ఎందుకీ అవస్థ?....           (19-Jun-2020)


 

(“నైపుణ్యంతో ఉద్యోగం… ఆసక్తితో భాష” పేరుతో 28-04-2012 వ తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడినది)

ఎందుకీ అవస్థ?

 

“ఈ చిత్రంలో పాత్రలన్నీ ముంబాయిలోనే ఉన్నా మన సౌకర్యం కోసం తెలుగులోనే మాట్లాడతాయి.” ఈ సంవత్సరం అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న “బిజినెస్ మాన్” చిత్రంలో మొట్టమొదటిగా తెరపై చూపించిన వాక్యాలివి. ఊహించండి… ఆ సినిమాలో పాత్రలను హిందీలో మాట్లాడిస్తే అంత విజయాన్ని సొంతం చేసుకునేదేనా…?

 

మనం ఒక సభకు వెళ్ళాం. అక్కడ వక్త రష్యన్ భాషలో ప్రసంగించారనుకోండి. మనకేం అర్థం అవుతుంది? మళ్ళీ ఆ వక్త ప్రసంగించే సభకు వెళ్తామా…? ఈపాటి జ్ఞానం మన పిల్లల చదువు గురించి మనకు లేదే అన్నదే నా బాధ!

 

ఇటీవల ఒక వ్యవసాయ కార్మికురాలికి అపెండిసెక్టమీ ఆపరేషన్ చేశాను. ఆసుపత్రి నుండి విడుదల చేసేటప్పుడు పిల్లల చదువుల గురించి విచారించాను. పిల్లలిద్దరినీ ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నానని చెప్పింది ఆమె. ఎందుకని అడిగితే నేనూ, మా ఆయన చదువుకోలేదు, కనీసం మా పిల్లల్ని అయినా ఇంగ్లీషు మీడియంలో చదివించాలి కదా.. అని ప్రశ్నించింది.

 

తెలుగు మీడియంలోనే చదివించొచ్చు గదా అన్నాను. నీ చుట్టూ ఉన్న నేను, ఈ నర్సులందరూ తెలుగు మీడియంలోనే చదివాము. మేమంతా బాగానే ఉన్నాం కదా… అన్నాను. మళ్ళీ పాత సమాధానమే. మేము చదువుకోలేదు కదా మా పిల్లల్ని అన్నా బాగా చదివించాలి అని. అయినా ఇంగ్లీషు మీడియం ఫీజులు తట్టుకోలేక పోతున్నాను వచ్చే సంవత్సరం గవర్నమెంటు బడిలోనే చేర్పించాల్సి వచ్చేట్టుంది అన్నదామె ఆవేదనతో. చదువంటే ఇంగ్లీషు మీడియం మాత్రమే అనుకుంటున్నదా తల్లి. కాసేపు నాకేం మాట్లాడాలో తెలియలేదు. నిశ్శబ్దం మా మధ్య కాసేపు. ఇటువంటి అమాయక తల్లిదండ్రులు ఎందరో కదా…! ఎలా ఆవిడకు అర్ధం అయ్యేట్లు చెప్పాలా అని ఆలోచించాను. డాక్టరు గారు చెప్పారు గదా అని కాసేపటికి మౌనంగా ఊరుకున్నది కానీ ఆవిడ అభిప్రాయం మారినట్లు అనిపించలేదు.

 

గత 34 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వచ్చిన తల్లిదండ్రులందరితోనూ ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. ప్రపంచంలో ప్రతి అభివృద్ధి చెందిన దేశంలోనూ వారి పిల్లలు సొంతభాషలోనే చదువుకుంటున్నారు కదా…! మరి మన పిల్లలు చేసుకున్న పాపం ఏమిటి?

 

లెక్కలు, సైన్సు, సోషల్ (పాఠశాల విద్యార్థులకు ఇవి ఏ భాషలో చెప్తే ఆ మీడియం అంటున్నాం) సబ్జెక్టులు బాగా అర్థం కావాలంటే తెలిసిన భాషలో చెపితేనే గదా అర్థం అయ్యేది. మరి మన తల్లిదండ్రులు ఇంత అమాయకంగా ఎందుకు ఉన్నారు.? వారి పిల్లలకు ఏదో ఒక ఉపాధి నైపుణ్యం కావాలంటే పరభాష (ఇంగ్లీషు) పెద్ద అడ్డంకి అవుతుంది కదా…!

 

అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనే కాక అనేక దేశాల్లో తెలుగు వారు ఉన్నారు. వారు అక్కడి భాషను నేర్చుకుని బతుకుతున్నారు కదా…!

 

కృష్ణాజిల్లా దివిసీమలోని బొబ్బర్లంక అనే గ్రామంలో వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టిన “మాతంగి కోటేశ్వరరావు” పది భాషలు మాట్లాడగలడు. జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి వరకూ మాత్రమే చదివాడు. అతను ఎలక్త్రీషియన్ గా రాణించాడు. ఏ ప్రాంతంలో పని ఉంటే ఆ ప్రాంతానికి అతని కాంట్రాక్టరు పంపేవాడు. ఇతను ఆ భాషలను నేర్చుకున్నాడు. అలా తన సొంత భాష తెలుగు కాక తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ, పార్శీ, నైజీరియాలోని రెండు భాషలలో అతనికి వ్యవహార జ్ఞానం ఉంది. మేము అతనితో మాట్లాడుతున్నపుడు “టాంజానియా” వెళ్ళబోతున్నాడు. అక్కడ భాష మీరు నేర్చుకునే వెళ్తున్నారా అని అడిగాము. ఏ దేశం వెళ్ళినా అక్కడి భాష మూడు నెలల్లో నేర్చుకుంటానని, అది పెద్ద సమస్య కాదని ముందుగా నేర్చుకుని ఏ దేశం వెళ్ళలేదని, వెళ్ళిన తరువాతే నేర్చుకున్నానని చెప్పాడు. కొత్త భాష నేర్చుకోవటం తానెప్పుడూ సమస్యగా భావించటం లేదు. టాంజానియాలో ఏ భాష అయినా నాకేమీ ఇబ్బంది లేదు, ఆ భాషను నేర్చుకోగలనని దృఢంగా చెప్పాడు.

 

ఇంగ్లీషు ఉపాధి భాష, వ్యాపార భాష అని మన తెలుగు తల్లిదండ్రులకు ఉన్న గాఢమైన అభిప్రాయం ఎప్పటికి మారుతుందో కదా….! నైపుణ్యం ఉపాధి కల్పిస్తుంది కానీ భాష కాదు అని మన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి?

 

అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కాకుండా ఉంటే అంత విజయం అయ్యేనా? టి.వి.లలో వ్యాపార ప్రకటనలు ఆంగ్లంలో ఉంటే వ్యాపారాభివృద్ది కుదరదనేగా వారు తెలుగులో ప్రకటనలను రూపొందిస్తున్నది.

 

మరి మన పిల్లలకు వారికి అర్థం కాని భాషలో పాఠాలు చెప్పించాలని అనుకుంటున్నామెందుకు? వారి బాల్యాన్ని ఆనందంగా గడపనివ్వలేమా…? ఏమిటీ దుస్థితి? ఎందుకీ అవస్థ?

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణా జిల్లా, అంధ్రప్రదేశ్

 

“నైపుణ్యంతో ఉద్యోగం… ఆసక్తితో భాష” పేరుతో 28-04-2012 వ తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం