జలాలను కలుషితం చెయ్యవద్దు....           (25-Jun-2020)


పట్టిసీమ ప్రాజెక్ట్ నుండి నీరు వదిలిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మరికొంతమంది మంత్రులు, అధికారులు ‘జల హారతి’ ఇచ్చినట్లుగా దినపత్రికల్లో చూస్తున్నాము. గత సంవత్సరం కూడా రాష్ట్రమంతటా నదీజలాలన్నింటిలోనూ, కాలువల్లోను ఈవిధమైన జలహారతులు ఇచ్చి పూలను నీళ్ళలో జల్లటం మనందరం చూశాం.

 

దేవాలయాల్లోనూ, ఇళ్ళల్లో చేసుకునే పూజలనంతరం, శవదహనం అనంతరం వచ్చే పూలు, పూలదండలు నదుల్లో గానీ, కాల్వలలో గాని పడెయ్యటం ఎప్పటి నుండో ఉన్న అలవాటు.

 

వీటన్నింటి వలన పవిత్రమైన మన జలాలన్నీ కలుషితమైపోతున్నాయి. ఈ అలవాట్లను మనం మార్చుకోక తప్పదు. జలహారతి ఇవ్వాలనుకుంటే ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు. లేదా తప్పదు అనుకుంటే అక్కడ హాజరైన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ఒక పువ్వు వేసి సరిపెట్టవచ్చు. పూజల తరువాత వచ్చే పువ్వులను కాలువలలో వేయడం మానుకోవలసిందే! ఇటీవల చల్లపల్లి లోని అయ్యప్ప భక్తులందరూ కలిసి పూజలఅనంతరం పూలమాలలను కాలువలలో వెయ్యవద్దని నిర్ణయించుకోవటం హర్షణీయం.

 

చితాభస్మాలను కాశీకి తీసుకు వచ్చి గంగలో కలపవద్దని ఇటీవల ఒక కేంద్రమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంగా నదీ కాలుష్యాన్ని అరికట్టాలంటే ఈ అలవాటుని మానుకోక తప్పదని వారు ఎంతో వినమ్రంగా అభ్యర్ధించారు.

 

మనం కూడా మన రాష్ట్రంలోని నదులలోను, పంటకాల్వల లోను ఎటువంటి వ్యర్ధాలను కలపకుండా ఆ నీటిని శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకుందాం.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
తేది : 21-06-2018