ఆ పిల్లల్ని మీరే చంపారు....           (11-Jun-2020)


(ఈ వ్యాసం 05-08-2014వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించబడినది)

ఆ పిల్లల్ని మీరే చంపారు

 

(ది. 31-07-2014 ఆంధ్రజ్యోతిలో కంచ ఐలయ్య గారి ప్రశ్నకు సమాధానం)

 

మీరే చంపారు ఐలయ్య గారూ!

 

పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలోనే ఉండాలనే అశాస్త్రీయవాదాన్ని మీరు, మీవంటి మరి కొందరు మేధావులు ప్రచారం చేయడం వల్లే జనమంతా విద్యంటే ఇంగ్లీషు మీడియం మాత్రమేననీ, తెలుగు మీడియంలో దొరికేది నాసిరకం విద్యేనని తమ బుర్రల్లోకి ఎక్కించుకున్నారు. ఈ భావజాలం తలకెక్కడం వల్లే, రోజువారీ కూలిపనులతో పొట్ట పోసుకునేవారు (ఐలయ్య గారి భాషలో ‘బీద లేబరు జనం’) కూడా అప్పోసప్పో చేసైనా పిల్లల్ని పట్నాలలోని ఇంగ్లీషు మీడియం బడులకు పంపుతున్నారు.

 

ప్రైవేటు పాఠశాలల్లో గాని, ప్రభుత్వ పాఠశాలల్లో గాని ఒకే విధమైన, నాణ్యమైన విద్యా విధానం ఉండాలనీ, తమ ఊర్లోనే పిల్లలు చదువుకోవాలనీ విద్యావేత్తలు ప్రచారం చేయాలి గాని, ప్రతి ఊళ్లోనూ ఇంగ్లీషు మీడియం పాఠశాల పెట్టాలని డిమాండ్ చేయడం అశాస్త్రీయం. అభివృద్ధి చెందిన ఏ దేశంలోని పిల్లలూ తమకర్ధం గాని పరభాషలో చదువుకోవడం లేదే! ముక్కుపచ్చ లారని బిడ్డలు ఇంతింత దూరాలు వెళ్లి చదువుకోవడం లేదే!

 

మరి, మన తెలుగు పిల్లలకే ఎందుకీ అవస్థ? మీలాంటి మేధావులు, సంస్థలు ఇంగ్లీషుపై పెంచుకొన్న మోజుకూ, దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారానికీ జనం కండిషనైపోయారు. ఇంగ్లీషు నేర్చుకోవడానికీ, ఇంగ్లీషు మీడియంలో చదవడానికీ ఉన్న తేడా మీకు తెలియదని నమ్మమంటారా? ఇప్పుడు కావలసింది సొంత భాషలో శాస్త్రీయ విద్యను బోధించే పాఠశాలలే గాని, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు కాదు. పిల్లలకు మూడవ తరగతి నుండి ఇంగ్లీషు భాషను బోధించడం మొదలుపెట్టి, పదో తరగతి నాటికి అందులో సాధికారికతను తేవచ్చు. ఇది శాస్త్రీయం. దీనికి భిన్నంగా లెక్కలు, సోషల్, సైన్సుల ద్వారా ఆంగ్లాన్ని నేర్చుకోమని ప్రచారం చేసేవాళ్ళంతా మూసాయిపేట చిన్నారుల దుర్మరణాలకు కారకులే! ఇలాంటి అశాస్త్రీయ వాదనలకు ప్రాచుర్యం కల్పించే పత్రికలూ కూడా ఈ విషాదానికి బాధ్యత వహించక తప్పదు.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.

05-08-2014వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించబడిన వ్యాసం: