పర్యావరణానికి ప్రమాదంగా తయారవుతున్న పర్యాటక రంగం....           (23-Jun-2020)


తాను నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చూడాలనేది మనిషికి సహజమైన కోరిక. పర్యటించటం వలన ప్రపంచంలోని పలు సంస్కృతులను తెలుసుకోవటానికి, అనేకమందితో వ్యవహరించటానికి అవకాశం ఉంది. ఇందులో చాలా సంతోషం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగాన్ని ఈమధ్య కాలంలో బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈరంగం నానాటికీ విస్తృతి చెందుతోంది.

 

ప్రయాణంలోను, ఆ ప్రాంతాల్లో ఉన్న సమయంలోను ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే అనేక ప్లాస్టిక్ వస్తువులను వాడటం వలన ఈ పర్యాటక రంగం పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతోంది. ప్రయాణీకులు వాడిన క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ మంచినీళ్ళ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకులు, తగరం విస్తరాకులు, స్ట్రాలు, ప్లాస్టిక్ పన్నుపుల్లలు, ఐస్ క్రీం కప్పులు, షాంపూ ప్యాకెట్లు వంటి ఎన్నో వస్తువులతో యాత్రా స్థలాలు డంపింగ్ యార్డుల వలే తయారవుతున్నాయి. ఒకప్పటి హిల్ రిసార్ట్స్ గా ప్రఖ్యాతి గాంచిన ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వంటివి కూడా చెత్తతో నిండిపోతున్నాయి. ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళే మార్గాలు కూడా చెత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి.

 

జనంలో ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఉండే చైతన్యం, ప్రభుత్వాలు వాటిని నిషేధించటం- ఈ సమస్య పరిష్కారానికి కొంతవరకు ఉపయోగపడతాయి.

 

మిత్రులారా!

 

ముందుగా మనం ఈ వస్తువులను వాడవద్దు. తద్వారా మరింతమందికి చెప్పే అర్హతను సంపాదించుకుందాం.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
19-07-2018