ఐలయ్య గారికి అభివందనం....           (05-Jun-2020)


ది. 18-06-2014న కంచ ఐలయ్య గారు ఆంధ్రజ్యోతిలో రాసిన “కె.జి. టు పీజీ ఇంగ్లీషు విద్య” వ్యాసం చదివిన తరువాత నా స్పందన తెలియచేశాను. ఆంధ్రజ్యోతి ఈ వ్యాసాన్ని ప్రచురించలేదు. ఐలయ్య గారు రాసిన వ్యాసాన్ని కూడా ఈ దిగువ post చెయ్యడమైనది.

 

ఐలయ్య గారికి అభివందనం

 

ది. 18-06-2014న కంచ ఐలయ్య గారు ఆంధ్రజ్యోతిలో రాసిన “కె.జి. టు పీజీ ఇంగ్లీషు విద్య” వ్యాసం చదివిన తరువాత ఈ నాలుగు ముక్కలు చెప్పాలనిపించింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం ఆయన అనేక ప్రయోజనకరమైన, ఆచరణాత్మకమైన సూచనలు చేశారు. అందుకే ఆయనకు నమస్కారం. ఐతే, “ఇంగ్లీషు మీడియంలో “కె.జి. నుండి పీజీ విద్యాబోధన” అని వారు రాయడం మాత్రం పూర్తిగా అశాస్త్రీయం. అభివృద్ధి నిరోధకం అని చెప్పక తప్పదు.

 

శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ది చెందిన ఏ దేశంలోనూ పరభాషలో విద్యాబోధనా జరగటం లేదు. లెక్కలు, సైన్సు, సోషల్ సబ్జెక్టులను ఏ భాషలో బోధిస్తే దాన్ని ఆ మీడియం అంటున్నాం. మన బిడ్డలు తమ కాళ్ళపై తాము నిలబడటానికి కావలసిన ఉద్యోగాలు పొందడానికి ఈ మూడు విషయాలే కీలకం. మరి వీటిని పిల్లలకర్థమయ్యే మాతృభాషలో బోధిస్తే పట్టు వస్తుంది కాని, అర్థం కాని ఇంగ్లీషులో, అర్థంగాని సబ్జెక్టులని ఎలా నేర్పుతారు?

 

బిడ్డకు 7 సంవత్సరాలకు మెదడులో భాషా సంబంధమైన పునాదులేర్పడతాయని వైద్య శాస్త్ర పరిశోధనలు చెపుతున్నాయి. ఇంటి వాతావరణం, చుట్టూ ఉన్న సమాజ వాతావరణం నుండి బిడ్డకు సొంత భాష రూపొందుతుంది. ఆ భాషలో కొంత ప్రామాణికత సంతరించుకొన్న తరువాతే పరభాష సులభంగా పట్టుబడుతుంది. తనకర్థమయ్యే సొంత భాషలో మాత్రమే పిల్లలు కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలరు. అందుకే 3వ తరగతి లోపు – అంటే 7 ఏళ్ల లోపు ఇంగ్లీషు బోధించడం అశాస్త్రీయం.

 

ప్రపంచంలో ఎక్కడా సైన్సు, సోషల్, లెక్కల ద్వారా పరభాషను నేర్పే ప్రయోగం జరగడం లేదు. ఏ భాషా పండితుడూ కొత్త భాషను ఇలా నేర్పుకోవచ్చని చెప్పలేదు. అసలది “కామన్ సెన్స్”కే అందనిది.

 

“ఎల్.కె.జి” నుండే ఇంగ్లీషులో బోధిస్తే ఆ పసి మెదళ్లపై ఒత్తిడి పెరిగి మొద్దుబారిపోతాయి. అనివార్యంగా బట్టీ పట్టడం అలవాటై, సృజనాత్మకత నశిస్తుంది. జాతి భవితకిదెంత నష్టదాయకం? పరిశోధనా రంగం (Inventive Sector), తయారీ రంగం (Productive sector)లను నిర్వీర్యపరచి, సేవారంగం (Service sector)లో మాత్రమే అభివృద్ధి సాధించే మన ఆర్ధిక వ్యవస్థ ఎప్పుడైనా కూలిపోవచ్చు.

