పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? (8 వ భాగం)....           (03-Oct-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా?
(8 వ భాగం)
(పాము కాటు మరణాలు తగ్గాలంటే ప్రజలకు అవగాహన పెరగాలి. అందుకోసం రాస్తున్న వ్యాసాలు)
డా. వి. కళైఅరసన్(డైరెక్టర్, చెన్నై స్నేక్ పార్క్)తో 2005 లో చేసిన ఇంటర్ వ్యూ
నా ప్రశ్న: డాక్టర్ అరసన్! విష సర్పాల నుండి తీసే విషం వల్ల ప్రయోజనాలేమిటి?
జవాబు: ఇందులో 99% విషం యాంటీ స్నేక్ వీనమ్ తయారీలో ఉపయోగపడుతున్నది. మిగిలిన ఒక్కశాతం పరిశోధనల కోసం వాడుతున్నారు. “Botrapase” అనే మందు తయారు చేయటానికి పాము విషాన్ని ఉపయోగించేవారు. ఇదివరలో రక్తస్రావాన్ని అరికట్టటానికి ‘Botrapase’ ను వైద్యులు వాడేవారు.
ప్రశ్న: మన దేశంలో సంవత్సరానికికెన్ని ASV లు తయారవుతున్నాయి? ఎన్ని ఎక్కడ ఖర్చవుతున్నాయి?
జవాబు: ప్రస్తుతం ఇండియాలో ఏటా సుమారు పది లక్షల యాంటీ స్నేక్ వీనమ్ వైల్స్ తయారవుతున్నాయి. ఇందులో లక్షన్నర ఇంజక్షన్లు మహారాష్ట్ర ప్రభుత్వం, యాభైవేలు కేరళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు యాభై వేలు మాత్రం కొనుగోలు చేస్తున్నది.
ప్రశ్న: ‘హెర్పిటాలజీ’ అంటే ఏమిటి?
జవాబు: సరీసృపాల, ఉభయచరాల అధ్యయనం.
ప్రశ్న: ‘ఓఫియాలజీ’ అంటే?
జవాబు: సర్పాల అధ్యయనాన్ని ‘ఓఫియాలజీ’ అంటారు.
డాక్టర్ పాట్రిక్ రస్సెల్ ను ‘ఓఫియాలజీ పితామహుడు’(Father of Ophiology)గా వర్ణిస్తారు.
1727 లో ఇంగ్లాండ్ లో జన్మించిన పాట్రిక్ రస్సెల్ కొంతకాలం విశాఖపట్నం లో పనిచేశారు. వైద్య శాస్త్రంలో పట్టా పొంది, పాముల మీద విస్తృతంగా పరిశోధనలు చేశారు. విశాఖ ప్రాంతాలలో ఎక్కువగా ఉండే “ కాటుక రేకుల పొడపాము”(రక్త పింజర) మీద పరిశోధనలు చేశారు. అందుకే ఆయన మరణానంతరం ఆ పాముకు ‘రస్సెల్స్ వైపర్’ అని ఆయనే పేరే పెట్టారు. తన 78 ఏట 1805 లో ఆయన మరణించారు.
ప్రశ్న : సముద్రపు పాముల సమాచారం వివరిస్తారా?
జవాబు: భారతదేశంలో ఉన్న 20 జాతుల సముద్ర సర్పాలన్నీ విషపూరితాలే. అయితే మన దేశంలో ఈ పాము కాట్లు చాలా అరుదు. ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలో ఎక్కువే. ఇండియాలో సముద్ర సర్పాల విషాలకు విరుగుడు (యాంటీ స్నేక్ వీనమ్) తయారీ లేదుగానీ జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్ల లో దొరుకుతుంది.
ప్రశ్న : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాము ఏది?
జవాబు: అతి ప్రమాదకర విష సర్పం Tipan. దీన్నే టైగర్ స్నేక్ అని కూడా అంటారు.
ఆస్ట్రేలియా లో ఉంటుంది. దీని తర్వాత ప్రమాదకరమైనది మన దేశంలో కట్లపాము.
ప్రశ్న: త్రాచు పాము పగ పడ్తుందనే ప్రజల నమ్మకం మీద మీ అభిప్రాయం?
జవాబు: పగబట్టేందుకు అవసరమయ్యే జ్ఞాపక శక్తి, మెదడు పాములకు లేనే లేదు.
ప్రశ్న: అంటే... మామూలు త్రాచుకాశక్తి లేదు కానీ, కింగ్ కోబ్రాకు పగబట్టే శక్తి ఉందని కొందరి ఊహ...
జవాబు: ఈ ప్రపంచంలో ఏ జాతి పాముకైనా పగబట్టేంత మేధాశక్తి లేదు గాక లేదు.
ప్రశ్న: కింగ్ కోబ్రా కరిస్తే ఏం చేయాలి?
జవాబు: అది చాలా పెద్ద సైజు పాము కనుక కరిచినపుడు ఎక్కువ విషాన్ని శరీరంలోకి ఎక్కించగలదు. కింగ్ కోబ్రా విషంలో రసాయన నిర్మాణం కూడా త్రాచుపాము విషంలాగానే ఉంటుంది. కాకపోతే త్రాచు విషం కాస్త పలచగా ఉంటుంది(Diluted Poison). కింగ్ కోబ్రా విషానికి కూడా మార్కెట్లో దొరికే యాంటీ స్నేక్ వీనమ్ విరుగుడుగా పని చేస్తుంది.
ప్రశ్న: మీ ‘చెన్నై స్నేక్ పార్క్’ ఆశయాలేమిటి?
జవాబు: ఇదొక ‘సర్ప విద్యా సంస్థ’. ప్రకృతిలోని ‘ఆహారపు గొలుసు’ లో పాములు అనివార్య జీవులు. పర్యావరణ సమతుల్యత కోసం పాముల మనుగడ తప్పదనీ, చీటికీ మాటికీ పాముల్ని చంపవద్దనీ మేము ప్రజలకు వివరిస్తాం.
థ్యాంక్స్ అరసన్ గారూ!
నమస్తే డాక్టర్!