తేనె కన్నా తీయన కదా సొంతభాష!....           (22-Jun-2020)


తేనె కన్నా తీయన కదా సొంతభాష!

 

కొన్ని సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళడానికి హైదరాబాదులో “ఎమిరేట్స్” విమానంలో ప్రయాణించాను. మధ్యలో బాత్ రూంకు వెళ్తే అక్కడ ఒక హెచ్చరిక దాదాపు 10 భాషలలో వ్రాసి ఉంది. అందులో ఒక భాష తెలుగు. “బాత్ రూంలో సిగరెట్టు తాగకూడదు. అలా చేస్తే అలారం మ్రోగుతుంది” అని ఆ హెచ్చరిక. దుబాయ్ దేశ విమానంలో తెలుగు చూసి ఎంత సంతసించానో!

 

దుబాయ్ లో దిగిన హోటల్ లో ఒక హాల్ లో హిందీ సంగీత కచేరీ జరుగుతోంది. ఎవరైనా లోనికి ఉచితంగా వెళ్ళవచ్చు అంటే నేను నా భార్యా వెళ్ళాం. హిందీ పాటలు ఒకదాని తర్వాత ఒకటి పాడుతున్నారు గాయనీ గాయకులూ. పరదేశంలో మన దేశభాషల్లో ఒకటయిన హిందీలో పాటలు వినడం సంతోషంగా అనిపించింది. “క్రిమినల్” సినిమాలోని హిందీ పాట పాడుతూ సగం పాడిన తర్వాత “తెలుసా… మనసా…” అని తెలుగులో పాడడం మొదలుపెట్టి పాటను తెలుగులో పూర్తి చేశాడా గాయకుడు. కొన్ని వేల కిలోమీటర్ల దూరాన ఒక అరబ్బు దేశంలో తెలుగుపాట వినబడగానే మా ఇద్దరిలో కలిగిన ఉద్వేగం నేను మాటలతో చెప్పలేను. ఆ గాయకుణ్ణి ప్రత్యేకంగా అభినందించి వచ్చాము.

 

రెండు సంవత్సరాల క్రితం ఒక మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం కోయంబత్తూరు వెళ్లాను. పలు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరం ఒక హోటల్ లో ఉన్నాం. హోటల్ నుండి ఒక మారుతీ వాన్ లో ఆరుగురం కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తున్నాం. నా ఎదురు సీటులో ఒక బెంగాలీ డాక్టరు ఉన్నాడు. మాటలు కలిశాయి. “నాకొక బెంగాలీ పాట వచ్చు పాడనా” అన్నాను. వెంటనే పాడమన్నాడాయన. “తులినవహాతే రక్త నిశాన్, గావ్ షుబో ముక్తిరిగాన్…” అని పాడడం మొదలు పెట్టాను. సగం పాడేటప్పటికి పెద్ద శబ్దంతో నా మీదపడి కౌగలించుకొన్నాడు.కోల్ కతా నుండి కొన్ని వందల మైళ్ళ దూరం వచ్చినా, తన సొంతభాషను వినడంలోని ఆనందోద్రేకాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ తర్వాత జరిగిన సంభాషణలో నేను “రక్త నిశాన్” అని పాడాను కానీ అది “రక్తొ నిశాన్” అని పలకాలని సవరించాడు.

 

మరోసారి రాయవేలూరులో ఒక కాన్ఫరెన్స్ లో కర్నాటక నుండి వచ్చిన డాక్టరు ఒకాయన కలిశారు. నేను తెలుగువాడినని తెలిసి తెలుగులో మాటలాడడం మొదలుపెట్టాడు. ‘మీరు కన్నడిగులు కదా తెలుగు ఎలా వచ్చు?’ అని అడిగాను. ‘మా పూర్వీకులు 300 సంవత్సరములనాడు అనంతపురం జిల్లా నుండి ఇపుడు కర్ణాటకలో ఉన్న ఒక ప్రాంతానికి వలస వచ్చారు. కన్నడ సాహిత్యంలో ఎంతో కృషి చేసినవారు మా పెద్దలలో చాలామంది ఉన్నారు. ఇంట్లో మాత్రం అందరం ఇప్పటికీ తెలుగే మాట్లాడుకుంటాం. కాకపోతే మాకు తెలుగు చదవడం, రాయడం రాదు’ అని ఆయన చెప్పాడు. ఇన్ని వందల సంవత్సరాలకు కూడా వారు తమ సొంతభాషను మరువకపోవడం విశేషమూ, సంతోషమూ అనిపించింది.

