పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం అవసరమా?....           (06-Jun-2020)


 హైదరాబాద్ యూనివర్సిటీలో 27-03-2011 వ తేదీన జరిగిన తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక 2వ జాతీయ సదస్సులో చదవబడిన పత్రము

 

ఈ పత్రము 23-04-2011 వ తేదీన “ఇంగ్లీషు మీడియం అవసరమా?” పేరుతో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడినది.

 

పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం అవసరమా?

 

గత 25 సంవత్సరాల నుండి ఆంధ్రదేశంలో పల్లెలకు కూడా ప్రైవేటు రంగంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు వ్యాపించాయి. మూడేళ్ళ క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం “సక్సెస్ స్కూల్స్” పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను ప్రారంభించింది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను పెట్టాలని, మిగిలిన అన్ని పాఠశాలలలోను ఒకటో తరగతి నుండే ఇంగ్లీష్ సబ్జెక్టును ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం!

 

గ్రామీణ పేదప్రజలు ఎక్కువ ఫీజులు కట్టి, ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివించలేక, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి తెలుగు మీడియంలోనే చదివించవలసి వస్తున్నందుకు బాధపడుతున్నారనే కారణంతో ప్రభుత్వం పై నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది. ఐతే ఇంతటి కీలక నిర్ణయం “ఈ చర్యలో శాస్త్రీయత ఎంత? పిల్లలకిది లాభదాయకమా? నష్టదాయకమా?” అనే విస్తృత చర్చ లేకుండానే తీసుకోబడింది.

 

బోధనా భాష – నేటి వాస్తవాలు

 

ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రస్తుతం ఏయే దేశాలలో జరుగుతున్నదో పరిశీలించుదాం.

ఇంగ్లాండ్, అమెరికా, కెనడా (ఒక్క రాష్ట్రములో తప్ప), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ దేశాలన్నిటిలోను ఇంగ్లీషే వారి మాతృభాష!

 

దక్షిణ అమెరికా ఖండంలో ఏదేశంలోనూ ఇంగ్లీషు బోధనా భాష కాదు.

యూరప్ ఖండంలో ఇంగ్లాండ్ లో తప్ప మరే దేశములోనూ ఇంగ్లీష్ బోధనా భాష కాదు.

 

(16వ శతాబ్దానికి ముందు ఇంగ్లాండ్ లో లాటిన్, ఫ్రెంచ్ మీడియంల పైన మహా మోజుండేది) ఆసియా, ఆఫ్రికా, వెస్టిండీస్ లలోని కామన్వెల్త్ దేశాలలో మాత్రమే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో విద్యకు కొంత ఆదరణ ఉంది.

 

శాస్త్ర, సంకేతిక పరిశోధనలలో అద్వితీయ ప్రగతిని సాధించిన అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, రష్యా, జపాన్, కొరియా, చైనా వంటి ఏదేశంలోనైనా ప్రాధమిక విద్య మొదలుకొని, పరిశోధనా స్థాయి వరకూ వారి మాతృభాషలోనే జరగడం నేటి వాస్తవం.

 

మరి భారతదేశంలో – ముఖ్యంగా ఆంధ్రదేశంలో మాతృభాషను తిరస్కరించేంతగా, తృణీకరించేంతగా ఇంగ్లీష్ మీడియం విద్య పట్ల ఇంత వ్యామోహమెందుకు?

 

ఎందుకంటే….

నేటి ప్రపంచంలో ఇంగ్లీషును ఉపాధి భాషగా, వ్యాపార భాషగా ఎక్కువమంది భావించడం వలన.

 

ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే చాలు తమ పిల్లలకు ఇంగ్లీష్ భాష బాగా వంటపట్టి, గడగడా మాట్లాడి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తల్లిదండ్రులు గతానుగతికంగా భావించడం వలన.

అసలు పాఠశాల విద్య లక్ష్యాలు ఏమిటి?

 

ఇంటి వాతావరణం నుండి ప్రాథమిక విద్య కోసం పాఠశాలకు వెళ్ళే బిడ్డ అది పూర్తయ్యే సమయానికి ఈక్రింది అంశాలలో కనీస పరిజ్ఞానం పొందగలగాలి.

