అదే ప్రేరణతో…....           (11-Jun-2020)


March 13, 2018

(ఈ వ్యాసం 8, ఆగష్టు 2010 వ తేదీన ప్రజాశక్తి ఆదివారం అనుబంధం ‘స్నేహ’ పత్రికలో ప్రచురితమైనది.)

 

అదే ప్రేరణతో

 

1978 విద్యార్థి ఉద్యమాలు పరిచయం అవుతున్న రోజులు. ప్రాథమిక విద్యను గురించి ప్రతి ఆదివారం విశాలాంధ్రలో వ్యాసం వచ్చేది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఆవశ్యకతను నొక్కి చెప్తూ సవివరంగా, సాధికారికంగా ప్రచురితమయ్యే ఆ వ్యాస పరంపరను క్రమం తప్పకుండా చదువుతుండేవాణ్ణి. దరిమిలా 1979లో ఆ వ్యాసాలే “మాతృభాషలో ప్రాథమిక విద్య” అనే పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. గ్రంథ రచయిత విజయవాడ ఆంద్ర లయోలా కళాశాలలో ఐదేళ్ళ క్రితం మాకు ఆంగ్ల పాఠాలు బోధించిన ఇంగ్లీష్ లెక్చరర్ అట్లూరి పురుషోత్తం గారు. ఆ పుస్తకాన్ని అప్పుడు నాలుగు రూపాయలకు కొని, ఇప్పటిదాకా ఎన్నిసార్లు చదివానో, ఎంతమందితో చదివించానో చెప్పలేను. “తెలిసిన భాష ద్వారానే తెలియని కొత్త విషయాలను నేర్చుకోవాలే తప్ప, తెలియని కొత్త భాష ద్వారా తెలియని విషయాలను ఎలా నేర్చుకోగలరు?” అన్నది ఆయన వాదం. “తెలియని కొత్త భాషలో లెక్కలు, సైన్సు, సోషల్ పాఠ్యాంశాలను బలవంతంగా బోధిస్తే అవి అర్థం కాని విద్యార్థులు వాటిని బట్టీ పట్టి, తమ సృజనాత్మకతను కోల్పోరా?” అని ఆయన ఆవేదన. ఇంగ్లీషు మీడియంలో చదవడం వల్ల ఆంగ్ల భాషలో నిష్ణాతులవడం కేవలం భ్రమ అని, అశాస్త్రీయమనీ, ఆ పుస్తకంలో రచయిత రుజువు చేసిన తీరు నాటికీ నేటికీ నా మనసులో హత్తుకుపోయింది.

 

కేవలం 110 పేజీల ఈ చిన్న పుస్తకంలో క్లిష్టమనుకున్న విషయాలు సూటిగా, సులభంగా, శాస్త్రీయంగా, సాధికారికంగా చెప్పారు. చిన్నారులు ఏ కొత్త విషయాలనైనా ప్రస్తుతం ఎలా నేర్చుకుంటున్నారో, ఎలా నేర్చుకోవడం అన్ని విధాల శ్రేయస్కరమో, చారిత్రక, భాషా శాస్త్ర కారణాలను చూపుతూ, దేశ విదేశ ఉదాహరణలు ఇస్తూ, మేధావులను, సామాజిక శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ రచయిత ప్రతిపాదించిన తీరు అద్భుతం. మానవుని భావ ప్రకటన ప్రధానంగా భాష ద్వారానే జరుగుతుంది. కొత్త విషయాలను తమకు తెలిసిన భాష ద్వారా నేర్చుకోవడానికి భిన్నంగా ఆంగ్ల భాషనే లెక్కలు, సైన్సు వంటి విషయాల ద్వారా నేర్చుకోవడమనే అశాస్త్రీయ ధోరణి మీదనే ఈ చిన్న గ్రంథంలోని చర్చ అంతా నడిచింది. గృహవాతావరణంలో, మాతృభాషలో ఎన్నో నేర్చుకుంటూ నాలుగేళ్ళు పెరిగిన బిడ్డను ఆంగ్ల మీడియంలో చదివిస్తే బిత్తరపోయి, అవగాహన కొరవడి, భావప్రకటన లేక ప్రశ్నించడం మరచిపోయి, బట్టీలకలవాటు పడి, సృజనాత్మకతకు దూరమై తనకు, సమాజానికి భారమైపోయే దుస్థితిని రచయిత కళ్ళకు కట్టినట్లు చూపించారు. నాలుగు శతాబ్దాల నాడే ఔరంగజేబు తన గురువైన ముల్లాసాలే అరబ్బీ అనే పరభాషా మాధ్యమంలో అతి విలువైన తన 10 ఏళ్ల కాలాన్ని వ్యర్ధపుచ్చినందుకు తప్పు పట్టిన విషయాన్ని (107వ పుట), 130 ఏళ్ళనాడు గాంధీ మహాత్ముడు ఆంగ్ల మాధ్యమంలో తన బాల్యంలోని ఐదారేళ్ళు ఎంతో నిస్సారంగా గడిచిపోయాయని బాధపడిన విషయాన్ని (59వ పేజీ) ఉదహరించడం ఈ రచయిత వాదానికి మరింత బలం చేకూర్చింది.

