పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? (7 వ భాగం)....           (02-Oct-2020)


పాము కాటుకు నాటు వైద్యమా?
నేటి వైద్యమా?
(7 వ భాగం)
(పాము కాటు మరణాలు తగ్గాలంటే ప్రజలకు అవగాహన పెరగాలి. అందుకోసం రాస్తున్న వ్యాసాలు)
ఏ.ఎస్.వి. అంటే....
యాంటీ స్నేక్ వీనమ్. పాము విషానికి విరుగుడు మందన్నమాట. ఒకప్పుడీ ఇంజక్షన్లు సులభంగా దొరికేవి కావు. అదృష్ట వశాత్తు ప్రస్తుతం3,4 కంపెనీలు తయారుచేస్తున్న ఏ.ఎస్.వి. లు డిమాండ్ కు సరిపడా మార్కెట్లో దొరుకుతున్నాయి.
ప్రధాన విష సర్పాలైన త్రాచు, రక్త పింజర, సాస్కెల్డ్ వైపర్ (ఫుర్సా), కట్లపాముల విషాలను విడివిడిగా అతి తక్కువ మోతాదుల్లో గుర్రాల శరీరాల్లోని కెక్కించినప్పుడు వాటిలో యాంటీబాడీస్ తయారౌతాయి. అప్పుడా నాలుగు రకాల యాంటీ బాడీస్ ను కలిపి యాంటీ స్నేక్ వీనమ్(ఏ.ఎస్.వి.)తయారు చేస్తారు.
ఇది పై నాలుగు రకాల పాము విషాలకూ విరుగుడుగా పని చేస్తుంది.
గర్భవతులకు, పసి పిల్లలకు కూడ ఈ ఇంజక్షన్లే ఇవ్వాలి.
ప్రభుత్వం అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 10 ఏ.ఎస్.వి.ల చొప్పున నిలవ ఉంచాలి.
మరి ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకోవాలంటే ప్రజల నుండి వత్తిడి రావాలి. పంచాయితీ వార్డు మెంబరు , సర్పంచ్, ఎం.పి.టి.సి., జడ్.పిటి.సి. మెంబర్లు, ఎమ్మెల్యే, ఎం.పి. లతో సహా ప్రజా ప్రతినిధులందరికీ
'పాముకాటు మరణాలు-వైద్యాలపై 'అవగాహన కల్పించాలి. ఇవన్నీ జరిగినప్పుడు రెండు మూడేళ్లలో ఈ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో 10 ఏ.ఎస్.వి. డోసులు నిల్వ ఉంచటం సంతోషకర పరిణామం.
పాము కాటుకు ప్రథమ చికిత్సను గూర్చి అందరికీ కనీస అవగాహన కల్పించాలి. పాఠశాలల విద్యార్థులకూ ఈ అవగాహన అవసరం. ఏ.ఎస్.వి. మాత్రమే పాము విషాన్నుంచి రక్షించగలదనే ప్రాథమిక అవగాహనను విస్తృతంగా ప్రజలంతా ఒకరితో ఒకరు చర్చించాలి. పాము కాటు రోగి చుట్టూ పదిమంది చేరి నిరుపయోగమైన పలు రకాల సలహాలిచ్చే సమయంలో ఈ అవగాహన ఉన్నవారే గట్టిగా వాదించి, నాటు, మంత్ర వైద్యాల బారిన పడకుండ సదరు రోగిని రక్షించగలరు.
ఇక్కడికి దగ్గరలోని లంకపల్లి గ్రామంలో ఒక కుర్రాడికి పాము కరిస్తే, యధావిథిగా, ఇరుగుపొరుగు అనుభవజ్ఞులంతా ఐకమత్యంతో నాటు వైద్యుని దగ్గరకు తీసుకెళ్తుండగా, ఒకే ఒక్క వ్యక్తి అది తప్పని గట్టిగా వాదించి, చల్లపల్లీలోని ఎం.బి.బి.ఎస్. డాక్టర్ దగ్గరకే వెళ్లాలని ఒప్పించి, ఎక్కువ సమయం వృథా కాకుండానే మా ఆసుపత్రికి తరలించాడు. నా దగ్గరకు వచ్చిన పావుగంటకే వాంతులై పరిస్థితి విషమించింది. 10 ఏ.ఎస్.వి. డోసులిస్తేగాని కోలుకోలేదు.
మరి ఈ కుర్రాడి ప్రాణాలు కాపాడింది డాక్టరా?
