ఇంగ్లీష్ కాదు కూడు పెట్టేది – నైపుణ్యమే!....           (22-Jun-2020)


(25-01-2017న ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన హెచ్చార్కె గారి వ్యాసం చదివిన తరువాత …..నేను రాసిన సమాధానం 27.01.2017 న ప్రచురితం)

 

 ఇంగ్లీష్ కాదు కూడు పెట్టేది – నైపుణ్యమే!

 

3,4 సంవత్సరాలు ఇంటి భాషలో పదజాలాన్నీ, వాక్య నిర్మాణాన్ని నేర్చుకొని చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలిగిన పసి వారు ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి,సమన్వయం చేసుకోవడానికే పాఠశాలకు పంపబడతారు. ఆడుతూ, పాడుతూ అలవోకగా లెక్కలు, సైన్స్, సోషల్ శాస్త్రాలు నేర్చుకోవాల్సిన వాళ్ళకు తెలియని ఆ సబ్జెక్టులను బొత్తిగా తెలియని ఇంగ్లీష్ భాషలో నేర్చుకోవలసిన పరిస్థితి అత్యంత బాధాకరం.

 

పిల్లల సొంత భాషలో మరిన్ని విషయాలు చెప్తే త్వరగా నేర్చుకోగలరు గానీ అర్థం గాని ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వాళ్ళు పడే కష్టం ఎంత దురదృష్టం. బట్టీ పట్టి అప్పచెప్పటం, రాయడం ద్వారా మార్కులు తెచ్చుకుని తలిదండ్రులను, ఉపాధ్యాయులను సంతోషపెట్ట వలసి వస్తోంది. బాల్యాన్ని, వారి సృజనాత్మకతను ఇలా చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు ఎక్కడిది? “భాషా పునాదులు పూర్తిగా ఏర్పడటానికి మొదటి 7 సంవత్సరాలు పడుతుంది. ఈ మొదటి భాష పునాదిపై ఎన్ని భాషలయినా సులభంగా నేర్చుకోవచ్చు” అని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా! ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల మానేసేవారి సంఖ్య (DROP OUTS) పెరుగుతున్నవిషయం నిరూపించబడినది. పల్లెటూళ్ళలో ఉండేవారికి ఇది విదితమే! ఇంతకు ముందు సరిపడా ఆర్థిక స్థాయి లేక మానేవాళ్ళు; ఇప్పుడు పరాయిభాషా మాధ్యమం కూడా తోడయ్యింది.

 

ఇంగ్లీష్ మాత్రమే కూడు పెట్టదు. మన చుట్టూ ఉన్న అనేక ఉద్యోగాలలో చూస్తే ఇంగ్లీష్ వలన మాత్రమే సంపాదిస్తూ బ్రతికేవారు అతి తక్కువమంది. ఏదో ఒక పని నైపుణ్యమే వారికి కూడు పెడ్తోంది. ఇంగ్లీషులో వ్యవహరించగలగడం, కంప్యూటర్ తో పనిచేయగలగడం కొన్ని ఉద్యోగాలలో కేవలం అదనపు అర్హతలు. కావలసిన వారు ఇంగ్లీషును నేర్చుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ పసిప్రాయం నుండీ సొంతభాషలో పాఠాలు చెప్పకుండా పరాయి భాషలో చెప్పడం వారి సృజనాత్మకతను దెబ్బ దీయడమే కాకుండా దేశ స్వావలంబనకు అతి పెద్ద నష్టం. పరాయీకరణ చెందిన యువతరంతో మన దేశాన్ని నిర్మించడం అత్యంత కష్ట సాధ్యం. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పరాయి భాషలో చదువు చెప్పడం లేదు. పరాయి భాషలో చదువు చెప్పిన దేశాలు కేవలం సేవారంగంలో తప్ప ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందనేలేదు.

 

‘అన్నిటికి ఇంగ్లీషే మందు’ అని వాదించేవారికి ఈ విషయాలు తెలియవా? 60,70,80 దశకాలలో ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళిన తెలుగు వారు పాఠశాల విద్యను కేవలం తెలుగు మీడియం లోనే చదువుకున్నారు. వారిలో అనేక మందిని ముఖాముఖీ ప్రశ్నిస్తే వారు తాము తెలుగు మీడియం లో చదవడం వలన ఏనాడూ ఇబ్బంది పడ్డామని అనుకోలేదని, పైగా ఇక్కడ (మన దేశంలో) నేర్చుకొన్న ఇంగ్లీష్ వల్ల అమెరికాలో ఏమీ ఉపయోగం లేదని నవ్వేవారు. అక్కడకు వెళ్ళిన మొదటి మూడు నెలలలోనే ఆ ఇంగ్లీషుకు అలవాటు పడిపోయామని, భాష తమకు ఎప్పుడూ సమస్య కాలేదని కూడ చెప్పారు.

 

కృష్ణా జిల్లా బొబ్బర్లంక గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించిన మాతంగి కోటేశ్వర రావు 11 భాషలు మాట్లాడగలడు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన అతనొక ఎలక్ట్రిషియన్. తన కాంట్రాక్టరు ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశం వెళ్లి అక్కడి భాషను 3 నెలలు లోనే నేర్చుకునేవాడు. అవసరం అతనికి అన్ని భాషలు నేర్పింది. పనిలో నైపుణ్యంతో మాత్రమే అతనికా ఉద్యోగం లభించింది.

