శుభాకాంక్షలు....           (06-Apr-2018)


 “ఏం డాక్టర్ గారూ ఉదయం నడకకు ఆలస్యంగా వచ్చారివాళ” అడిగారు శాంతారావు మాష్టారు.

 

ఉదయం లేవగానే ఒకావిడ ఫోన్ చేసి “మేడం గార్కి ఫోనిస్తారా, హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాలి” అని అడిగింది. నా భార్యను నిద్ర లేపి ఫోనిచ్చాను.

 

“మేడం గారూ హ్యాపీ ఉమెన్స్ డే” అంది అవతలి గొంతు.

 

“నీక్కూడానమ్మ” అని చెప్పి బద్ధకంగా వొళ్ళు విరుచుకుని లేచింది మా ఆవిడ.

 

“ఆ తర్వాత దూరవాణి (సెల్ ఫోన్)లో మెసేజ్ ల మీద మెసేజ్ లు వచ్చాయి. ‘ఉమెన్స్ డే’ గురించి. వాటన్నింటికీ ఆవిడ సమాధానాలు ఇస్తూ కూర్చుంది. అ కబుర్లు చెప్పుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందిలెండి” అన్నాను.

 

“హ్యాపీ ఉమెన్స్ డే అంటే ఏంటండీ?” అడిగారు మరొక మిత్రులు వాసు.

 

అదేంటండీ ప్రతి పండుగకూ ‘హ్యాపీ ఫలానా పండుగ’ అని చెప్పడం రివాజు కదండీ! పండుగ పేరుతో శుభాకాంక్షలు చెప్పుకుని మాట్లాడుకోవడం అన్నమాట. దీనివల్ల మానవ సంబంధాలు మెరుగవుతాయి కదా. ఇదంతా మన…..” అన్నారు రమణ మాష్టారు.

 

“ఏమోనండీ, నాకేం అర్థం కావడం లేదు. ఈమధ్య ఒక కిడ్నీ స్పెషలిస్టు దగ్గరకు ఒకాయన ఫోన్ చేసి “హ్యాపీ కిడ్నీ డే” అని చెప్పాడట. ఏం మాట్లాడాలో అర్థం కాక కొన్ని క్షణాలు అలోచించి ‘థాంక్యూ, విష్ యు ద సేం’ అని సమాధానం చెప్పారట ఆయన. వార్తా పత్రికలూ, దూరదర్శినిలలో బహిరంగ చర్చలు, గోష్టులు నిర్వహించడం ద్వారా మూత్రపిండాల జబ్బులపై అవగాహన కల్పించి జనం తమ మూత్రపిండాలను ఎక్కువ కాలం రక్షించుకోగలిగేట్లు చేయడం ఆ కిడ్నీ డే ఉద్దేశ్యం. మరి హ్యాపీ కిడ్నీ డే అంటే వేడుక అనే అర్థం వస్తోందిగా అని వాపోయాడు ఆ డాక్టర్ ఏసుపాదం గారు”.

 

‘సెప్టెంబర్ 5 న నాకు చాలామంది ‘హ్యాపీ టీచర్స్ డే’ చెప్పారు. ఆ తర్వాత ఒక కళాశాల వారు పిలిస్తే గురు పూజోత్సవ సమావేశానికి వెళ్లాను. కొంతమంది గురువులకు శాలువాలు కప్పి సన్మానం చేశారు మొక్కుబడిగా. ఆ తర్వాత పిల్లల నృత్యాలు (సినిమా పాటలకు డాన్సులు) మొదలయ్యాయి. ఒకళ్ళు చిరంజీవి పాటకు డాన్స్ చేస్తే వెంటనే బాలకృష్ణ పాటకు డాన్సు చేయాలట. లేకపోతే గొడవలై పోతాయట. ఏమైనా ఎక్కువసేపు ఆ గోల భరించలేక వచ్చేశా’నన్నారు వీరాంజనేయులు మాష్టారు.

 

“ఇంతకీ ఈ దినాల ప్రత్యేకత ఏమిటండీ బాబు?” మరో మిత్రుడి ప్రశ్న.

 

మన ఉమెన్స్ డే గురించి చెప్పరూ.

 

1910 లో డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ లో సోషలిస్టు మహిళల ప్రతినిధులతో జరిగిన అంతర్జాతీయ సదస్సు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చింది. అప్పటి నుండీ మార్చి 8 మహిళా హక్కుల దినోత్సవానికి సంకేతం. అంతే కానీ వేడుకలకు, సంబరాలకు కాదు ఈ దినోత్సవం.

 

‘అవును ప్రజాశక్తి ఆదివారం ప్రత్యేక పుస్తకంలో నేనూ చదివాను’ అన్నారు రామారావు గారు. ‘మహిళల హక్కుల సాధనకూ, లైంగిక సమానత సాధనకు ప్రతినబూనే రోజు అని రాశారు’.

 

ఇక టీ తాగే సమయం కావడంతో మళ్ళీ రేపు కలుద్దామంటూ సెలవు పుచ్చుకున్నాం.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

 

(ప్రజాశక్తి ఆదివారం అనుబంధం “స్నేహ″లో మార్చి 21, 2010న ప్రచురితం)