గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని అనుభవాలు – గుణపాఠాలు....           (23-Jun-2020)


మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న వ్యక్తులలో, సంస్థలలో చర్చ కోసం….. -2-

 

గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని అనుభవాలు – గుణపాఠాలు

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

 

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాల నుండి ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో తమ ఆసక్తిని బట్టి పనిచేస్తూ ఉన్నారు.

 

మేము గత నాలుగేళ్ళుగా ఇలా పనిచేస్తున్న వ్యక్తులతోను, సంస్థలతోను మాట్లాడటం, అనుభవాలు పంచుకోవటం జరుగుతోంది. అనేకమంది మిత్రుల అనుభవాలను క్రోడీకరించి నాకు తెలిసిన ఈక్రింది సమాచారాన్ని మన గ్రామాలను బాగు చేయాలనుకుంటున్న దాతలకు, సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు అందచేయాలనే చిరు ప్రయత్నం చేస్తున్నాను.

 

రెండు విభాగాల్లో ఈ స్వచ్ఛంద సేవ జరుగుతోంది.

 

1. మౌలిక వసతుల కల్పన (Infrastructure of the village)

 

2. ప్రజల ప్రవర్తనలో గుణాత్మకమైన మంచి మార్పు తీసుకు రావడం (Qualitative & Behavioral change)

 

మౌలిక వసతుల కల్పన (Infrastructure of the village)

 

1. సిమెంట్ రోడ్లను వేయించటం

 

2. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో…

   

    A) భవనాలను, ప్రహరీ గోడలను, మరుగుదొడ్లను కట్టించడం

 

    B) Digital Class లకు కావలసిన సరంజామా అందజేయటం

   

    C) ఉపాధ్యాయులు లేని చోట సొంత ఖర్చుతో నియమించటం

   

    D) విద్యార్థులకు ఆర్ధిక సహాయం చెయ్యడం, వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చెయ్యడం, నైపుణ్యాల

         అభివృద్ధికి సహాయం చెయ్యడం

 

3. రక్షిత మంచినీటి పథకానికి సహకరించడం

 

4. వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించటం, కట్టుకునే వారికి సహాయం చెయ్యటం

 

5. పబ్లిక్ టాయిలెట్లను నిర్మించటం, నిర్వహించటం

 

6. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులను, పచ్చదనాన్ని అభివృద్ధి చెయ్యడం

 

7. లాభాపేక్ష లేని ఆసుపత్రులను నిర్మించి, నిర్వహించటం

 

8. పారిశుద్ధ్య వ్యవస్థను నిర్మించటం , నిర్వహించటం

 

ఇలాంటి రంగాలలో అనేక సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్నారు.

 

అనుభవాలు:

 

కొంతమంది విజయవంతంగా తాము అనుకున్న ప్రాజెక్ట్ లను పూర్తి చెయ్యగలుగుతున్నారు. అనేకమందిలో అసంతృప్తులూ వ్యక్తం అవుతున్నాయి.

 

అసంతృప్తులలో కొన్ని:

 

1. తమ ఊరి కోసం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఊరి ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపించక     పోవడం, పాల్గొనకపోవడం.

 

2. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించిన వారికి మాత్రం ప్రభుత్వం ఇచ్చే 15,000/- రూపాయలు సక్రమంగానే అందుతున్నాయి. వీటికి తప్పితే ప్రభుత్వం వైపు నుంచి డబ్బు రావలసిన మిగిలిన అన్ని పథకాలకు

(ఉదాహరణకు పబ్లిక్ టాయిలెట్లు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం వగైరాలు) సక్రమంగా అందటం లేదు. ప్రభుత్వ నిబంధనలు, కాలయాపన వల్ల ఆ డబ్బు సకాలంలో అందకపోవడమో, అసలే రాకపోవడమో, కొన్నిచోట్ల ఆ డబ్బు విడుదల చెయ్యటానికి పర్సెంటేజీలు ఆశించడమో జరుగుతోంది.

 

తమ గ్రామాలకు సేవ చేస్తున్నవారిలో అనేకమంది ఈ రెండు రకాల అసంతృప్తులతో విసిగిపోతూ సాంఘిక మాధ్యమాలలో తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు.

 

కొందరు దాతల అభిప్రాయాలు పరిశీలిద్దాం.