 

సొంత భాషలో సంపూర్ణంగా మాట్లాడటం, చదవడం, రాయడంలో పట్టు కలిగి ఉండటం.

 

ఇతర వ్యక్తుల నుండి, ప్రసార సాధనాల నుండి పొందే సాధారణ సమాచారాన్ని విని, అర్థం చేసుకొని విశ్లేషించగలిగి ఉండటం.

 

తన భావాలను, రకరకాల ఉద్వేగాలను సులభంగా వ్యక్తీకరించగలగటం.

 

తొలి బడిలో చేరేటప్పటికే బిడ్డకు ‘సొంత భాష’ ఉంటుంది. కుటుంబం నుండి, తన చుట్టూ ఉన్న సమాజం నుండి పొందిన ‘పరిజ్ఞానం’ ఉంటుంది. ప్రాథమిక విద్యాకాలంలో వీటిని మరింత మెరుగుపరుచుకొంటూ కొనసాగిస్తాడన్నమాట!

 

పరిసరాల విజ్ఞానాన్నందించే సైన్సును,

చరిత్రను, భూగోళాన్ని, సమాజ స్వరూపాన్ని వివరించే సాంఘికశాస్త్రాన్ని,

బుర్రకు పదునుపెట్టి, వికసింపజేసే గణితశాస్త్రాన్ని,

మానవతా విలువలను ప్రోది చేసే సాహిత్యాన్ని నేర్చుకోవడమే కదా పాఠశాల విద్య!

 

పైన చెప్పిన విషయాలను నేర్చుకొనే సాధనమే కదా భాష! తెలియని విషయాలన్నింటినీ తెలిసిన భాష ద్వారా నేర్చుకోవడమే సులభ సాధ్యం! తెలిసిన భాషంటే మాతృభాషే కదా!

 

మరి ఇందుకు భిన్నంగా తెలియని సైన్స్, సోషల్, లెక్కలు వంటి కొత్త విషయాలను తెలియని భాషలో నేర్చుకోవడం అసాధ్యం కదా! తరువాత జీవితంలో ఏవృత్తిలో స్థిరపడినా, ఆవృత్తి నైపుణ్యాలతో రాణించగలరే గాని, కేవలం ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన ఎవరూ రాణించరు.

 

పాఠశాల విద్య యొక్క లక్ష్యం బిడ్డకు తన చుట్టూ ఉన్న సమాచారాన్ని అందజేయడం, భవిష్యత్తులో తానెంచుకొనే వృత్తికి పునాది వేయడం, జీవన నైపుణ్యాలను, ఆత్మ విశ్వాసాన్ని, మానసిక వికాసాన్ని పెంపొందించడమే.

 

మాతృభాషలో తగిన ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకే పై నైపుణ్యాలు పొందే అవకాశం ఉంది. ఐతే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అవసరమేనని నేటి సమాజం భావిస్తున్నది కనుక, తగిన సమయంలో ఆ భాషను కూడా శాస్త్రీయంగా నేర్పించాలి.

 

ఇంగ్లీషు భాషను ఎలా నేర్చుకోవాలి?

 

ఇంగ్లీష్ మీడియంలో చదవడమే ఇంగ్లీషును నేర్చుకొనే సులభ మార్గమని మన తెలుగు తల్లిదండ్రుల ప్రగాఢ విశ్వాసం. అమాయకమైన ఈ విశ్వాసం ఎంత బలంగా ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో గూడ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఇంగ్లీష్ మీడియం విద్యనూ ప్రవేశపెట్టేంత!

 

మీడియం ద్వారా భాషను నేర్చుకొనే ప్రయోగాలు ప్రపంచంలో ఎక్కడా జరుగలేదు. సైన్సు, సోషల్, లెక్కలు వంటి విషయాల ద్వారా ఇంగ్లీషునో, మరొక భాషనో నేర్పవచ్చు అని ఏ భాషా శాస్త్రవేత్తా ఎక్కడా చెప్పిన దాఖలా లేదు.

