అశాస్త్రీయం – ఆంగ్లమాధ్యమం....           (19-Jun-2020)


(13-07-2013 వ తేదీన ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురించబడినది.)

 

అశాస్త్రీయం – ఆంగ్లమాధ్యమం

 

05-07-2013 న ప్రజాశక్తిలో రాసిన ఒక టీచర్ గారి ఉత్తరానికి ప్రతిస్పందన.

 

“అయిదో తరగతి వరకూ ఆంగ్లాన్ని ఒక భాషగా మాత్రమే చదివిన విద్యార్థులకు హఠాత్తుగా ఆరో తరగతి నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు” అని రాశారు.

 

మరి 3-4 సంవత్సరాలు ఇంటి వాతావరణంలో పెరిగి సొంత భాషలో చక్కటి వాక్య నిర్మాణంతో సంభాషిస్తున్న, వ్యవహరిస్తున్న తెలుగు పిల్లలు హఠాత్తుగా 1వ తరగతిలోనే ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు ఎలా నేర్చుకుంటారు? తెలియని విషయాన్ని తెలియని భాష ద్వారా నేర్పడం సాధ్యమేనా? 6వ తరగతి పిల్లవాడికి ఆంగ్ల మాధ్యమంలో బోధించిన పాఠాలు అర్థం కానప్పుడు 1వ తరగతి పిల్లవాడికి ఎలా అర్థం అవుతాయి?

 

“మందబుద్దులు” అనే మాట ఉపయోగించారు. పిల్లల్ని మందబుద్దులు అని ఎట్టి పరిస్థితులలోనూ అనకూడదు. (ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో “డల్లర్ డ్స్” అంటారు) అలా అనడం అంటే బాల్యాన్ని మనం అర్థం చేసుకోలేక వారిని హింస పెట్టడమే! పిల్లలు మెల్లగా నేర్చుకునే వాళ్ళు, చురుగ్గా నేర్చుకునేవాళ్ళు ఉంటారు. చురుగ్గా నేర్చుకునే వాళ్ళు ‘ప్రతిభ’ గలవారు, మెల్లగా నేర్చుకునే వాళ్ళు ‘మందబుద్దు’లని పేరు పెట్టడం సాధారణం అయింది. చదువులో నెమ్మదిగా ఉండేవారు వేరే రంగాల్లో చాలా చురుకుగా ఉండవచ్చు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ లోనూ, బాల మురళీకృష్ణ సంగీతంలోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరచారు గదా! ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చూపించవచ్చు. ఇన్ స్టీన్ ను అస్సలు చదువుకే పనికిరాడని స్కూల్ నుండి పంపేశారు. ఆయనకున్న “డిస్ లెక్సియా” అనే Learning Disability ని టీచరు కనిపెట్టలేక పోయింది. కాని ఆయన తనను ఎంత గొప్ప శాస్త్రవేత్తగా మలుచుకున్నాడో తెలిసిందే కదా! కనుక పిల్లల్ని మందబుద్దులు అనే ముందు వారు ఏ రంగంలో ఆసక్తి చూపుతున్నారో గ్రహించి ప్రోత్సహించడం ఉపాధ్యాయుని పని. 30-40 శాతం మంది విద్యార్థులలో మాత్రమే చదువుపై ఆసక్తి ఉంటుందని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు కదా! కొద్దిమంది మాత్రం “ఆటిజం”, ADHD, ‘డిస్ లెక్సియా’ ల వంటి learning disabilities ఉన్న పిల్లలు ఉంటారు. వారిని గుర్తించే నైపుణ్యం ఉపాధ్యాయుడికి ఉండాలి. లేకుంటే పిల్లలు, వారి తల్లిదండ్రులు శారీరక, మానసిక హింసకు గురయ్యే అవకాశం ఉంది.

 

“ఆంగ్లంలో పట్టు కావాలంటే 1వ తరగతి నుండీ ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని రాశారు”.

 

ప్రపంచంలో ఏ దేశంలోనూ మాథ్యమం ద్వారా భాషను నేర్పే ప్రయోగం చేయలేదు. (అంటే లెక్కలు, సైన్సు, సోషల్ ద్వారా పరభాషను) ఎందుకంటే అది వినడానికే హాస్యాస్పదం, అశాస్త్రీయం కాబట్టి. సొంత భాషలో పునాదులు బాగాపడిన తర్వాత పరభాషను 7వ సంవత్సరంలో మొదలు పెట్టాలి. పరభాషను నేర్పే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అలా 7వ సంవత్సరంలో మొదలుపెట్టి పదవ తరగతి పూర్తయ్యేటప్పటికి పరభాష మీద పట్టు కలిగించవచ్చు

 

మరింత మెరుగైన సమాజాన్ని కోరే ప్రజాస్వామ్యవాదులంతా విద్యా వ్యవస్థ ఇలా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు శాస్త్రీయమైన విద్య కోసం పాటుపడాలి కానీ, చిరుగుల చొక్కాకు అతుకులు వేయడం వలన ఉపయోగం ఉండదు.

 

తయారీ రంగంలో (ప్రొడక్షన్ సెక్టార్) అభివృద్ధి చెందిన దేశాలేవీ (చైనా, జపాన్, కొరియా, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా) పరభాషలో చదువు చెప్పడం లేదు. పరభాషలో చదవడం వలన ఎక్కువ మందికి సేవారంగంలో (సర్వీస్ సెక్టార్) ఉద్యోగాలు మాత్రమే దొరుకుతున్నాయి.

 

తయారీ రంగంలో అభివృద్ధి చెందకుండా దేశ స్వావనంబవ కుదరదు.

 

సమాజంపై చిత్తశుద్ధి లేని పాలకవర్గాల మాయలో పడకుండా, ప్రజాస్వామ్యవాదులంతా శాస్త్రీయ విద్యకై ఉద్యమించమని మనవి.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.
తేది – 09-07-2013

 

 

05-07-2013 న ప్రజాశక్తిలో రాసిన ఒక టీచర్ గారి ఉత్తరం