ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపము....           (25-Jun-2020)


జనవరి 1, 2019 నుండి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 23, 2018 నుండి అనేక ప్లాస్టిక్ వస్తువులను – ముఖ్యంగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. ఈ రెండు రాష్ట్రాల చర్యలు పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా దోహదపడతాయి.

 

గత సంవత్సరం విజయవాడలో జరిగిన ‘నవనిర్మాణ దీక్ష’లో జూన్ 6వ తేదీన ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం’ తరపున ప్రభుత్వానికి 5 సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలను అమలు చేస్తే రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం ప్రభుత్వ అధికారంతో స్వచ్చాంధ్ర ప్రదేశ్ ని సాధించడంలో ముందడుగు వెయ్యవచ్చని చెప్పడం జరిగింది.

 

ఆరోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించినవి:

 

1. చెత్తను రోడ్ల మీద వేస్తే జరిమానా విధించాలి. ఇళ్ళు, దుకాణాలు, కార్యాలయాలు, రకరకాల వ్యాపారసంస్థలు తమ భవనాలను, పరిసరాలను శుభ్రం చేసుకున్న తరువాత చెత్తనంతా రోడ్ల పక్కన గాని, డ్రెయిన్ లో గాని, కాల్వలలో గాని పారవెయ్యడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ప్రతిరోజూ చెత్తను సేకరించే బండి వస్తున్నా కొంతమంది ఈ అలవాటుని మార్చుకోరు. అటువంటి వారికి జరిమానా వేస్తేనే ఫలితం వస్తుంది.

 

2. కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్ల లోపు క్యారీబ్యాగులను నిషేదించింది. కానీ ప్రతి ఊళ్ళోను ఇవి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. అధికారులు ఈ నిషేదాన్ని గట్టిగా అమలు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది.

మన రాష్ట్రంలో 100 మైక్రాన్ల లోపు క్యారీబ్యాగులను, ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ టీ కప్పులను, ప్లాస్టిక్ విస్తరాకులను, తగరం విస్తరాకులను, థర్మోకోల్ ప్లేట్లను నిషేధించి గట్టిగా అమలు చేస్తే మరింత ఫలితం ఉంటుంది.

 

3. ప్రతి ఊరిలో రోడ్డు మార్జిన్ నుండి డ్రెయిన్ వరకు ఎత్తు లేకుండా చేయాలి. దీనివలన రోడ్డు మీద పడిన వర్షపు నీరు సరాసరి డ్రెయిన్ లోకి ప్రవహిస్తుంది. మార్జిన్ కంటే బరంతు ఎత్తుగా ఉంటే రోడ్లపై నీళ్ళు నిలిచి రోడ్లు తొందరగా పాడవుతాయి.

 

4. డ్రెయిన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ఇలా చెయ్యడం వలన అవసరం అయినప్పుడు డ్రెయిన్లు శుభ్రం చెయ్యడం తేలిక అవుతుంది.

 

5. ఒక్కసారి వాడి పారేసే ఫ్లెక్సీలను నిషేధించాలి. ఫ్లెక్సీలు ప్లాస్టిక్ తో చేయబడతాయి. ప్రతి సందర్భం లోను అనేక ఫ్లెక్సీలు తయారు చేయబడుతున్నాయి. వీటిని పారవెయ్యడం చాలా కష్టం. కనుక ఎక్కువ రోజులు ఉపయోగపడే ఫ్లెక్సీలు మినహా మిగతా వాటిని నిషేధించాలి. ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలలో వాడకుండా ఉంటే నమూనాగా ఉంటుంది.

 

ఈ ఐదు పనులు చేయడానికి పాలనాపరమైన చర్యలు చాలు. డబ్బుతో పనిలేదు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వీటిని పాటించి ఉంటే దేశంలోనే వీటిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉండేది. ప్రజలను ‘క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు’ అని మేము ప్రచారం చేస్తున్నప్పుడు ‘ప్రభుత్వమే వీటిని నిషేధిస్తే మనకు ఈ సమస్యే ఉండదు కదా’ అని ప్రజలు మాతో అనేవారు. మార్కెట్ లో ఇవన్నీ అందుబాటులో ఉండి జనచైతన్యంతోనే వీటిని రూపుమాపటం అనేది ఎంతో సాంఘిక ఉద్యమం జరిగితే తప్ప సాధ్యం కాదు. ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ఉద్యమం ద్వారా మేము చల్లపల్లిలో కొంతవరకు దీనిని సాధించినా ప్రభుత్వం శాసనం చేసి గట్టిగా అమలుచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన చెప్పబడిన 5 నిర్ణయాలను అమలుచేస్తే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల వలె ప్రజల మెప్పును పొందటమే కాకుండా స్వచ్చాంధ్ర ప్రదేశ్ కు మార్గం సుగమం కాగలదు.

 

 

-   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
    స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల తరఫున
    24-06-2018