 

ఇంతటి అశాస్త్రీయమైన ఆలోచనలు అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలలో – మరీ ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో మాత్రమే చూస్తున్నాం.

 

రెండో భాషను నేర్పే పద్ధతులే వేరు. ఆ పద్ధతులలోనే కొత్త భాషను నేర్పించాలి.

 

పరిశోధనలేం చెప్తున్నాయి

 

8 సంవత్సరాలు వచ్చేవరకు భాషకు సంబంధించిన పునాదులేర్పడవు. అప్పటికి సొంత భాషలో ఆలోచనలు రావడం, భావ వ్యక్తీకరణ చేయడం వస్తుంది. ఆ పునాది మీదనే మనం బిడ్డకెన్ని భాషలైనా నేర్పగలం.

 

ఈ ప్రాథమిక సూత్రాన్ని మరచి, 1వ తరగతిలోనే అంటే నాలుగేళ్ల వయస్సుకే ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తామనడం బిడ్డను గందరగోళానికి గురి చేసి, విషయ సేకరణను, సృజనాత్మకతనూ దెబ్బతీస్తాయి. అప్పుడిక అవగాహన లేకుండానే బట్టీ చదువులతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించడమే తన పని అవుతుంది. తద్వారా బిడ్డ తన సహజ స్వభావాన్ని, వికాస ప్రవృత్తినీ కోల్పోతుంది.

స్విస్ శాస్త్రవేత్త ‘జీన్ పియాజెట్’ (1896-1980) తన జెనెటిక్ విపిస్టెమాలజీ’ అనే పరిశోధనా గ్రంధ సారాంశంగా “7 సంవత్సరాల లోపు కొత్త భాషను నేర్పే ప్రయత్నం బిడ్డలో గందరగోళానికే దారి తీస్తుంది” అన్నాడు.

 

1994 – ప్రపంచ బ్యాంక్ అధ్యయనం

 

విద్యార్ధికి పట్టు ఉన్న మాతృభాషలోనే సబ్జెక్టుల నైపుణ్యాలు ఎక్కువగా వృద్ది చెందుతాయి.

ప్రాథమిక (మాతృ) భాష మీద ఎంతగా పట్టు వుంటే అంతగా రెండవ భాషను నేర్చుకోగలడు.

ద్వితీయ భాషను బోధనా భాషగా ఎన్నుకోవాలంటే, అందులో విద్యార్ధి ప్రావీణ్యం సంపాదించడానికి మాతృభాషను అణచివేయక, ఎదగనివ్వాలి.

 

బ్రిటిష్ ప్రభుత్వ అధ్యయనం

 

2200 మైనారిటీ తెగల విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పాక్షికంగా మాతృభాషలో బోధన చేసే పాఠశాలల్ని నెలకొల్పింది. వీటివల్ల మంచి ఫలితాలే వచ్చాయి. ఈ విద్యార్థులలో ఆత్మా విశ్వాసం, దృఢ సంకల్పం, సామాజిక నైపుణ్యాలు ఈ ప్రక్రియ వల్ల పెరిగి, వారు ఎక్కువ ప్రతిభను కనబరిచారు.

 

జార్జి మాసన్ (అమెరికా) యూనివర్సిటీ అధ్యయనం

 

15 రాష్ట్రాలలోని 23 ప్రాథమిక పాఠశాలల్లో 11 సంవత్సరాల పాటు జరిగిన పరిశోధనలో తొలుత ఆంగ్ల మాధ్యమంలో బోధించిన పాఠాలను పిల్లల మాతృభాషలో కూడా బోధించి, ఫలితాలను విశ్లేషిస్తే ఈ పిల్లల ప్రతిభా ప్రదర్శన ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

 

ఆఫ్రికా – యునెస్కో అధ్యయనం

 

ఆఫ్రికా విద్యాభివృద్ది సంస్థ, యునెస్కోకి చెందిన ‘ఇన్ స్టిట్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్’ సంస్థలు ఆఫ్రికా విద్యార్థులలో విద్య నైపుణ్యాల వైఫల్యం మీదా అనేక రాష్ట్రాలలో పరిశోధనలు చేశాయి. 1వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోవడంతో పై పరిశోధనలు అవసరమయ్యాయి. వాటి సారాంశాలివి.

