మాకు దొరికిన మాలతీ చందూర్.... ఒకే ఒక్కభార్గవి....           (27-Nov-2018)


 ఒక భార్గవిపుస్తకం నా చేతిలోకి రాగానే చాలా త్రిల్లింగ్ గా అనిపించింది. గత 3 సంవత్సరాల నుండి Facebook లో భార్గవి రాసిన వ్యాసాలు చాలా వరకు చదివాను. చదివిన ప్రతి సారి ఇవన్నీ పుస్తకంగా వేస్తే బాగుండు మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు గదా అనుకునేవాణ్ణి. ఎందుకంటే ఇవి ఒక్కసారి చదివి వదిలేసే వ్యాసాలు కావు. పూలను, మొక్కలను, సూర్యోదయాన్ని చూడగానే తనకొచ్చిన భావాలను, తన జ్ఞాపకాలను అన్నీ మనవిగా అనిపించేట్లు రాస్తుంది. తన బామ్మ గురించి రాసినా మన బామ్మ గురించి రాసినట్లుగా అనిపిస్తుంది. ఏది చదువుతున్నా మన ఎదురుగా తాను ఉండి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. V.A.K. రంగారావు గారు ఎంత అధికారికంగా రాస్తారో అంత అధికారంగానూ ఉంటుంది, మాలతీ చందూర్ రాసినట్లుగా బోలెడంత సమాచారమూ ఉంటుంది. అందుకే ఈ వ్యాసాలన్నీ పుస్తకంగా వస్తే దాచుకోవాలని కోరికగా ఉండేది.

 

         సంగీతం, సాహిత్యాలలో అందె వేసిన చేయి అయిన భార్గవి బాపు, ముళ్ళపూడి వెంకటరమణ లాంటి అనేకమంది మేధావులు, రచయితలతో స్నేహం చేసినా నాలాంటి పామరులను కూడా మరువకపోవడం ఆవిడ వ్యక్తిత్వానికి నిదర్శనం.

 

         మా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమసమాచారాన్ని పంచుకోడానికి మాత్రమే Facebook ని వాడే నేను భార్గవి రాసిన వ్యాసాలను వెంటనే చదివేవాణ్ణి. భార్గవి Facebook స్నేహితుల బృందం అంతా చాలా గౌరవనీయులు. వారి Comments చాలా హుందాగానూ, మరింత సమాచారాన్ని అందించేట్లుగానూ ఉంటాయి.

 

         బదరీ నాకు చాలా ఇష్టమైన మిత్రుడు. నా Classmate T.B. రామకృష్ణ ద్వారా పరిచయం. బదరీ భార్యగా, నా భార్య పద్మావతి Classmate గా భార్గవి పరిచయం. నేను, పద్మ తనను కలిసిన ప్రతిసారీ పాటలు పాడించుకుంటూ ఉంటాం. ఎంత మధురమైన గొంతో! మా కుటుంబ వేడుకలన్నీ తన పాటతోనే ప్రారంభమయ్యాయి. తాను పాల్గొన్న చల్లపల్లి జనవిజ్ఞానవేదిక కార్యక్రమాలలోనూ, స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో కూడా తనతో పాడించుకున్నాం. S.P.బాల సుబ్రమణ్యం గారు స్వచ్చ చల్లపల్లి ఉద్యమం చూడటానికి వచ్చినప్పుడు వారి సమక్షంలో దేవులపల్లి వారు రాసిన మధూదయంపాటను పాడటం జరిగింది. ఉదయం 4.30 నుండి 6.30 వరకు చేసే మా స్వచ్చ కార్యక్రమంలో మేము వినే పాటల్లో భార్గవి పాడిన మధూదయం పాట కూడా ఉంటుంది.

 

         బదరీకి ప్రమాదకరమైన వ్యాధి వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ఎంతో ధైర్యంగా ఉంటూ చేయించవలసిన వైద్యమంతా చేయించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చివరి ఆరు నెలలు బదరీ మన స్పృహలో లేడు. ఒక్కతే అతని అవసరాలన్నీ చూసేదీ.

 

         పుస్తకం నా చేతిలోకి రాగానే అట్ట తిప్పకముందే ఇవన్నీ నాకు కలిగిన భావాలు, వచ్చిన గురుతులు. నా మిత్రులకు ఇవ్వడానికి 10 పుస్తకాలు కొనుక్కున్నాను. మిత్రులు రామారావు గారు ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదివేసి అదేమిటో డాక్టరు గారూ రాతలో గానీ, ప్రింట్ లో గానీ ఒక్క తప్పు కూడా లేదుఅని చాలా సంతోషంగా చెప్పారు. శ్మశానంరాయటంలో మాత్రం స్మశానంఅని రాశారు అదొక్కటే నాకు కనిపించిన ఓ చిన్న తేడా అని చెప్పారు.

 

         పుస్తకం ప్రింటింగ్ చేసిన ప్రగతి ఆఫ్ సెట్ వారిని, బొమ్మలు వేసిన గిరిధర్ గౌడ్ గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అట్ట వెనుక ఉన్న భార్గవి బొమ్మ అట్ట మీద ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే భార్గవి అంటే ఎప్పుడూ నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ ఉండే భార్గవే గుర్తొస్తూ ఉంటుంది.

 

ఎంతో సుందరంగా తయారైన ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవటానికి కొని దాచుకోవల్సిందే....

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు
27.11.2018.