ఈ జ్వరాలకు భయపడొద్దు – ధైర్యంగా ఎదుర్కొందాం....           (22-Jun-2020)


 

5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ‘DENGUE EPIDEMIC’ వచ్చినప్పుడు ప్రజలకు ధైర్యం చెప్పడానికి వ్రాసిన కరపత్రము

 

 

ఈ జ్వరాలకు భయపడొద్దు – ధైర్యంగా ఎదుర్కొందాం

 

 

గత రెండు మూడు మాసాలుగా మన రాష్ట్రాన్ని వివిధ విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దినపత్రికలలోను, దృశ్యమాధ్యమాలలోను కనిపించే వార్తల తీరు భయోత్పాతాన్ని కలిగించి, ధైర్యస్తులను కూడా బెంబేలెత్తిస్తున్నది.

 

 

అవసరం లేకున్నా డాక్టర్లు రకరకాల పరీక్షలు చేయిస్తున్నారని, అవసరం లేకుండానే ప్లేట్ లేట్ లు (రక్తఫలికలు) రోగులకు ఎక్కిస్తున్నారనీ, రక్తనిధులు (Blood Banks), వైద్యులూ కూడబలుక్కొని, రోగులను భయభ్రాంతులను చేసి దోచేస్తున్నారని కొందరు ఉన్నతోద్యోగులు, మరి కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు జనాన్ని మరింత కంగారు పెడుతున్నాయి.

 

 

ఆసుపత్రులేమో జ్వరపీడితులతో నిండిపోతున్నవి. ఏ రోగికి ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ రోగి కోలుకుంటాడో అర్థం కాక, రోగికి ప్రమాదమే జరిగితే అతని బంధువుల ప్రతిక్రియ (reaction) ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియక డాక్టర్లు భయపడుతున్నారు.

 

 

విషజ్వరాలంటే?

 

తక్కువ కాలంలోనే ప్రాణానికి ప్రమాదం కలిగించే జ్వరాలను విషజ్వరాలనవచ్చు.

ఫాల్సీఫారం మలేరియా
డెంగూ వంటి వైరస్ జ్వరాలు
లెప్టోస్పెరోసిస్ అనే జబ్బు వల్ల వచ్చే జ్వరాలు
మెదడువాపు (ఎన్ కెఫలైటిస్) వంటి మెదడు సంబంధమైన ఇన్ఫెక్షన్స్
గుండె సంబంధమైన వైరల్ ఇన్ఫెక్షన్లు


ఈ జ్వరాలన్నిటి లోను ప్రాణం పోయే అవకాశాలున్నాయి. ఇవి గత రెండు మూడేళ్ళలో బాగా ఎక్కువైపోయాయి. ఒక రకంగా చూస్తే ఈ విషజ్వరాలు కలవారిలో, లేని వారిలో “శోషలిజం” తీసుకువచ్చాయి.

 

 

అసలీ విషజ్వరాలు ఎందుకొస్తాయి?

 

 

ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి జబ్బులతో ఉన్న రోగి దగ్గినపుడు, తుమ్మినపుడు గాలి ద్వారా వైరస్ మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.

 

రోగిని కుట్టిన దోమలు మరొక ఆరోగ్యవంతుని కుట్టినపుడు డెంగూ, మలేరియా, మెదడువాపు వ్యాధి వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి.

 

 

ప్రమాదం ఎలా జరుగుతుంది?

 

 

గాలి ద్వారానో, దోమల ద్వారానో శరీరంలో ప్రవేశించిన క్రిమి అతి త్వరగా అక్కడ అభివృద్ధి చెంది, శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల పైన దుష్ప్రభావం చూపిస్తుంది.