 

కనీసం 3వ తరగతి వరకైనా విద్యార్థిని మాతృభాషలో ఎదగనివ్వాలి.

 

బోధనా భాషగా ఇంగ్లీషును పెట్టాలంటే ఆ భాషను బాగా నేర్పించాలి. అందుకు కనీసం ఏడేళ్ళు పడుతుంది.

 

ఇంగ్లీష్ మీడియం కోసం మధ్యలోనే సొంత భాషను నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల అబివృద్ది, మానసిక ఎదుగుదల దెబ్బతింటున్నాయి.

 

సరిగా రాని భాషలో బోధన వలన గణితం, సైన్సులలో పిల్లలు వెనుకబడిపోతున్నారు.

 

ఇంగ్లీష్ మీడియం బోధన వలన పిల్లలు తమ సాంస్కృతిక మూలాలకు దూరమౌతున్నారు.

 

తమిళనాడు అధ్యయనం

 

కన్యాకుమారి జిల్లాలో డా. కె. రామస్వామి, డా. శ్రీవాత్సవ 8-9 తరగతుల పిల్లలపై “బోధనా భాష – నైపుణ్యం” మీద నిర్వహించిన అధ్యయనంలో మాతృభాషలో బోధన పొందిన పిల్లల్లో మానసిక వికాసం, భావ ప్రకటనా నైపుణ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు తేలింది.

 

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి పరిశోధనలోనూ ఋజువైన సత్యం ఏమిటంటే – సొంత భాషలో ప్రాథమిక విద్యనూ నేర్చిన పిల్లల్లో ప్రతిభా పాటవాలు, అతున్నత స్థాయిలో ఉన్నాయని. దీనర్ధం పరభాషలో ప్రాథమిక విద్యను నేర్చిన పిల్లలకు ప్రతిభ లేదని కాదు. బోధనా ప్రమాణాలు, వసతులు ఒకే స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నత ప్రతిభను ఉపయోగించుకోవడంలో పరభాషలో చదివిన వారికన్నా, మాతృభాషలో చదివిన పిల్లలే నిస్సందేహంగా ముందుంటారు.

 

ఇంటి భాష

 

తెలుగు దేశంలో ఉన్న ప్రజలంతా ఒకేరకమైన తెలుగు మాట్లాడటం లేదు. జిల్లాకొక మాండలికం అటుంచి, ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క మాండలికం – పదజాలం ఉన్నాయి.

 

“మా ఇంటి భాష, మా బడి భాష ఒకటి కాదు. బడిలో బోధనా భాష మాకెట్లాగూ కొత్తదే కాబట్టి, దానికి బదులు ఇంగ్లీష్ మీడియం ఐతే ఈ పోటీ ప్రపంచంలో మరింత ఉపయోగపడుతుంది గదా! అనే వాదన కొన్ని వర్గాల నుండి వస్తున్నది.

 

నిజమే, మొదటి నాలుగైదేళ్ళు ఇంటి వద్ద పెరిగిన పిల్లవాడు పాఠశాలకు వెళ్ళగానే తనకు తెలిసిన ఆ రెండు వేల పదాల ఆధారంగానే పాఠాలు నేర్చుకోగలడు గాని, కొత్త పదాలతో కొత్త విజ్ఞానాన్ని సంతరించుకోలేడు గదా! కనుక ప్రాథమిక విద్య ఆ ప్రాంతపు మాండలికంలో, ఆ ప్రాంతపు విశేషాలు, సంస్కృతులలో ఉంటే విద్య నేర్చుకోవడం సులభమౌతుంది.

 

ఈ పునాది పైనే 6వ తరగతి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రామాణిక తెలుగు భాషలో బోధించవచ్చు.

