ఎందుకీ కష్టం వీరికి?....           (23-Jun-2020)


బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, తద్వారా సుఖపడవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ఒక పిల్లవాడు చదువులో శ్రద్ధ చూపించక పోతుంటే – “ఏరా మాలాగా మట్టి పిసుక్కుంటావా?” అని కోప్పడటం కద్దు. అంటే సరిగా చదువుకోకపోతే ఉద్యోగం చెయ్యకుండా వ్యవసాయమే చేయాల్సి వస్తుంది అని వారి ఉద్దేశ్యం. శారీరక కష్టం కంటే మేధస్సు ఉపయోగించి చేసే పనులకి మన సంఘంలో విలువ ఎక్కువ. గతంలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న రష్యా, యూరప్ లలో శారీరక కష్టం పడేవారికి ఎక్కువ జీతం, డాక్టర్ల వంటి శారీరక కష్టం తక్కువ చేసే వారికి తక్కువ జీతాలు ఉండేవి. ఆ కాలంలో ఆ దేశాలలో శారీరక కష్టం చేసేవారికి విలువ ఎక్కువ.

 

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో వర్షం వచ్చిన రోజు మురుగుకాల్వలు శుభ్రం చెయ్యటం జరుగుతుంది. భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ (Underground drainage) గ్రామమంతా నెలకొల్పజేయడం మా ధ్యేయం. కానీ ఇప్పుడున్న బహిరంగ మురుగు పారుదల వ్యవస్థ సరిగా ప్రవహించనప్పుడు కార్యకర్తలు మురుగుకాల్వలలో ఉండే సిల్ట్, క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫ్లెక్సీలు మొదలగు రకరకాల చెత్తను తొలగిస్తారు. చాలాసార్లు మురుగుకాల్వలలో దిగి పని చేయవలసి వస్తుంది. గమ్ బూట్లు వేసుకున్నా గానీ మోకాళ్ళ కంటే ఎక్కువ లోతున్నప్పుడు కాళ్ళు మురుగుతో తడిచిపోతుంటాయి. రోడ్లకు మధ్యలో ఉన్న తూములు పూడిపోతే వాసాలతో ఆ పూడికను తీయడానికి చేతులు కూడా మురుగులో పెడుతుంటారు. ఇది నిజంగా ఆరోగ్యరీత్యా ప్రమాదకరమైన పని. అయినా సరే మురుగును సరిగా పారేలా చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు ఈ పనిని చేయడం నమ్మశక్యంగా ఉండదు.

 

ఈ కార్యకర్తలలో అధిక భాగం రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ప్రజా ప్రతినిధులు, గృహిణులే. వీరంతా బాగా చదువుకున్నవారే. అయినా సరే శారీరక కష్టమే కాదు- సమాజంలో అన్నిటికంటే హీనంగా చూడబడుతున్న పారిశుద్ధ్య పనిని గ్రామాభివృద్ధి కోసం ఎంతో ఇష్టంగా చేయడం ఆశ్చర్యకరమైన నిజం. వీరందరినీ చూసి ఎంతమంది ఉత్తేజం పొందవలెనో కదా! రామారావు మాష్టారు వీరిపై రాసిన కవిత ప్రతిరోజూ ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాను.

 

వీరిని మెచ్చుకోవడానికి నాకు తెలిసిన భాష చాలదు. వీరందరికీ తలవంచి నమస్కరిస్తున్నా!

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
09-07-2018