 

నిరుపేద సామాజిక నేపధ్యం నుండి వచ్చిన కంచ ఐలయ్య గారు ఆంగ్లంలో దిట్ట. మరి ఆయన ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదే! త్రివేండ్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ “శ్రీ చిత్రా తిరునాళ్ కళాశాల’లో ఉన్నత పట్టా పొందిన ఖమ్మం వాసి, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ ఎం.ఎఫ్. గోపీనాథ్ తన పాఠశాల విద్యను తెలుగు మీడియంలోనే చదివారు. ఆసక్తి, అవసరం, పట్టుదల ఉన్న ఎవరైనా ఐదారు నెలల సమయంలోనే ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రతి వ్యక్తీ ఆంగ్ల భాషా ప్రవీణుడైతే అందరం సంతోషిద్దాం. ఐతే ఇక్కడ సమస్యంతా భాషను భాషగా నేర్చుకుంటే దిట్టలౌతారు గాని, మీడియం ద్వారా కాలేరు.

 

“బడుగులు తమ కుటుంబ మూలాలకు దూరం కాకూడదు” అని ఐలయ్య గారు మంచి సంగతి చెప్పారు. కాని, కేజీ నుండి ఇంగ్లీషు మీడియం విద్య వలన జరిగే నష్టం “మూలాలకు దూరం కావడమే!”

 

ప్రముఖ దళిత రచయిత కాలవ మల్లయ్య గారి అభిప్రాయం: “దళిత బహుజనులలో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నావంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకున్నాం. ఇప్పటికీ గెలుచుకుంటున్నారు. ఇప్పుడిక గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలలో గూడ ఆంగ్ల మాధ్యమం వస్తే అసంఖ్యాక బడుగుజనుల పిల్లలు ధనికుల పిల్లలతోబాటే తమ మూలాలకు దూరమై, యంత్రాలుగా మారి అన్నివిధాల ఓడిపోతారు”.

 

“నారాయణ, చైతన్య సంస్థల విద్యార్థులు, చుక్కా రామయ్య గారి విద్యార్థులు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడిన దాఖలాలు లేవు” అని ఐలయ్య గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. కాని ఆ రెండు సంస్థలతో రామయ్య గారిని ఒకే గాట కట్టడం దురదృష్టకరం. మన దేశంలోని ప్రతిభావంతులలో ముఖ్యంగా ఐ.ఐ.టి. వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి వచ్చిన వారిలో సింహభాగం బహుళ జాతి సంస్థలకే ఉపయోగపడటం కఠోర వాస్తవం.

 

ఇంగ్లీషు భాష బాగా వస్తే ఎదుగుదల కవకాశం ఉంటుందనేది నిజమే. కానే ఆ ఇంగ్లీషును నేర్చుకోవడం మీడియం ద్వారా కాదు సుమా! 3వ 3 వ తరగతి నుండి 10వ తరగతి దాక దాన్నొక సబ్జెక్టుగా పెట్టి ఆ భాష మీద పట్టు వచ్చేట్లుగా బోధించాలి. పాఠశాల విద్య ఆంగ్ల మాధ్యమంలో జరిగితే అది సమాజానికి మేలు కానే కాదు, కీడే!

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి, చల్లపల్లి
కృష్ణా జిల్లా – 521 126
సెల్ : 9885051179
e-mail : drk.drk@rediffmail.com
తేది : 20-06-2014

 

ది. 18-06-2014న కంచ ఐలయ్య గారు ఆంధ్రజ్యోతిలో రాసిన “కె.జి. టు పీజీ ఇంగ్లీషు విద్య” వ్యాసం