 

మిర్యాలగూడెం నుండి నా మిత్రుడు శ్రీనివాస్ తో అప్పుడప్పుడు దూరవాణిలో మాట్లాడుతూ ఉంటాను. సమకాలీన పరిస్థితులపై మా మధ్య ఓ అరగంట తక్కువ కాకుండా జరుగుతుంది సంభాషణ. అతని తెలుగు వింటున్నప్పుడు ఇంత మంచి తెలుగు నేను మరిచిపోయాను గదా అని బాధవేస్తుంది.

 

జర్నలిస్టు మిత్రుడు “ఏలూరి రఘు”తో మాట్లాడుతూ ఉంటే మనప్రక్కనే కోయిల కూస్తున్నంత మధురంగా ఉంటుంది. ఎంత శ్రావ్యంగా, మధురంగా, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతాడో!

 

తెలంగాణా సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా టి.వి.లో కొంతమంది నాయకులు మాట్లాడారు. ఒక నాయకుడు అనర్గళంగా ఓ 3-4 నిమిషాలు టి.వి. అనే మాట తప్ప ఒక్క ఇంగ్లీషు పదం లేకుండా మాట్లాడాడు. అంతసేపు ఒక్క ఆంగ్లపదం లేకుండా మాటలాడలేని నా పరిస్థితికి సిగ్గుపడ్డాను.

 

“కుదిరితే కప్పు కాఫీ” అనే టి.వి. కార్యక్రమంలో విజయవాడ అమ్మాయి, పాప్ గాయని అయిన “స్మిత”తో మాటామంతీ (ఇంటర్వూ) వచ్చింది. కార్యక్రమ నిర్వాహకురాలు తెలుగులో అడిగిన ప్రశ్నలకు నూటికి 90 వాక్యాలు ఇంగ్లీషులోనే సమాధానాలు వచ్చాయి.

 

ఆ గాయనిని విమర్శించదానికి ఈ వాక్యాలు వ్రాయడం లేదు. 1980 తర్వాత వచ్చిన ఆంగ్ల మాధ్యమ బడుల వలన తెలుగు వ్రాయడం, చదవడం రాని ఒక తరం వచ్చేసిందనేది “పాత బాధ”. కొత్త బాధేమిటంటే “అంతా ఇంగ్లీషే, అక్కడక్కడా తెలుగు మాత్రమే” ఉన్న భాష మాట్లాడే తరం రాబోతోంది.

 

విజయవాడలో కొత్తగా వెలిసే పెద్దపెద్ద షాపులూ, షాపింగ్ మాల్సూ, మల్టీప్లెక్స్ థియేటర్లలో చాలా వాటిలో ఎక్కడా తెలుగు ముక్క కనిపించడం లేదు. ఎంత ధైర్యం తెలుగుగడ్డ నడిబొడ్డున ఒక్క తెలుగు బోర్డు కూడా లేకుండా షాపులు పెట్టడం?! స.వెం.రమేశ్ గారు వ్రాసినట్లు ఇది విశాల దృక్పథమా లేక బానిస బుద్దా?

 

రమణయ్య, రమేశ్వర రాజు గార్ల వాక్యాలు

“కమ్మనైనా తెలుగు బాష కలనైనా మానొద్దు

అమ్మపాల తీపిదనం, మాతృభాష మరవొద్దు”

మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి.

(పాప్ గాయిని స్మితతో టి.వి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత కలిగిన భావాలు)

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణా జిల్లా, అంధ్ర ప్రదేశ్

 

“అంతా ఇంగ్లీషే… అక్కడక్కడా తెలుగు” పేరుతో 26-5-2012 న ఆంధ్రభూమిలో ప్రచురించబడినది.