 

80వ దశకంలో అమెరికా వెళ్లి స్థిరపడిన గుంటూరు జిల్లాకి చెందిన ఒక ఇంజనీర్ పది సంవత్సరాల తరువాత తన గ్రామంలో చాలామందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తెలుసుకుని అన్ని కుటుంబాలకు తన సొంత డబ్బుతో మరుగుదొడ్లను కట్టించారు. మరుసటి సంవత్సరం ఆయన తన ఊరికి వచ్చినప్పుడు నూటికి పది మంది కూడా ఆ టాయిలెట్లను వాడటం లేదని గమనించారు. మిగిలినవారు పిడకలు, పేళ్ళు దాచుకోవటానికి స్టోర్ రూమ్ గా ఉపయోగిస్తున్నారని తెలుసుకుని చాలా బాధ పడ్డారు. ఇటువంటి అనుభవం ఈమధ్యన కూడా అనేకమందికి ఎదురైంది.

 

కొన్నిచోట్ల ప్రవాస భారతీయులు ఊరి అభివృద్ధి కోసం తాము కేటాయించిన డబ్బులో కొంతభాగాన్ని స్థానిక నిర్వాహకులే వాడుకోవటం జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఒక వ్యాపారవేత్త కృష్ణాజిల్లాలోని తమ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించటం, మంచి పాఠశాల భవనాన్ని కట్టించటంతో సహా తన సొంత డబ్బుతో మరెన్నో మౌలిక సదుపాయాలను కల్పించారు. కానీ స్థానిక ప్రజల భాగస్వామ్యం ఈ కార్యక్రమాల్లో లేకపోగా “ఆయన బాగా సంపాదించి, ఏం చేసుకోవాలో తెలియక ఇలా ఖర్చుపెడుతున్నాడులే”, ‘టాక్స్ ఎగ్గొడతానికి చేస్తున్నాడులే’ అనే వ్యాఖ్యానాలతో ఆయన బాధపడుతున్నారని ఈ పనులన్నింటినీ చేయిస్తున్న ఇంజనీర్లు చెప్పారు.

 

తమకు తగిన గుర్తింపు రావడం లేదనే కారణంతో కొన్నిచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులు అడ్డు తగులుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెండు వర్గాలను కలుపుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చెయ్యడం కత్తి మీద సాములాగా ఉందని చెప్తున్నారు. కొన్నిచోట్ల కుల సమస్యలు కూడా వీటికి తోడవుతున్నాయి. దాతలకు మంచిపేరు రావడం కూడా కొంతమందికి గిట్టడం లేదని, తమ రాజకీయ అభివృద్ధికి అడ్డొస్తారేమోననే భయం వారిలో కనిపిస్తోందని ఈ కార్యక్రమాల నిర్వాహకులు చెప్తున్నారు. స్థానికంగా ఉండే రాజకీయ, అధికారిక అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగటం కష్టమౌతోందట. చల్లపల్లిలో మాకు మాత్రం ఈ సమస్య లేదు.

 

అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఎందుకు పట్టించుకోవటం లేదు?

 

సమిష్టి తత్త్వం లోపించటం వల్ల జనంలో ఎక్కువమంది తమకు వచ్చే తక్షణ లబ్ది గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలను గతంలో వలే తమ అవసరంగా భావించటం లేదు.

 

ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకు రావటం
అన్నిటికంటే కీలకమైన విషయం – గతంలో ఉన్న అశాస్త్రీయమైన అలవాట్లను మార్చటం. ఉదాహరణకు-

 

 బహిరంగ మలవిసర్జన మాని వ్యక్తిగత మరుగుదొడ్లు వాడేట్లు చేయాలి.

 

 చెత్తను రోడ్ల మీద, డ్రెయిన్లలోనూ, కాల్వలలోనూ వేసే అలవాటుని మాన్పించాలి.

 

 బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం మాన్పించాలి.

 

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మాన్పించాలి.

 

 సమిష్టి సంక్షేమంలో మాత్రమే వ్యక్తి క్షేమం నిలుస్తుందని ప్రజలు గుర్తించాలి.

 

మౌలిక సదుపాయాలను డబ్బుతో కల్పించవచ్చు. గ్రామానికి దూరంగా ఉండి వేరే దేశంలో ఉన్నా కూడా తమ మనుషులతో పనులు నిర్వహించవచ్చు. స్థానికంగా ఉండి తమ సమయాన్ని ప్రతిరోజూ లేదా వీలైనంత తరచుగా ప్రజలతో చర్చిస్తూ ఉంటేనే ప్రజలలో పాత అలవాట్లను మార్చటం సాధ్యం అవుతుంది.