 

 

ఈలోగా మన దేహం ఆ క్రిమి ప్రమాదకరమైనదని కనిపెట్టి తన రోగనిరోధక శక్తీ నుపయోగించి, ప్రతిబంధకాల (Anti Bodies) ను తయారు చేసి, క్రిములను నిర్వీర్యం చేసే పనిలో ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎక్కువసార్లు దేహమే విజేతగా నిలిచి, జ్వరం తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం వివిధ కారణాల వల్ల – క్రిమి ఎంతో బలమైనదైతోనో, పిల్లల్లో, వృద్దుల్లో, గర్భిణిలలో, కొన్ని మందులు (Immunosuppressants) వాడేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటేనో, క్రిమి గెలుపొంది శరీరంలోని ప్రధాన భాగాలను దెబ్బ తీసి ప్రాణాపాయం కలుగవచ్చు.

 

 

వైద్యం ఏం చేయాలి?

 

 

పైన పేర్కొన్న జ్వరాల్లో మలేరియాకు తప్ప ఇతర జబ్బులకు నిర్దిష్ట వైద్యమేదీ లేదు. డెంగూ, మెదడువాపు, ఫ్లూ వంటివి సహజమైన రోగనిరోధక శక్తితోనే చాలామందిలో తగ్గిపోతాయి.

 

 

జ్వరం ప్రామాదికంగా ఉన్నపుడు Supportive Management (సహాయ నిర్వహణ) చేయవలసి ఉంటుంది. మూత్రపిండాల వైఫల్యం జరిగితే తదనుగుణమైన వైద్యం, కాలేయం దెబ్బతింటుంటే తత్సంబంధ వైద్యం, ఊపిరితిత్తులు పని చేయనపుడు కృత్రిమ శ్వాస (Ventilation) అందిందించడం, రక్తపోటు తగ్గిపోతుంటే పెంచే ప్రక్రియ – ఇవే supportive managements. ఐతే ఇవి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (I.C.U.) ఉన్న ఆసుపత్రులలోనే వీలవుతుంది.

 

 

ప్రస్తుతం ఏం జరుగుతున్నది?

 

 

ప్రతిదీ విషజ్వరమేమో అని రోగి, కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. తమ వీధిలోనో, ఊళ్ళోనో డెంగూ కేసు వచ్చిందని తెలియగానే భయభ్రాంతులౌతున్నారు.

 

 

ఆసుపత్రులన్నీ జ్వరాల పీడితులతో క్రిక్కిరిసిపోతున్నాయి. బస్తీలలోని ఏ ఆసుపత్రిలోనూ మంచాలు (Beds) చాలడం లేదు.

 

 

ఒక డాక్టర్ ఒకేసారి ఎక్కువమంది సీరియస్ రోగులను చూడవలసి రావడంతో ఒత్తిడికి లోనవుతున్నాడు. రోగుల బంధువులకూ అసహనం పెరిగిపోతున్నది. ఐ.సి.యు. వ్యవస్థ ఉన్న హాస్పిటల్స్ లో ప్రవేశం దొరకటమే దుర్లభంగా ఉంది.

 

 

డాక్టర్లేమంటున్నారు?

 

 

విషజ్వరాలు ప్రతి సంవత్సరం ఋతుక్రమం (Seasonal గా) లో వస్తూనే ఉంటాయి. కానీ, జబ్బుల స్వభావం మారుతున్నది. 10-15 ఏళ్ల క్రిందట ఫాల్సీఫారం మలేరియాను స్వయంగా చూసిన వైద్యులు చాలా తక్కువ. ఇప్పుడా జబ్బును ప్రతి వైద్యుడు చూస్తున్నాడు.

 

 

మెదడువాపు జబ్బు మాత్రం ఇంతకు ముందుకన్నా తగ్గింది.

 

 

డెంగూ కేసులు ఎప్పుడూ చూడని డాక్టర్లు ఈ సంవత్సరం ప్రతి నిత్యం చూస్తున్నారు. ఐతే ఆస్పత్రులలో చేరిన కేసుల్లో ఒక్క శాతం కన్నా తక్కువ మరణాలే నమోదౌతున్నవి. మందులు, అత్యాధునిక పరికరాలు, వైద్యుల శక్తియుక్తుల సక్రమ వినియోగం – ఇవన్నీ అందుబాటులో ఉన్నా, ప్రతిరోగినీ కాపాడలేకపోవచ్చు.

 

 

అభివృద్ధి చెందిన దేశాలలో ఐతే ఏం జరుగుతుంది?

 

 

గత సంవత్సరం అమెరికా, యూరప్ లలో ఒకానొక ప్రత్యేకమైన వైరస్ మనుషులలో ప్రవేశించి, ఊపిరితిత్తులను పాడుచేసి, స్వైన్ ఫ్లూ అనే పేరుతో గణనీయమైన మరణాలకు కారణమయింది.

 

 

ఆయా ప్రభుత్వాలు అప్పటికప్పుడు పరిశోధనలకు దిగి పందులలో సాధారణంగా ఉండే H1N1 అనే వైరస్ రూపాంతరం (Mutation) చెంది, మనిషి శరీరంలో గూడ బ్రతకనేర్చిందని కనిపెట్టాయి. వెంటనే ఆ వైరస్ వ్యాప్తి నిరోధకానికి మార్గదర్శకాలు రూపొందించి, బహుళ ప్రచారంతో విజయం సాధించాయి. అదే సమయంలో కేవలం 9 నెలల కాలంలోనే పరిశోధనలు జరిపి, స్వైన్ ఫ్లూ వ్యాధికి టీకా (Vaccine) తయారుచేశాయి.

 

 

ఏ ప్రభుత్వాలైనా చేయవసింది ఇదే కదా!

 

 

మనలో ఎవరెవరం ఏం చేయాలి?

 

 

పరిసరాల పరిశుభ్రత మన తొలి ప్రాధాన్యం కావాలి.


బహిరంగ మురుగు పారుదల (Open drainage) స్థానంలో మూసిన (closed) పారుదల అత్యవసరంగా ఏర్పడాలి.


ఐతే అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగల స్థోమత మన రాష్ట్రానికి లేదంటారు కాని, పాలకులకే చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు చైతన్యవంతులు అయితే, లక్షల కోట్ల స్కాంలు ఆపగలిగితే మార్గం దొరకదా?

 

కనీసం మురుగుకాల్వల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలైనా తీసుకోవాలి.


దోమలు పుట్టకుండాను, ఉన్నవాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి.


బహిరంగ మలవిసర్జన జరగకుండాలంటే వ్యక్తిగత మరుగుదొడ్ల (ISL – Individual Septic Latrin) ను ప్రోత్సహించే శాశ్వత, దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.


మన బంధువులకో, సన్నిహితులకో జ్వరం వచ్చినపుడు ప్రతి జ్వరం విధిగా ప్రమాదం కాదని గుర్తించి ధైర్యంగా ఉండాలి.


నూరు డెంగూ కేసుల్లో ఒక్కటే ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనది కూడా I.C.U.లో పెట్టి Supportive management చేస్తే నయమయ్యే అవకాశం ఉంది. వైద్య సమయంలో డాక్టర్లను ఒత్తిడి పెట్టకుండా స్థిమితంగా ఉండాలి. ఇంతమంది రోగులకు వైద్యం చేయడానికి సరిపడా వైద్యులు మనకు లేరు.

 

 

ప్రసారమాధ్యమాలు విషజ్వర మరణాలను ప్రసారం చేయడంతో బాటు ఎన్నివేల కేసుల్లో ఎన్ని మరణాలు సంభావించాయనే గణాంకాలను కూడ చెప్పాలి. సంచలనంతో బాటు సమన్వయము కూడా అవసరమే! ప్రభుత్వం, అధికారులు నిపుణుల సహకారంతో సానుకూల దృక్పథంతో మార్గదర్శకులను రూపొందించాలి. ధైర్యంతో పరిపూర్ణ అవగాహనతో ప్రస్తుత వైద్య అత్యవసర పరిస్థితి (Medical emergency)ని సమిష్టిగా ఎదుర్కొందాం.

 

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

 

                                                                     తేది : 09-09-2016