కనుక ప్రాథమిక స్థాయిలో ఇంటిభాషలో బోధనా, ఉన్నత పాఠశాలలో మాతృభాష అయిన ప్రామాణిక తెలుగులో బోధన శాస్త్రీయం.

 

ఇంగ్లీషు అవసరం ఎందరకు?

 

మన రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 15 లక్షల మంది 1వ తరగతిలో చేరుతుండగా ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం పరీక్ష రాసేవారు సుమారు 9 లక్షలు. అంటే 6 లక్షల మంది విద్యార్థులు ఐ.టి.ఐ., పాలిటెక్నిక్, ఎ.ఎన్.ఎం., నర్సింగ్ వంటి కోర్సుల్లో ఉండవచ్చు. కొందరు వడ్రంగి, వ్యవసాయం, కమ్మరి, ప్లంబింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రికల్ వంటివాటిలో ఇమిడిపోతున్నారు.

 

ఇక మిగిలిన 60 శాతం మందిలో కొందరు డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ లకు పోతున్నారు. కొద్దిమంది సుమారు 4000 మంది డాక్టర్లు, మరికొందరు లాయర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు ఔతున్నారు.

 

వీళ్ళలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్ళేవారికే చక్కటి ఇంగ్లీష్ అవసరం. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యొగాలు (ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్. వగైరా) చేయడానికీ, ఇతర రాష్ట్రాలలో, దేశాలలో వ్యాపారం చేయడానికీ ఇంగ్లీష్ అవసరమే. ఐతే ఇలాంటి వారు 5 శాతం కూడా ఉండరు. ఈ 5 శాతం కోసం మిగిలిన పిల్లలందరికీ అర్థం కాని భాషలో సబ్జెక్టులను బోధించి, హింసించటం అవసరమా? శాస్త్రీయమా? ఇలా ఇంగ్లీషు అవసరమైన కొద్దిమంది ప్రత్యేకంగా ఆ భాషను నేర్చుకోవచ్చు. 3వ తరగతిలో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ భాషను శాస్త్రీయంగా బోధిస్తే 10వ తరగతి కల్లా బాగా వంటబడుతుంది.

 

ముగింపు :

 

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో మాత్రమే జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా పదే పదే ఋజువైన సత్యం.

తెలుగుదేశంలో ప్రాథమిక విద్య ఇంటి భాషలోను, ఉన్నత పాఠశాల విద్య ప్రామాణిక మాతృభాషలోను జరగడం శాస్త్రీయం.

 

3వ తరగతిలో ఇంగ్లీషును ప్రవేశపెట్టి, శాస్త్రీయ పద్ధతుల్లో బోధిస్తే 10వ తరగతి పూర్తయ్యేసరికి ఇంగ్లీషులోనూ పట్టు వస్తుంది.

 

1వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియంలో చదవవలసి వస్తున్న విద్యార్ధులు తమ సృజనాత్మకతను, బాల్యాన్ని కోల్పోతున్నారు. ఆటపాటలతో మధుర సంగీతంలా గడిచిపోవలసిన బాల్యాన్ని హరించే హక్కు తల్లిదండ్రులకు లేదు.

 

ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

 

ఈ వ్యాసరచనలో ఉపయుక్త గ్రంధాలు :

 

మాతృభాషలో ప్రాథమిక విద్య – అట్లూరి పురుషోత్తం

మాతృభాష – ప్రాథమిక విద్య – డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ

తెలుగు అధ్యాపక విధానం – సత్తిరాజు కృష్ణారావు

మదర్ టంగ్ ఎడ్యుకేషన్ – థీరీ అండ్ ప్రాక్టీస్ – కె.వి.వి.ఎల్. నరసింహారావు

వార్తా పత్రికలలో ప్రతురితమైన పెద్దల వ్యాసాలు

‘ఇది వ్యక్తి సమస్య కాదు – జాతీయ సమస్య’ – చండ్ర రాజేశ్వర రావు

 

డా. డి.ఆర్.కె. ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణా జిల్లా

 

23-04-2011 వ తేదీన “ఇంగ్లీషు మీడియం అవసరమా?” పేరుతో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం