పిల్లి కరిస్తే ఏం చేయాలి....           (06-Mar-2022)


 పిల్లి కరిస్తే ఏం చేయాలి?

...

పిల్లి కరిచి ఇద్దరు మృతి

నేటి ఈ వార్త నన్ను కలిచివేసింది. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో పిల్లులు, కుక్కలు కరిచిన మనుషులు చనిపోవడం ఎంత బాధాకరమో చెప్పలేను.

* రేబిస్ మరణం ఎలా ఉంటుంది?

అతి భయంకరమైన మరణం ఇది. గొంతు మింగుడు పడదు. నీళ్ళు చూస్తే భయం వచ్చేస్తుంది. విపరీతమైన ఆందోళనతో గడగడలాడుతుంటారు. మింగుడు పడకపోవడం వలన తినలేరు, తాగలేరు. రోగం ఉధృతం అవుతున్నా స్పృహ కోల్పోరు. రోగికి, కుటుంబ సభ్యులకు ఇది అత్యంత భయంకరమైన అనుభవం.

ఇవి పూర్తిగా నివారించగలిగిన మరణాలు.

...

* ఎలా నివారించవచ్చు?

-పిచ్చి కుక్క కరిస్తే రేబిస్వ్యాధి వస్తుందని మనందరకూ తెలుసు.

కుక్కే కాదు, పిల్లి, నక్క, కోతి, గబ్బిళం కరిచినా రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

* ఈ జంతువులు కరిచిన వారందరికీ రేబిస్ వస్తుందా?

-రాదు.

కరిచిన జంతువుకు రేబిస్ వ్యాధి (పిచ్చి లక్షణాలు) ఉంటేనే ఈ ప్రమాదం ఉంటుంది.

* మరి కరిచిన జంతువుకు రేబిస్ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

-మనకు తెలియకపోవచ్చు. పిచ్చి లక్షణాలు కనపడవచ్చు, కనపడకపోవచ్చు.

* అయితే ఏం చేయాలి?

- ఈ జంతువులలో ఏది కరిచినా Anti Rabies vaccine వేయించుకోవాలి.

కేవలం Tetvac ఇంజక్షన్ సరిపోదు.

* అందరూ చేయించుకోవాల్సిందేనా?

-అక్కర్లేదు.

క్రమబద్ధంగా రేబిస్ వేక్సిన్ చేయించిన పెంపుడు జంతువు కరిస్తే వ్యాక్సినేషన్ అవసరం లేదు.

* గత సంవత్సరం వరకు మా కుక్కకి వ్యాక్సిన్ వేయించాం. ఈ సంవత్సరం వేయించలేదు. ఇప్పుడు కరిచింది ఏం చేయాలి?

- అయినా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవలసిందే,

* ఎవరిదో పిల్లి కరిచి వెళ్లిపోయింది. మళ్ళీ కనపడలేదు. ఏం చేయాలి?

- కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి.

* కరవలేదు. కానీ గోళ్ళతో గీరింది రక్తం వచ్చింది. ఏం చేయాలి?

- వ్యాక్సిన్ వేయించాల్సిందే. పిల్లి కాలి గోళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు లాలాజలం గోళ్ళలో ఉండవచ్చు. లాలాజలంలో ఉన్న రేబిస్ క్రిములు మన చర్మంలోని రంధ్రం గుండా ప్రవేశించవచ్చు. కనుక వ్యాక్సిన్ వేయించుకోవాలి.

* కరిచిన పిల్లినో, కుక్కనో చంపేశారు లేదా అది ఏ కారు క్రిందో పడి చనిపోయింది. ఏం చేయాలి?

-వ్యాక్సిన్ వేయించాల్సిందే! పిచ్చి పట్టిన జంతువు 10 రోజులలో చనిపోతుంది. ఈ లోపే ఆక్సిడెంట్ లో చనిపోతే దానికి పిచ్చి ఉందో లేదో మనకు తెలీదు. కనుక పిచ్చి కుక్కే అనుకుని మనం వ్యాక్సిన్ వేయించుకోవడం సురక్షితం.

* మా పెంపుడు కుక్కకు క్రమబద్ధంగా rabies వ్యాక్సినేషన్ చేయించాం. పొరపాటున వేలు కొరికింది. ఆ మర్నాడు ఆక్సిడెంట్లో చనిపోయింది.

ఇప్పుడు ఏం చెయ్యాలి?

- వ్యాక్సిన్ ఐదు డోసులు వేయించుకోవడమే మంచిది.

*గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు వ్యాక్సిన్ వేయవచ్చా?

- వేయవచ్చు.

* ఎవరు వేయించుకోనవసరం లేదు?

-పెంచుకుంటున్న కుక్కకి గాని, పిల్లికి గాని క్రమబద్ధంగా Anti Rabies vaccine చేయించుతుంటే ఆ జంతువు తోక తొక్కినప్పుడో, కాలు తొక్కినప్పుడో కరిస్తే, పిచ్చి లక్షణాలు ఏమీ లేకుండా ఉంటే 10 రోజుల పాటు ఆ జంతువును గమనిస్తూ ఉండాలి. 10 వ రోజు ఆ జంతువు ఆరోగ్యంగా ఉంటే Anti Rabies vaccine అవసరం లేదు.

* వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది.

మొత్తం 5 ఇంజక్షన్లు చేయించుకోవాలి. కరిచిన రోజు ‘0’ (Zero) dose తీసుకోవాలి. ఆ తర్వాత 3,7,14,28 రోజులలో మిగిలిన నాలుగు ఇంజక్షన్లు చేయించుకోవాలి. ఈ ఇంజక్షన్లు చేతి కండకు (జబ్బకు) చేస్తారు. చిన్న పిల్లలకు తొడ ముందు భాగంలోని కండకు చేస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో చర్మానికి వ్యాక్సిన్ ఇస్తారు.

* వ్యాక్సినేషన్ తరువాత ఎప్పటి నుండి రేబిస్ వ్యాధికి రక్షణ ఉంటుంది?

ఈ ఇంజక్షన్లు 7 వ రోజు నుండీ పనిచేస్తాయి. 7 రోజుల వరకు మనకు రేబిస్ వ్యాధి నుండి రక్షణ ఉండదు. కనుక మొదటి రోజే ఇమ్యునో గ్లోబ్యుల్లిన్ఇంజక్షన్ చేయించుకోవాలి. బరువును బట్టి దీని డోసు నిర్ణయిస్తారు.

* మొదటి రోజు మొత్తం ఎన్ని రకాల ఇంజక్షన్లు చేయించుకోవాలి?

ఒక చేతికి రేబిస్ వ్యాక్సిన్ఇస్తారు.

‘Tetvac’ ఇవ్వవలసి వస్తే రెండో చేతికి చేస్తారు.

ఇమ్యునో గ్లోబ్యుల్లిన్ఇంజక్షన్ కరిచిన గాయాల వద్ద చేస్తారు.

* రక్షణ ఎప్పటి వరకు?

మొదటి ఏడు రోజులు ఇమ్యునో గ్లోబ్యుల్లిన్వలన రక్షణ ఉంటుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ వలన రక్షణ ఉంటుంది.

* మళ్ళీ ఎప్పుడన్నా కుక్క గానీ, పిల్లి గానీ కరిస్తే వ్యాక్సిన్ చేయించుకోవాలా?

వ్యాక్సిన్ పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మనకు ఈ రక్షణ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత కరిస్తే మాత్రం మళ్ళీ చేయించుకోవలసిందే.

రెండు సంవత్సరాల లోపు కరిస్తే 10 రోజులు ఆ జంతువును పరిశీలించాలి. 10 వ రోజు కూడా అది ఆరోగ్యంగానే ఉంటే వ్యాక్సిన్ అక్కర్లేదు. ఆ జంతువు చనిపోయినా, కనపడకపోయినా వ్యాక్సిన్ చేయించుకోవడమే ఉత్తమం.

* కరవక ముందే వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చా?

ప్రజలందరూ ముందుగానే ఈ వ్యాక్సిన్ చేయించుకోవడం అనవసరం.

కుక్కలు, పి‌ల్లులుతో వ్యవహరించే పశువుల డాక్టర్లు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, పోస్ట్ మెన్లు, వ్యాక్సిన్లు తయారుచేసే సిబ్బంది వేయించుకొనవచ్చును.

వారికి 0, 7, 21 రోజులలో మూడు డోసులు తీసుకుంటే సరిపోతుంది.

* బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలా?

పాత తరం వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో (3 – 5 ml) 7 నుండి 14 ఇంజక్షన్ల వరకు చేయవలసి వచ్చేది. అందుకే బొడ్డు చుట్టూ చేసేవారు. అరుదుగా వాటికి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేవి.

ఇప్పుడు తయారుచేయబడుతున్న ఆధునిక ఇంజక్షన్లు తక్కువ మోతాదులోనే (1 ml) ఇవ్వవలసి ఉంటుంది. అందుకే చేతి కండకు చేస్తారు. ఈ ఇంజక్షన్లు మరింత సురక్షితమైనవి.

...

అవసరం అయిన వాళ్లందరకూ రేబిస్ వ్యాక్సిన్ వేయాలి.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తారు.

ప్రైవేటుగా కూడా వేయించుకోవచ్చు.

ఈ అవగాహనను మనం అందరికీ కల్పిస్తే ఎవ్వరూ రేబిస్ వ్యాధితో చనిపోరు.

...

ఆఖరి మాట :

పిల్లులు కరవడం మూలంగా నేను ఇప్పటికి 3–4 కోర్సులు ఈ వ్యాక్సిన్ చేయించుకున్నాను.

గత నెలలో ఒక వీధి కుక్కకు బిస్కట్ పెడుతున్నప్పుడు దాని పళ్ల వలన నా వేలికి అతి చిన్న గాయమయింది. ఐదు డోసుల Anti Rabies vaccine వేయించుకున్నాను.

* వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ :

పెంపుడు జంతువులకు అందరూ వ్యాక్సినేషన్ చేయిస్తారు అలాగే మన బజారులో ఉన్న వీధి కుక్కలకు మనమే వ్యాక్సినేషన్ చేయిస్తే మంచిది.

మా వీధిలో ఉండే 'తిమతి' అనే ఓ కుక్క ప్రతి రోజూ 4 గంటలకు మా "స్వచ్చ చల్లపల్లి" కార్యక్రమానికి మాతో పాటు వస్తుంది. కార్యక్రమం అయిన తరువాత మళ్ళీ మాతో పాటే తిరిగి వచ్చేస్తుంది. ఈ కుక్కకు rabies vaccine చేయించాము.

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి

06.03.2022