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని రోగిని ఆస్పత్రికి తరలించిన వ్యక్తా?
నిస్సందేహంగా ఈ ఘనత సదరు గ్రామస్తునికే దక్కుతుంది. ఎందుకంటే- ఇక్కడ డాక్టర్ ది వృత్తి ధర్మం. గ్రామస్తునిది అయాచిత మానవతా సాయం! ఎంత ఎక్కువ మందికి ఈ కనీస అవగాహన ఉండి, సామాజిక బాధ్యతాయుతంగా మెలిగితే, ఎందరు తగిన సమయంలో గట్టిగా వాదించి, ఒప్పించగలిగితే-
అన్ని నిండు ప్రాణాల్ని డాక్టర్లు రక్షించగలరు.
జనాన్ని విస్తృతంగా చైతన్యవంతుల్ని చేయందే పాముకాటు మరణాల నరికట్టడం సాధ్యపడదని జనవిజ్ఞాన వేదిక తొలి నుంచీ వాదిస్తూనే ఉన్నది.
చల్లపల్లి చుట్టుప్రక్కల ఉన్న అన్ని స్కూళ్ళలోని 6వ తరగతి నుండీ 10 వ తరగతి విద్యార్ధులకు 20 సంవత్సరాలక్రితమే అవగాహన కల్పించాము. విద్యార్ధులకు ఇచ్చిన ఈ శిక్షణ దీర్ఘకాలంలో మంచి ఫలితం వచ్చింది .
పాముకాటు- ప్రథమ చికిత్స:
పాము కరిచిన వెంటనే ముందుగా చేయవలసిన పని అది ఏ పామో గుర్తించడం. ఐతే ఈ ప్రయత్నంలో ఎక్కువ సమయం వృథా చేయకూడదు. వెంటాడి, వేటాడి, చంపి ఆ పామును ఆస్పత్రికి తీసుకుపోనవసరం లేనేలేదు. కరిచిన విష సర్పాన్ని ప్రత్యక్షంగాడాక్టర్ కు చూపినా, ఉన్న ఫళాన ఏ.ఎస్.వి. ఇంజక్షన్ చేయడు.
విష లక్షణాలు రోగిలో గమనించినప్పుడు మాత్రమే వైద్యం చేస్తారు.
మరైతే- కరిచిన పాము యొక్క కులగోత్రాలు గుర్తించడం ఎందుకంటారా? అది విష సర్పం కాదని తేలితే రోగి కంగారుపడకుండ స్తిమితంగా ఉండొచ్చనే!
* పాము కరిచిన వ్యక్తి హఠాత్తుగా భయాందోళనలు చెందుతుంటాడు. చనిపోతున్నానని తనకుతానే తీర్మానించుకొని, అయిన వాళ్ళకు అప్పగింతలు పెట్టుతుంటే- ఇరుగుపొరుగు వాళ్లూ అతనితో బాటు ఆరున్నొక్క శృతిలో రాగాలాపనచేయకూడదు. రోగికి ధైర్యం చెప్పాలి .
“పాము విషానికి విరుగుడు ఇంజక్షన్లున్నాయనీ, డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రమాదం నుండి బైట పడతావనీ” ధీమా కల్గించాలి.
వైద్యంతో బ్రతికి, నిక్షేపంలా ఉన్న వాళ్ళను పదేపదే గుర్తు చేయాలి.
* పాము కరిచిన శరీర భాగానికి కొంత పై భాగంలో తుండుతోనో, చేతి రుమాలుతోనో సుమారుగా బిగించి కట్టాలి. తాడుతోనో, ప్లాస్టిక్ వైరుతోనో మరీ గట్టిగా లాగి బిగించి కట్టకూడదు. అలా చేయడం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయి, సదరు శరీర భాగం ఆస్పత్రికి వెళ్ళే సరికే కుళ్లి పోవచ్చు.
కట్టులోంచి ఒకవేలు దూరేంతగా బిగించి కడితే చాలు.
తలపై కరిస్తే మాత్రం కట్టు కట్టకూడదు.
* కరిచిన చోట ప్రత్యేకించి చేయవలసిందేమీ లేదు. గాట్లను పరిశీలించి, గుర్తించగలిగితే చాలు. రెండు లేక మూడు గాట్లుంటే అది సాధారణ సర్పమనీ గ్రహించవచ్చు.
* పాము కరిచిన గాట్ల దగ్గర నోరుంచి, విషంతో సహా రక్తాన్ని పీల్చి ఉమ్మేయటం సినిమాల్లో చూపిస్తుంటారు. ఐతే అది మంచిపని కాదు. ఒకటి – అలా విషపూరిత రక్తాన్నంతా పీల్చేయటం సాధ్యపడదు. రెండు- పీల్చేవారి నోట్లో ఎంత చిన్న పుండున్నా అతనికీ ప్రమాదమే.
* రాగయుక్తంగా, అభినయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే కరిచిన పామే చచ్చినట్లు మళ్ళీ వెనక్కి వచ్చి, తన విషాన్ని మాత్రమే గాయం నుండి పీల్చేసుకొని గూడా కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. ఐతే, ఇదే నిజమని నమ్మి పాము కరిచినపుడు శ్రావ్యంగా భక్తి గీతాలు పాడుతుంటే వాళ్ళను మాత్రం నిజ జీవితంలో నేను చూడలేదు.
* పాము గాట్ల దగ్గర కొంత కండను కోసి తీసేస్తారు కొందరు. అలా చేస్తే చిన్నగాటు పెద్దగాయమై, దానికి మళ్ళీ అదనపు వైద్యం చేయవలసి వచ్చి, కోతి పుండు బ్రహ్మ రాక్షసి కావడం తప్ప ఏ ఉపయోగమూ లేదు.
* రోగిని నడిపించకూడదు. సైకిలు, స్కూటరు, కారు-దేనిమీదైనా ఎక్కించుకొని, సాధ్యమైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఎం.బి.బి.ఎస్. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
* పాము కరచిన రోగికి నోటి ద్వారా ఎలాంటి ఆహారమూ ఇవ్వొద్దు.
డాక్టర్ చేసే వైద్యం :
* కొన్ని ఇతర వైద్యాలతో పోల్చినప్పుడు ఇది సంక్లిష్ట వైద్యమేం కాదు.
* రోగికి ధైర్యం నూరిపోస్తూ, ఆస్పత్రిలో ఎడ్మిట్ చేసుకోవాలి.
* ఆహారమీ మీ ఇవ్వకుండా సెలైన్ ఎక్కించాలి.
* ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్తగా టెట్వాక్ ఇంజక్షన్ చేయాలి.
* రోగిని పరిశీలిస్తూ విష ప్రభావం కనిపించినపుడు ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు చేయాలి.
* విష లక్షణాలేవీ కనిపించకపోతే 24 గంటల తర్వాత రోగిని ఆస్పత్రి నుంచి పంపించివేయవచ్చు.
* పాము కరిచిన చేతికో, కాలికో ఒక్కోసారి చీము పట్టవచ్చు, అప్పుడు అవసరమనుకొంటే డాక్టర్ అక్కడ ఒక కోత పెట్టి చీము తొలగిస్తాడు.
* ఎప్పుడైనా రక్త పింజర విషం వల్ల మూత్రపిండాలు చెడితోనో, మెదడులో రక్త స్రావమై కోమాలోనికి వెళితోనో- నెఫ్రాలజిస్టు వద్దకో, న్యూరాలజిస్టు వద్దకో పంపుతాడు.
ఐతే నూటికి ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే ఇలాంటి అవసరాలు వస్తాయి.
నివారణలు :
వ్యవసాయ ప్రధానమైన మన దేశ గ్రామీణ ప్రాంతంలో పాముకాటును పూర్తిగా నివారించటం అసాధ్యం. వ్యవసాయ భూముల దగ్గర పాములుంటాయి. పగలు చెట్టుచేమల దగ్గర ఏమరుపాటుగా ఉన్నా, రాత్రి పూట లైటు లేకుండ నడిచినా, నేలపై పడుకొని నిద్రించినా పాము కాటులకవకాశాలుండనే ఉంటాయి. వ్యవసాయ కూలీలు చెరుకు తోటల్లో పనిచేసే సమయంలో చేతులకు తొడుగులు, మోకాళ్ళ వరకు బూట్లు వేసుకోవడం మంచిది.
రోగి బంధువుల విచిత్రాలు :
సంప్రదాయం- అది మంచిదో, చెడ్డదో- దాని బలం ఎలా ఉంటుందనేందుకొక ఉదాహరణ చిత్తగించండి.