 

పుస్తకంలోని భావప్రేరకాలైన, దార్శనికాలైన క్రింది వాక్యాలు నన్నెప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. “పరభాషలో ప్రాథమిక విద్య కొనసాగినంత కాలం మన మట్టిలోని మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతాయి” / “మన ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో మొదటి బలిపశువు తెలుగుభాషే. రెండోది గణితం, మూడోది ఆంగ్లభాష”. / “యూరప్ దేశాలలో లాటిన్, గ్రీకు భాషల్లో విద్యాబోధన జరిగినంత కాలం ఆ దేశాలు, అక్కడి భాషలు అభివృద్ధి చెందనే లేదు”. / “మన భాష పట్ల, దేశం పట్ల అభిమానం లోపించడమే బానిస మనస్తత్వం. అది దేశ స్వాతంత్ర్యానికి, దేశ అభ్యుదయానికి గొడ్డలి పెట్టు.”

 

స్పూర్తిదాయక గ్రంథ రచయిత, ఆంగ్ల సాహిత్య కోవిదుడు పురుషోత్తం గారు కానీ, ఈ వ్యాస రచయిత గానీ మాతృభాషా ప్రేమికులే తప్ప ఆంగ్లభాషా ద్వేషులు కాదు. ఆసక్తి, అవకాశం ఉన్న ప్రతి భారతీయుడు ప్రపంచ భాషగా పేరొందిన ఆంగ్లాన్ని నేర్చుకోవాలనే మా కోరిక, ఐతే ‘ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకోవాలే గానీ, ఆంగ్లమాధ్యమం ద్వారా ఆంగ్ల భాషా నిష్ణాతులు అవుతారనుకోవడం మాత్రం భ్రమ. “అశాస్త్రీయం” అనే మా ఉద్దేశ్యం. చల్లపల్లిలో 1988 లో సొంత ఆసుపత్రిలో వైద్యవృత్తి ప్రారంభించాక మా అబ్బాయిని పాఠశాలలో చేర్చాల్సిన సమయం వచ్చింది. పురుషోత్తం మాష్టారికి ఉత్తరం రాసి వారి అనుమతితో విజయవాడలో ఉన్న వారింట్లో కలిశాను. 1974 తర్వాత అప్పుడే వారిని చూడడం. వారి పుస్తకం గత 14 ఏళ్ళుగా నాకెంత స్ఫూర్తినిచ్చిందో వివరించి, మా అబ్బాయికి ఏదైనా మంచి తెలుగు మీడియం పాఠశాలను సూచించమని అడిగాను. విజయవాడలోని “వికాస విద్యావనం”లో చేర్చమని చెప్పారు. “నేను చల్లపల్లిలో ఉంటూ 66 కి.మీ. దూరంలోని బడిలో చదివించడం ఇష్టంలేదు. ఎంత బాగున్నా హాస్టల్ లో ఉంచడం నచ్చలేదు. పాఠశాల విద్యవరకు పిల్లలు మా దగ్గరే ఉండాలని మా కోరిక” అన్నాను. “ఐతే నన్ను మీ ఊరొచ్చి తెలుగు మీడియం పాఠశాల పెట్టమంటావా?” అంటూ నవ్వారు.

