మన బిడ్డల్ని ఏ బడిలో చేర్పించాలి?....           (19-Jun-2020)


15-06-2013న ప్రజాశక్తి దినపత్రికలో ‘మంచి స్కూల్ అంటే ఏమిటి?’ పేరుతో ప్రచురించబడినది

 

మన బిడ్డల్ని ఏ బడిలో చేర్పించాలి?
(మంచి స్కూల్ అంటే ఏమిటి?)

 

మా స్కూల్లో చదవడం తల్లిదండ్రుల స్టేటస్ సింబల్ మాది గ్లోబల్ జెన్ స్కూల్ ప్రాథమిక స్థాయి నుండి కంప్యూటర్ లో శిక్షణ ఇంగ్లీషులోనే బోధన. ఇంగ్లీషులో మాట్లాడటంలో శిక్షణ. మాది టెక్నో స్కూల్. మాది మాథ్స్ ఒలింపియాడ్ స్కూల్ IIT, C.A., EAMCET లకు స్కూల్ స్థాయిలోనే కోచింగ్ వేసవి సెలవులు అయిపోయి, బడులు తెరిచే సమయంలో దినపత్రికలలో ఇటువంటి ప్రకటనలు, ప్రచార కరపత్రాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ళు పిల్లల ఇళ్ళకు మధ్యవర్తులను పంపి, వారి స్కూల్లో చేరమని ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేర్పించినవారు కొంత ధన సహాయం పొందడం కూడా మామూలే! ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ బడులలోనే పిల్లల్ని చేర్పించాలని రకరకాల ఆకర్షణ గల నినాదాలతో ప్రచారం చేస్తున్నారు. మేం కూడా ఇంగ్లీష్ చెప్తాం, ఇంగ్లీషులోనే పాఠాలు బోధిస్తాం అని బుజ్జగిస్తున్నారు.

 

ఒకళ్ళో, ఇద్దరో పిల్లలు మాత్రమే ఉంటున్న ఈనాటి తల్లిదండ్రులు తమ ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకుంటున్నారు. మంచి చదువు చెప్పిస్తే వారి భవిష్యత్తు అంతా పూలపానుపే అనుకొని, మంచి స్కూలు కోసం వెతుకుతున్నారు. మంచి స్కూలంటే పిల్లల బాధ్యత అంతా వాళ్ళే తీసుకుని చూడడం అని ఎక్కువ మంది తల్లిదండ్రుల అభిప్రాయం.

 

మరి విద్యావేత్తలేం చెబ్తున్నారు? అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాథమిక, హైస్కూలు విద్యలు ఎలా ఉన్నాయి? మన దేశంలో విద్యపై పలు కమిటీలు ఏమి సిఫార్సులు చేశాయి? తల్లిదండ్రులంతా వీటిని పరిశీలించవలసిన అవసరం ఉంది.

 

బడిపిల్లల అవసరాలు ఏమిటి?

3,4 సంవత్సరాలు ఇంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు తమ ఇంటిభాషలో చక్కటి వాక్య నిర్మాణం చేయగల సామర్ధ్యం ఉంటుంది. ఇంటి వాతావరణంలో తల్లీ, తండ్రీ, అక్కలూ, చెల్లెళ్ళూ, అన్నలు, తమ్ముళ్ళూ మరి కొద్దిమంది బంధువులు, కుటుంబ స్నేహితులను గుర్తుపట్టి వారితో వ్యవహరించడం తెలుస్తుంది.

 

మరి ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు వారికి మరింత ఎక్కువ మందిని కలవడం, వ్యవహరించడం, ప్రకృతిని చూడడం, తెలుసుకోవడం నిత్యకృత్యంగా ఉంటుంది. వారికి ఉన్న సహజసిద్ధమైన శక్తితో, సృజనాత్మకతతో ఆటపాటలతో కేరింతలు కొడుతూ మరింత పరిజ్ఞానాన్ని సంపాదించుకొంటారు. బడి వారి ఇల్లుకు కొనసాగింపుగా ఉంటే ఈ జ్ఞాన సముపార్జన సక్రమంగా జరుగుతుంది. అంగన్ వాడీకి వెళ్ళడానికి పిల్లలెవరూ పేచీ పెట్టరు. కానీ బడికి సెలవొస్తే సంతోషిస్తారు. వాళ్లకు కావలసినట్లుగా బడి ఉంటే సెలవొస్తే ఎందుకు సంతోషిస్తారు? అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు ఎవరూ స్కూలుకు వెళ్ళడానికి ఏడవరు.