 

రామన్ మెగసెసే అవార్డు విజేత డా. రజనీ కాంత్ అరోలి వద్ద కేవలం నాల్గవ తరగతి మాత్రమే చదువుకున్న దళిత యువకుడు ఆఫ్రికాలోని అనేక దేశాలకు వెళ్లి కృత్రిమ కాళ్ళను తయారు చేయడంపై వర్క్ షాప్స్ ఆంగ్లంలో నిర్వహించే వాడు. ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి అదేమన్నా ‘బ్రహ్మ విద్యా అండి, అవసరం అయితే ఏ భాష అయినా కొద్దిరోజుల్లోనే తేలికగా నేర్చుకోవచ్చు’ అని సమాధానమిచ్చాడు.

 

ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి కేవలం 3 నెలల సమయం సరిపోతుంటే చిన్నప్పటి నుండే సైన్స్, సోషల్, లెక్కలు ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం ఏమిటి?

 

పరాయి భాషను నేర్పే పద్ధతులలోనే ఏ కొత్త భాషనైనా నేర్పాలి గదా! సైన్స్, సోషల్, లెక్కలు సబ్జెక్టుల ద్వారా కొత్తభాషను నేర్పడం అనే ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే అది ఇంగితజ్ఞానం (కామన్ సెన్స్) కు కూడా అశాస్త్రీయమని అర్ధం అవుతుంది. అందుకే అతి చిన్న దేశమైన కొరియా లో కూడా ఎల్.కె.జి. నుండి పి.హెచ్.డి. వరకు వారి సొంత భాషలోనే బోధిస్తారు. మరి మన పిల్లలేం పాపం చేసుకున్నారు?

 

ఇది శాస్త్రీయం అని తెలిసినపుడు ప్రభుత్వాలను వత్తిడి చేసి సొంత భాషలోనే పాఠశాల విద్య ఉండేటట్లు చేయాలి కానీ తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు కనుక రాష్ట్రమంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళే ఉండాలని నిర్ణయించడం వివేకమేనా? తెలియక నిప్పును పట్టుకునే పసివాడిని వదలి ఊరుకుంటామా? వెంటనే నిప్పుకు దూరంగా తీసుకు వెళ్తామా?

 

గత వారంలో మా బంధువు కోపెన్ హాగాన్ (డెన్మార్క్ రాజధాని) నుండి వచ్చాడు. అక్కడి విద్య గురించి చెబుతూ ఎల్.కె.జి. నుండి పి.హెచ్.డి. వరకు బోధన అంతా డేనిష్ (వాళ్ళ భాష) లోనే ఉంటుందని, కేవలం విదేశస్తుల కోసమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉంటాయని చెప్పాడు. యూరప్ అంతా అలానే ఉంటుంది. ఇంగ్లీష్ మాతృభాష కాని ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా (ఉదాహరణకి – ఇంగ్లాండ్ మినహా యూరప్ దేశాలు, జపాన్, చైనా, కొరియా) విద్య మొత్తం వారి సొంత భాషలోనే ఉంటుంది. వ్యాపార అవసరాలకు కానీ, మరే ఇతర అవరసరాలకైనా గాని వేరే దేశాలకు వెళ్ళవలసిన వారు మాత్రమే ఇంగ్లీష్ కాని, వేరే దేశ భాషలు కాని నేర్చుకుంటారు.

 

అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారు వారి నైపుణ్యంతో మాత్రమే పొట్ట పోసుకుంటున్నారు. ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ వారికి అదనపు అర్హత మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి, ఆ తర్వాత వ్యవహరించడానికి 3 నెలల కోర్సు చాలు. ఈ కొద్ది మంది కోసం లక్షలాది బాలల బాల్యాన్ని బలిచేయడం అన్యాయం కాదా? మాతృభాషలో విద్య అనే అంశం కేవలం తెలుగు భాష మీద ప్రేమతో కాదు. మన పిల్లల బాల్యం, మన దేశ స్వావలంబన, సర్వతోముఖ వికాసం ఇక్కడ ముఖ్యమైన విషయాలు.

 

ధనికులు, అగ్ర కులస్తులుగా పిలవబడే వారి పిల్లలంతా ఆంగ్ల మాధ్యమంలో చదవడం వలన లబ్ది పొందడం ఒక మిధ్య. అలాగే బడుగుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య నేర్వకపోవడం వలన నష్టపోవడం మరొక భ్రమ. ఏ మీడియం లోనైనా రాణించగల బలమైన గిత్తల్లాంటి ఐదారు శాతం పిల్లలకు తప్ప మిగిలిన గ్రామ ప్రాంతాల బడుగు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య వారి పురోభివృద్ధికి పెద్ద అడ్డంకిగా నిలిచి, కీడు చేస్తుందే తప్ప కూడు పెట్టదు.

 

ఆఖరుగా ప్రముఖ రచయిత “కాలువ మల్లయ్య” గారి మాటలు ఉటంకిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

 

“దళిత బహుజనుల్లో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకొన్నారు, గెలుచుకొంటున్నారు.

 

ఇప్పుడు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో గూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే, అసంఖ్యాక బడుగు జనుల పిల్లలు ధనికుల పిల్లల్లాగే తమ మూలాలకు దూరమై, యంత్రాలుగా మారి, అన్ని విధాలా ఓడిపోతారు….”

 

-డి.ఆర్.కె.

తేది : 26-01-2017

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణా జిల్లా – 521126

ఆంధ్రప్రదేశ్.

                                                                   ఫోన్ : 9885051179