 

మా బాబును చల్లపల్లిలోనే, తెలుగు మీడియంలోనే చేర్పించాను. అప్పుడు విజయవాడలో ఎన్.ఎస్.ఎమ్ స్కూలు చాలా ప్రసిద్ధి గాంచినది. విజయవాడలోని, జిల్లా ఇతర ప్రాంతాలలోని నా డాక్టర్ మిత్రుల పిల్లలు ఇక్కడే చదివేవారు. అందులో ఇద్దరు ముగ్గురు స్నేహితులు “ఎన్.ఎస్.ఎమ్ వంటి మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్ ఉండగా మారుమూల చల్లపల్లిలో, అందులో కూడా తెలుగు మీడియంలో చేరుస్తున్నావా? ఏమిటీ పిచ్చిపని… అంటూ చనువుగా మందలించారు కూడా. ఐతే నేను చేస్తున్న పని సరైందని నాకు గట్టి నమ్మకం!

 

1990లో నేను, నా భార్య యూరప్ పర్యటనకు వెళ్లి కొన్నాళ్ళు లండన్ నగరంలోని ఒక మిత్రుని ఇంట్లో వున్నాం. అక్కడి ఇతర మిత్రులు…. తెలుగు మీడియంలో చేర్చి, పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నావేమో… అన్నప్పుడు కూడా నా అభిప్రాయం అశాస్త్రీయమని నాకనిపించలేదు. పురుషోత్తంగారి పుస్తకంలోని శాస్త్రీయ వాదనలు అంతగా నాకు వంటబట్టాయి మరి! అంతకు పూర్వం నేనెంతో గాఢంగా విశ్వసించిన విషయాలు అశాస్త్రీయమని రుజువైనప్పుడు ఒక్క నిమిషంలోనే నా అభిప్రాయాలను మార్చుకున్న సందర్భాలున్నాయి.

 

ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చిన వెంటనే నేను, నా భార్య ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ రోజు నుండి “ఒక సంవత్సరం పాటు పరిచయంలో ఉన్న మేధావులతో, లెక్చరర్లతో, విద్యావేత్తలతో దాపరికం లేకుండా చర్చించడం. ఆ పిదప మేమిద్దరం చర్చించుకుని ఇంగ్లీషు మీడియమే మంచిదనుకుంటే అబ్బాయిని అందులోకి మార్చడం, తెలుగు మీడియమే సరైందనుకుంటే అందులోనే కొనసాగించడం” అని.

 

అనుకున్నట్లుగానే ఆ ఏడాది కాలంలో మేం చాలామందిని సంప్రదించాం. అప్పటికి 20 ఏళ్లుగా ఆంద్ర లయోలా కళాశాలలో బోటనీ లెక్చరర్ గా పనిచేస్తున్న నా కజిన్ “పల్లెటూళ్ళో పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వాళ్లకు విషయావగాహన చక్కగా వుంటుంది. కాకపోతే ఇంటర్ మొదటి సంవత్సరంలో కొంత బిడియంగా ఉంటారు. పట్టణప్రాంతం నుండి, ఆంగ్లమీడియం నుండి వచ్చిన పిల్లలు మాత్రం చొరవగా హడావిడిగా వుంటారు. విషయపరిజ్ఞానంలో, అవగాహనా శక్తిలో వీళ్ళు ఒక అడుగు వెనకే వుంటారు. సీనియర్ ఇంటర్ లో మాత్రం ఆంగ్లంలో గానీ, గ్రూపు సబ్జెక్టులలో గానీ తెలుగు మీడియం నుండి వచ్చిన వారే ముందుంటారు” అన్నారు.