 

ప్రాథమిక విద్య అంటే ఆటపాటలతో, కథలతో పరిసరాల్ని పరిచయం చేసుకోవడం, తనకు తెలిసిన భాషను మరింత విస్తృతపరుచుకోవడం. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ప్రమాదాలను ఊహించి జాగ్రత్తలు తీసుకొంటారో అలానే టీచర్లు కూడా బడిలో తమ పిల్లలకు ప్రమాదాలు జరుగకుండా చూడాలని ఆశిస్తారు.

 

హైస్కూలు స్థాయిలో పరిసరాల జ్ఞానాన్ని, ప్రపంచాన్ని సబ్జెక్టుల పేరుతో మరింత అధ్యయనం చేసుకుంటారు. ఇది కూడా ఆడుతూ పాడుతూ జరగవసినదే కదా! 10వ తరగతి వరకూ పోటీ పరీక్షలు కాదు కదా! 10వ తరగతిలో వచ్చే మార్కులు ఏం ఉపయోగం? 580 వస్తే ఏమి? 500 వస్తే ఏమి? 400 వస్తే ఏమి? హైస్కూలు నుండి బయటకు వెళ్ళేటప్పటికి ఆ విద్యార్థికి తన ఆసక్తులు ఏమిటో, ముందు ముందు తాను ఏ క్షేత్రంలో రాణించగలడో తెలిసి ఉండాలి. లేకుంటే టీచర్లు ఆ విద్యార్థికి, తల్లిదండ్రులకు అతని యొక్క బలాలు, బలహీనతలు చక్కగా విశ్లేషించి చెప్పగలగాలి. తరువాత జీవితంలో వచ్చే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని కలిగి ఉండాలి. దీనికి ఆ స్కూలు వాతావరణం దోహదం చేయాలి. (మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐ.ఐ.టి. కళాశాలలో చేరిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం గదా!)

 

కాబట్టి మన బిడ్డను చేర్చే స్కూలు….

 

ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. (రోడ్డుప్రక్కన రణగొణ ధ్వనులు లేకుండా).30 నుండి 40 మంది కంటే ఎక్కువ పిల్లలు ఏ తరగతిలోనూ ఉండకూడదు.

 

మంచి ఆటస్థలం ఉండాలి.

ప్రాథమిక విద్యలో ఇంటిపని (హోంవర్క్) ఉండకూడదు.
యాజమాన్యం, టీచర్ల దృక్పథం – బిడ్డ యొక్క సమగ్రమైన అభివృద్ధి (All round development) గా ఉండాలే కానీ మార్కులు తెప్పించి స్కూలుకు పేరు తేవాలనేదిగా ఉండకూడదు.
ఆటలలో, పాటలలో, కళలలో ఆసక్తి ఉన్నవారికి అవి నేర్చుకునే అవకాశం ఉండాలి.
Learning Disabilities (ఆటిజం, డిస్ లెక్సియా, ADHD లాంటివి) ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ యివ్వాలి. లేదా ఇవ్వగల ప్రదేశాన్ని సూచించాలి. టీచర్లకు ఇటువంటి శిక్షణ ఉండాలి.
శారీరక దండనలు ఉండకూడదు.

బిడ్డలు స్కూలులో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు ఉండాలి.

 

బిడ్డకు సొంతభాష లోనే హైస్కూలు విద్య వరకు బోధించాలి.
ఆంగ్లభాషా బోధన 3వ తరగతిలో మొదలుపెట్టి 10వ తరగతి పూర్తయ్యే సరికి ఆ భాష మీద పట్టు రాగలిగేటట్లు బోధించే సౌకర్యం ఉండాలి.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్