్యమాన్ని కొనసాగించారు.

 

దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ తన జీవితంలో మూడవ వంతు భాగాన్ని జైలులో గడిపిన నెల్సన్ మండేలా త్యాగం వలన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యారు.

 

లెనిల్ నాయకత్వంలోని బోల్షవిక్ పార్టీ కార్యకర్తల వలన రష్యాలో విప్లవం విజయవంతం అయింది.

 

ఇలా ఎన్ని ఉద్యమాల నాయకులను గమనించినా అందరి నాయకులలో కనిపించే అంతఃసూత్రం ‘తన కోసం కాకుండా సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయడం’, ‘నిరాడంబర జీవితం’, ‘తాను చేసేదే చెప్పడం – చెప్పిందే చెయ్యడం’, ‘కార్యకర్తలను గౌరవించడం – వారి ఇబ్బందులను గమనించి పరిష్కరించడం’. నాయకునికి లాభాపేక్ష ఉంటే స్వలాభం కోసం వచ్చే అనుచరులు ఉంటారు తప్పితే నిజమైన కార్యకర్తలు తయారు కారు. అలాగే కార్యకర్తలను అగౌరవపరిస్తే ఎవరూ మిగలరు.

 

తమ సమయం, శక్తీ, మేధస్సులలో కొంతభాగాన్ని కాని, పూర్తిగా కాని సమాజం కోసం కేటాయించేవాడే నాయకుడు. అటువంటి నాయకులే కార్యకర్తలు తయారవటానికి ప్రేరణ కలిగిస్తారు.

 

సమాజంలో ఆర్థికంగా గాని, సాంఘికంగా గాని అన్యాయం జరుగుతున్నప్పుడు, పర్యావరణానికి హాని కలుగుతున్నప్పుడు వీటి పరిష్కారానికి ఉద్యమాలు తయారవుతాయి. ఆ పరిస్థితులలో నిస్వార్థము, త్యాగము, ధైర్యము కలిగిన నాయకత్వం ఉంటే కార్యకర్తలు తయారవుతారు.

 

కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోయినా, వారి సూచనలకు ఏమాత్రం విలువ లేకపోయినా సిద్ధాంతానికి అనుగుణంగా నాయకత్వం తగిన ఎత్తుగడలు అనుసరించ లేకపోతున్నా, సంస్థ చేస్తున్న తప్పులను ఇక సరిదిద్దలేము అని నిర్ణయించుకున్నా కార్యకర్తలు మిగలరు.

 

నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలతో ఆ సంస్థ నడుస్తూ ఉంటే కార్యకర్తలు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు.


- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

  10-03-2017