 

గుంటూరులోని విజ్ఞాన్ రత్తయ్యగారిని కలిస్తే, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. “పట్టణ ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమంలో 10వ తరగతిలో 90 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి కంటే జడ్.పి. హైస్కూల్లో 55 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థులే ఇంటర్ లో రాణిస్తారు” అని. ఇంకొక సంవత్సరం గడిచాక నా భార్య డా. పద్మావతి మేము ప్రారంభించిన “మాతృభాషలోనే ప్రాథమిక విద్య” అనే ఉద్యమంలో నాకంటే బలంగా పనిచేయసాగింది.

 

నేనూ, జనవిజ్ఞానవేదిక సభ్యులూ ఇలా విస్తృతంగా పరిశీలన, అధ్యయనం చేసిన తర్వాత మాతృభాషలో ప్రాథమిక విద్య ప్రయోజనాన్ని గురించి, చల్లపల్లి ప్రాంతంలో ఒక ఉద్యమంగా ప్రచారం చేయాలని సంకల్పించుకొన్నాం. 1991లో అట్లూరి పురుషోత్తం గారినే ఆహ్వానించి బహిరంగ సభను ఏర్పాటు చేసాం. ఎంతగా ప్రచారం చేసినా, మా 10-12 మంది కార్యకర్తలం కాక మరో 20 మందికి మించి రాలేదు. ఎక్కువమంది తల్లిదండ్రులకు పురుషోత్తంగారి ఉపన్యాస సందేశమందించలేక పోయామనే నిరాశ కలిగినా కమిటీ సభ్యులం మాత్రం మరింత ఉత్తేజితులమయ్యాం. ఏ చిన్న అవకాశం వచ్చినా, ఇతరులతో తెలుగు మీడియంలో చదువును గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మాకు 25 కి.మీ. దూరంలోని కోడూరులో ఒక పాఠశాల యజమాని బహిరంగ సభ పెట్టి తల్లిదండ్రులను వారి పిల్లలను ఆంగ్ల మాధ్యంలోనే చదివించాలని తన వాదనా పటిమను ఉపయోగించి ఒప్పించారని తెలిసింది. తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ఈ ప్రయత్నాలు చాలాచోట్ల జరుగుతుండగా మా చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక తల్లిదండ్రులను ఒప్పించలేక ఓడిపోతామనిపించింది.

 

ఈ విషయాన్నే లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి సలహా కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. ఆంగ్లమాధ్యమం పట్ల ప్రజల్లో బలంగా ఉన్న భ్రమలను తొలగించే యుద్ధంలో ఓడిపోతున్నామని నేను కొంత నిరాశగా అంటే, “ఓడిపోతామని మానేస్తారా? నమ్మిన ఆశయం కోసం పోరాడడమే మన కర్తవ్యం…” అని కొంత ఆవేశంగా వారన్న మాటలు నామీద బలంగా పనిచేశాయి. తల్లిదండ్రుల్ని ఒప్పించడంలో జయప్రకాష్ నారాయణ గారిచ్చిన సలహాలు పునరుత్తేజాన్నిచ్చాయి. తల్లిదండ్రుల నుద్దేశించి, ముందుగా కరపత్రం వేయాలనుకుని అది బాగా రాయగల నాకు తెలిసిన పెద్దలను అడిగాను గానీ, కొన్ని కారణాల వల్ల అప్పటికా పని నెరవేరలేదు.