 

రామన్ మెగసెసే బహుమతి విజేత డాక్టర్ రజనీకాంత్ అరోలి తరచుగా ఇలా అనేవారు: “ఎంత అద్భుతంగారచించబడిన కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదు”.
ప్రజలు తమకది అవసరమని భావించాలి. ప్రజలు అర్థం చేసుకోనిదే, చైతన్యవంతులు కానిదే, కోరుకోనిదే ఏదీ జయప్రదం కాదు.

 

ఎలా చేస్తే బాగుంటుంది?

 

ఉదాహరణకు- ఒక ఊరిని బహిరంగ మలవిసర్జన రహితంగా చేయాలనుకుంటే – ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టాలి, ప్రతి కార్యాలయంలోను, జనసమ్మర్ధం ఉండే ప్రదేశంలోనూ సామూహిక మరుగుదొడ్డి కట్టాలి. ప్రజలకు గతంలో ఉన్న అలవాటుని మార్చుకోవాలని అనిపించదు. చెంబు నీళ్ళతో అయిపోయే పనికి బక్కెట్ నీళ్ళు కావాల్సి రావడం వారికి సమస్యగా అనిపించవచ్చు. ఆరుబయలుకి వెళ్ళడం హాయిగా ఉండి చిన్న గదిలో కూర్చోవడం ఇరుకుగా, ఇబ్బందిగా ఉండవచ్చు. కనుక వారి దృష్టిలో ఇది అవసరం లేని విషయం.

 

ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే టాయిలెట్ అవసరం అని వాళ్లకి అనిపించేట్లుగా ప్రేరణ కల్గించాలి (Motivation). అందుకు కొంతకాలం పాటు బహిరంగ మలవిసర్జన వలన వచ్చే రోగాల గురించి, అదొక అనాగరిక ఆచారమనే విషయం గురించి అవగాహన కల్పించాలి. వారికి నిజంగా అర్ధమైనా కొద్దిమంది మాత్రమే సొంత టాయిలెట్ కట్టుకోవటానికి ఇష్టపడతారు, మిగిలినవారందరూ తేలిగ్గా తీసుకుంటారు.

 

Motivation (ప్రేరణ) కార్యక్రమం అయిన తరువాత వారికి అవసరం అనిపించడానికి కొన్ని “తప్పనిసరి పరిస్థితులను” కల్పించాలి.

 

ఉదాహరణకు- ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిని పొందాలంటే– అంటే పబ్లిక్ కుళాయి కనెక్షన్ కావాలన్నా, పంచాయతీ నుండి ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా, ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు పొందాలన్నా తమకు టాయిలెట్ ఉండాలనే నిబంధన విధిస్తే – అప్పుడు తప్పక టాయిలెట్ కట్టుకోవడానికి ముందుకు వచ్చి మాకు కట్టిపెట్టమని అడుగుతారు. వారు అడిగినప్పుడు మనం కట్టిపెడితే మాత్రమే దానిని వారు సద్వినియోగం చేసుకునే అవకాశం ఎక్కువ.

 

గ్రామంలోని ఒక వీధిలో ఒక దాత సిమెంట్ రోడ్డు వేయించాలని అనుకుంటే ముందుగా ఆ వీధివారందరితో సమావేశం ఏర్పాటు చేసి సిమెంట్ రోడ్డు వల్ల ఉపయోగాలను వివరిస్తూ వారందరూ సహకరిస్తేనే తాను ధన సహాయం చేసి వేయిస్తానని చెప్పాలి. వారికి అంగీకారం కాకపోతే ఈ ధనాన్ని మరో ప్రాజెక్ట్ లో ఉపయోగిస్తానని, ఏ సంగతీ ఫలానా సమయం లోపల సమాచారం ఇవ్వాలని చెప్పి వెళ్లిపోవాలి. ఆ తరువాత ఆ వీధివారందరూ సమావేశమై “ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, మన వీధికి సిమెంట్ రోడ్డు వస్తే ఉపయోగంగా ఉంటుంది” అని తీర్మానించుకుని ఆ దాతను అభ్యర్ధిస్తే రోడ్డు వేసే క్రమంలో వచ్చే ఇబ్బందులన్నీ వారు సంతోషంగానే స్వీకరిస్తారు. వారికి సంబంధం లేకుండా రోడ్డు వేసుకుంటూ వెళ్తే కొంతమంది చిన్నచిన్న విషయాల్లోనే పోట్లాడడానికి సిద్ధపడతారు. ఇటువంటి సంఘటనలతో దాతలకు, కార్యకర్తలకు నిరుత్సాహం కలుగుతుంది.

