‘అంపశయ్య నవీన్’ గారి ‘ముఖాముఖి’....           (06-Jun-2020)


 ‘అంపశయ్య నవీన్’ గారి ‘ముఖాముఖి’

 

నవంబర్ 2016, ‘తెలుగు వెలుగు’లో ప్రచురించబడిన ‘అంపశయ్య నవీన్’ గారి ‘ముఖాముఖి’లో కొంత భాగం:

 

ప్రశ్న:

ఓ విశ్రాంత అధ్యాపకుడిగా చెప్పండి… ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది?

 

జవాబు:

అస్సలు బాగాలేదు. మాతృభాషను పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఓ దౌర్భాగ్య ధోరణి కనపడుతోంది. ‘కేజీ నుంచి పీజీ’ విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తామంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్నది ప్రైవేటు సంస్థలు సృష్టించిన భ్రమ. దీనివల్ల పల్లెల్లోని పేద తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడానికి సంసిద్దులవుతున్నారు. అలా కాకుండా ప్రతి విద్యార్థి కనీసం పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకోవాలనే విధానం వస్తే బాగుంటుంది. విద్యార్థులకు మాతృభాష తెలుగు సరిగ్గా రావట్లేదు. ఈతరం పిల్లలైతే తెలుగు మాట్లాడటం నామోషీ అనుకుంటున్నారు. వీళ్ళకి కనీసం ఇంట్లో మాట్లాడుకునే తెలుగు పదాలు కూడా తెలియవు. నీళ్ళను ‘వాటర్’ అనీ, పదిని ‘టెన్’ అనీ… ఇలా ప్రతి తెలుగు పదం బదులు ఆంగ్ల పదాన్ని వాడటానికి ఇష్టపడుతున్నారు. పచ్చళ్ళను ‘పికిల్’ అనీ అనేవారికి ‘మత్తడి’ లాంటివి ఎలా రుచిస్తాయి? ఇలాంటి పరిస్థితుల వల్ల తెలుగు సంకర భాషగా తయారైంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. దీని గురించి పెద్ద పోరాటం జరగాలి. ఇటీవల నిజామాబాదులో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు కవిత గారితో, కరీంనగర్ లో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వినోద్ కుమార్లతో ఈ విషయం మీద చర్చించాం. కనీసం పదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని వాళ్ళూ అంగీకరించారు.

 

ప్రశ్న:

ఆంగ్ల మాధ్యమ చదువులు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయా?

 

జవాబు:

 

చేయవు. నేను 1945-46లో చదువుకోవడం ఉర్దూ మాధ్యమంలోనే. మొదటగా ఉర్దూ ఓనమాలు నేర్పించేవారు. వాటిని నేర్చుకోవడం కష్టంగా ఉండేది. 1948లో ఆ మాధ్యమాన్ని తొలగించి, తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా హాయిగా నేర్చుకున్నాను. ప్రతి వ్యక్తికీ మాతృభాష అనేది చాలా తొందరగా, సులభంగా సొంతమవుతుంది. మాతృభాషను నేర్చుకోలేని వాళ్ళు ఏ ఇతర భాషనూ నేర్చుకోలేరని భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మాతృభాష కన్నతల్లి వంటిది. పరాయి భాష ఎప్పటికీ పరాయిదే. దాని మోజులో పడి మనం మాట్లాడే వచ్చీరాని ఇంగ్లీషును విని విదేశీయులు…. ముఖ్యంగా ఇంగ్లండు వాళ్ళు నవ్వుకుంటున్నారు.