 

ఇక తప్పక, కాలహరణం భరించలేక నేనే ఒక కరపత్రం రాయాలనుకున్నా అది కాస్తా కరపత్ర పరిమితిని దాటిపోవడంతో చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక తరఫున చిన్న పుస్తకంగా అచ్చు వేశాం. అది ఆరేళ్ళలో నాలుగు ప్రచురణలు పొందింది. దాని పరిచయంలో “మాతృభాషలో ప్రాథమిక విద్య”కు ఇది కేవలం పరిచయమేనని, పూర్తి వివరాలకు పురుషోత్తం గారి పుస్తకం చదవండని సూచించాము. మా జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలం ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈ పుస్తకంలోని అంశాన్ని పదిమందితో చర్చించాలని తీర్మానించుకున్నాం.

 

2001లో మా అబ్బాయికి ఎంసెట్ లో మెడిసిన్ లో మొదటిసారే మూడవ ర్యాంకు రావడం, అదీ 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన గ్రామీణ విద్యార్థికి రావడం కొంత సంచలనాన్ని కలిగించింది. మా దృష్టిలో అదేమీ గొప్ప విశేషం కాదు కానీ, కొందరు పెద్దలు “డాక్టర్ గారు! తెలుగు మీడియంలోనే చదివించాలని మీరు ఇతరులతో చెప్పినదాన్నే ఆచరించి, విజయం సాధించి చూపారు” అని అభినందించారు. వారిలో ఒకరు మా జె.వి.వి. సంస్థకు రు. 5000/- విరాళంగా ఇచ్చారు. ఇక్కడ గమనించవలసిందేమిటంటే మా అబ్బాయికి ఆ ర్యాంకు రాకపోయినా నేను చేసిన పని మాత్రం శాస్త్రీయమైనదే.

 

ఆ సమయంలోనే జనవిజ్ఞాన వేదిక నాయకులు వి. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించి, “తెలుగు మీడియంలో విద్య” అనే అంశం మీద మళ్ళీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. మా సభ్యులు ఈసారి ఇంటింటికీ వెళ్లి, కరపత్రాలు పంచి ఆహ్వానించారు. పదేళ్ళనాడు ఇదే అంశం మీద జరిగిన సభకు 30 మంది వస్తే ఈసారి మాత్రం మంచి స్పందన వచ్చి 250 మంది హాజరై, ప్రధాన వక్త ప్రసంగానికి ముగ్ధులై, అందులో కొందరు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న తమ పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలకు మార్చారు.

 

చల్లపల్లి ఒక మండల కేంద్రం. 20వేల జనాభా, సుమారు 10 ఆంగ్ల మీడియం పాఠశాలలు. చుట్టుప్రక్కల పల్లెటూళ్ళ పిల్లలు ఇక్కడ తమకు ఆంగ్లంలో తెలియని లెక్కలు, సైన్సు, సోషల్ పాఠాలను చదవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు. అగ్రవర్ణాల పిల్లలవలె బడుగు ప్రజలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి, ఆ కులాల అభివృద్ధికి తోడ్పడుతుందనే వాదనలు బలంగా పనిచేయడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం 2008 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మీడియం విద్యను ప్రవేశపెట్టినప్పుడు అది ఎంత అశాస్త్రీయమో వివరిస్తూ ఒక ప్రముఖ దినపత్రికలో వ్యాసం రాశాను. మరో రెండు పత్రికలూ దాన్ని తరువాత ప్రచురించాయి.

 

దూరదృష్టి లేక, మీడియం రూపంలో అత్యంత మధురమైన బాల్యాన్ని, సృజనాత్మకతను హరించి వేయడమే జీవితంలో నాకున్న అతి ముఖ్యమైన బాధ. ఉద్యమ స్ఫూర్తితో జనంలో పనిచేయడానికి ఆ బాధే కారణం. ఐతే దీనికి ప్రధాన ప్రేరణ మాత్రం అట్లూరి పురుషోత్తం గారి “మాతృభాషలో ప్రాథమిక విద్య” అనే గ్రంథమే!

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణా జిల్లా.
ఆంధ్రప్రదేశ్

(8, ఆగష్టు 2010 వ తేదీన ప్రజాశక్తి ఆదివారం అనుబంధం ‘స్నేహ’ పత్రికలో ప్రచురితమైన వ్యాసం)