 

ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా కొంతకాలం పాటు

 

1. ప్రేరణా కార్యక్రమం జరగాలి.

 

ఆ తర్వాత

 

2. ప్రజలకు ఆ కార్యక్రమం యొక్క అవసరాన్ని కల్పించి వారు కోరుకునేట్లు చేయాలి.

ఇలా అయితేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది.

 

ఒక అనుభవం: (Case Study)

 

కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం లోని రేగుల్లంక ఒక చిన్న గ్రామం. గ్రామస్తులంతా చిన్న రైతులో లేక వ్యవసాయ కార్మికులో. ఎవరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. ‘ఆర్ధిక సమతామండలి’ అనే సంస్థ ఆ ఊరిలో అన్ని ఇళ్ళకూ ‘Ecosan Toilets’ కట్టాలని నిర్ణయించుకుంది. మామూలు సెప్టిక్ టాయిలెట్స్ లా కాకుండా Ecosan Toilets ఉపయోగించటం వేరుగా ఉంటుంది. ఆరు నెలల తరువాత మలం అంతా ఎరువుగా మారిపోతుంది. ఈ ఎరువుని చేతితో పట్టుకున్నా ప్రమాదం ఏమీ ఉండదు. దానిని వారి పెరటిలో ఉండే మొక్కలకే ఉపయోగించుకోవచ్చు. అసలు మరుగుదొడ్డే లేని ఊర్లో మరుగుదొడ్డి ఉపయోగించటానికి, అందులోనూ ఈ ప్రత్యేకమైన టాయిలెట్లను ఎలా వాడుకోవాలో కావలసిన చైతన్యం తేవటానికి వారు ఆ ఊరి ప్రజలతో మమేకమై వారి అవసరాలకు సహాయం చేస్తూ వారి నమ్మకాన్ని చూరగొన్నారు. టాయిలెట్లు వాడటంలో ఉండే ఉపయోగాలను వారికి అర్ధమయ్యేట్లు చెప్పి వారు వాటిని కావాలనుకునేట్లు చేయటానికి అంత చిన్న ఊళ్ళో దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. ఈ టాయిలెట్లు కట్టుకోవటం తమకు ఉపయోగం అని ప్రజలు భావించిన తరువాతే ఆర్ధిక సమతామండలి వారు టాయిలెట్లను కట్టించారు. అందుకే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది.

 

ప్రజలకు ప్రేరణ కల్గించడానికి ఎంతో ఓపికగా వ్యవహరించి వారు కావాలనుకున్నప్పుడే కట్టి ఇవ్వడం అనేది ఇక్కడి విజయానికి కారణం. ప్రభుత్వం వైపు నుండి ప్రత్యేకమైన సహాయం అవసరం లేకుండానే ఈ కేసులో లక్ష్యం సిద్ధించింది.

 

స్వచ్ఛంద సంస్థలు ‘motivation’ కార్యక్రమమైతే చేయగలవు. కానీ ‘అవసరాన్ని కల్గించడం మాత్రం చాలాసార్లు ప్రభుత్వ సహాయం కావాల్సిందే.

 

మహాత్ముడు మన దేశానికి స్వాతంత్ర్యాన్ని చూడగలిగాడు గాని, గ్రామ స్వరాజ్యాన్ని, బహిరంగ మలవిసర్జన ఆగటం గాని చూడకుండానే కాలం చేశాడు. మనం అనుకున్నంత వేగంగా పనులు జరుగవు. కొన్ని పనులు అసలే కావు. నిరాశ పడి చేసేదేమీ లేదు. ఆశావహ దృక్పధాన్ని వదులుకోకూడదు. దాతలకు, సంస్థలకు, కార్యకర్తలకు భూమాత కున్నంత ఓర్పు ఉండాలి. కొంత ఆలస్యంగానైనా సమాజం ముందుకే వెళ్తుంది. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాల్సిందే!

 

తేది : 04-07-2018