దురదృష్టం – త్రిపుర వామపక్ష ప్రభుత్వ నిర్ణయం....           (05-Jun-2020)


కొద్ది సంవత్సరాల క్రితం అప్పటి త్రిపుర వామపక్ష ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతున్నట్లు నిర్ణయం తీసుకున్నది. ఇది సరికాదని తెలుగు దినపత్రికలకు ఈ ఉత్తరం రాయటం జరిగింది. ఇది ఏ పత్రికలోనూ ప్రచురింపబడలేదు.

 

దురదృష్టం – త్రిపుర వామపక్ష ప్రభుత్వ నిర్ణయం

 

తమ రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమ విద్యకు పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని, ఉచిత ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నట్లు త్రిపుర విద్యాశాఖ మంత్రి తపన్ చక్రవర్తి గారి ప్రకటన చూశాను.

 

ఇంగ్లీషు బాగా నేర్చుకొనకపోతే తమ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేరేమో అనే భయం వల్ల మన రాష్ట్రంలో వలెనే, అక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో తమ బిడ్డలను చదివించాలని ఆలోచిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ద్వారానే ఇంగ్లీషును పిల్లలు బాగా నేర్చుకుంటారనేది వారి భావన. ఐతే, ఏ పరభాషనైనా మీడియం ద్వారా నేర్చుకోవడమనేది అశాస్త్రీయమనీ, ఎవరైనా మాతృభాషలో పరిపుష్టులైన తరువాతే అన్య భాషలలో నిష్ణాతులు కావడం సులభసాధ్యమని భాషా శాస్త్రవేత్తలు, మానసిక, సామాజిక శాస్త్రజ్ఞులు ఏనాడో నిగ్గు తేల్చారు.

 

తెలిసిన భాష ద్వారా లెక్కలు, సైన్సు, సోషల్ వంటి తెలియని విషయాలను నేర్చుకోవడం సులభం. తెలియని ఆంగ్ల భాష ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడం అత్యంత కష్టసాధ్యమని, తద్వారా విద్యార్ధుల సృజనాత్మకత దెబ్బ తిని, మార్కుల కోసం బట్టీల కలవాటు పడి, యాంత్రిక జీవులుగా తయారౌతారని పరిశోధనలు చెబుతున్నాయి. విద్యార్థి బ్రతుకులో మొదటి పరాధీనత ఇక్కడే మొదలౌతుంది.

 

ఇంగ్లీషును ఒక ఉపాధి భాష అనుకుంటే దాన్ని ఒక భాషగానే విద్యార్ధులకు 10వ తరగతి దాక నేర్పించి పట్టు సంపాదించేలా చేయాలి.

 

తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమంపైన అపోహలను తొలగించటానికి ప్రత్యేకమైన కృషి జరుపవలసింది పోయి తల్లిదండ్రుల అశాస్త్రీయ ఆకాంక్షలకు విద్యార్థుల అమూల్యమైన బాల్యాన్ని ఫణంగా పెట్టడం వామపక్ష ప్రభుత్వానికి తగని పని.

 

మన రాష్ట్రంలో సక్సెస్ స్కూళ్ళ పేరుతో 6వ తరగతి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టిన తర్వాత వస్తున్న నష్టాలు, గందరగోళం మనందరికీ తెలుసు.

 

కనుక త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి, తల్లిదండ్రుల్ని ఒప్పించి పాఠశాల విద్యను మాతృభాషలోనే కొనసాగించాలనీ – అవసరం, ఆసక్తి ఉన్న పిల్లలకు ఇంగ్లీషును ప్రత్యేకంగా శ్రద్ధగా నేర్పించగలరనీ ఆశిస్తున్నాను.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.
April 12, 2018