రెండేళ్ల క్రిందట ఒక మిట్ట మధ్యాహ్నం మంచి ఒడ్డూ పొడుగూ ఉన్న ఆసామి తన బంధువును త్రాచుపాము కరిచిందని తీసుకువచ్చాడు. నాటు వైద్యుని దగ్గరకు కాక కరచిన అరగంటలోపే సరాసరి ఆసుపత్రికే తీసుకువచ్చినందుకు నేను సంతోషించాను. ఐతే విచిత్రంగా ఆసుపత్రి దగ్గర అతడు తన బంధువుల ఒత్తిళ్లకు లొంగి మనసు మార్చుకొని, సూటిగా నిర్మహమాటంగా నన్నిలా అడిగాడు- “ డాక్టర్ గారూ. మా నమ్మకం మాది. ప్రక్క ఊళ్ళో నాటు వైద్యం చేయించి, మరొక్క గంటలో రోగిని మళ్ళీ మీ దగ్గరకు తీసుకువస్తాం. అప్పుడు మీరు వైద్యం చేద్దురుగాని...” నేను గూడ ఇంచుమించు ఆయనంత స్థిరంగానే చెప్పాను. “ మీకా నాటు వైద్యం కావాలనుకుంటే అలాగే వెళ్లండి. కానీ అది ఎంతో రిస్క్ తీసుకోవడం. ఏ వైద్యం కావాలో త్వరగా నిర్ణయించుకోండి” అని. కొంతసేపు వాళ్ళలో వాళ్లే తర్జన భర్జన్లు పడ్డారు. నాటు వైద్యం కాదనుకొని, చివరకు మా ఆసుపత్రి వైద్యాన్నే ఎన్నుకున్నారు.
ఐతే బలిష్టుడైన ఆ ఆసామి మాత్రం “ నీ వైద్యంతో తగ్గక మావాడికేదైనా జరిగితే నీ సంగతి తేలుస్తా...” అన్నట్లుగా నాకేశి చూసిన చూపు ఇప్పటికీ నాకు మరపురాదు! సరే, ఆ రోగి పూర్తి స్వస్థుడై తిరిగి వెళ్లడంతో అక్కడికి కథ సుఖాంతమైంది.
సంప్రదాయ, ఆదునిక ఇంగ్లీషు వైద్యాలలో ఏదో ఒకటి ఎన్నుకోక తప్పని సన్నివేశంలో సగటు ప్రజల డోలాయమాన మానసిక స్థితికిదొక మంచి ఉదాహరణ!
నేను వైద్యం చేసిన పామూకాటు కేసుల్లో అధికభాగం నాటు, పసరు, మంత్ర వైద్యాల తర్వాత వచ్చినవే!ఆసుపత్రిలో రోగిని చేర్చాక, నాటు వైద్యం వంకకు మొగ్గినవారు కొందరున్నారు. మరికొందరైతే మా ఆసుపత్రికే నాటువైద్యులను తీసుకునివచ్చి, ఏక కాలంలో రెండు వైద్యాలను పొందాలని ప్రయత్నించారు.
ఇందులో ఉన్న ఇబ్బందులు రెండు.
నాటు, మంత్ర వైద్యాలతో కాలహరణం మొదటిది. కలికం కళ్ళల్లో పోయటంతో అవి ఎర్రబారి పాము విషప్రభావం ఎంతో ,నాటు వైద్యమహిమెంతో తెలియని గందరగోళ పరిస్థితిలోకి వైద్యుణ్ణి నెట్టడం .
రెండోది- నోట్లో పసరు పోయటం వల్ల వాంతులు అయినవో, విష ప్రభావంతో అయినవో తెలుసుకోవడం కష్టం. ఈ రెండు సందర్భాలలోను రోగికి ప్రమాద ఘంటికలు మ్రోగుతూనే ఉంటాయి.
నాటు వైద్యం చేయించి ఆసుపత్రికి తీసుకువస్తే ఆధునిక వైద్యం చేశానుకాని ఆసుపత్రిలో చేర్పించిన తరువాత నాటు వైద్యాన్ని ఇంతవరకూ అనుమతించలేదు.
చివరగా :
మార్పు అనేది ఈ లోకం యొక్క సహజ లక్షణం. గత 20 ఏళ్లుగా చల్లపల్లి పరిసర మండలాలలో పామూకాటు వైద్యంలో స్పష్టమైన మార్పు వచ్చింది.
సంప్రదాయ వైద్యాలైన మంత్రాల, ఆకుపసరుల వైద్యం నుండి శాస్త్రీయ ఆధునిక వైద్యం వైపు జనం ఇంతగా మారుతున్నారంటే ఇందుకు ముఖ్య కారణం జన విజ్ఞాన వేదిక,
రోటరీ,
కె.సి.పి. సంస్థల కృషేనని చెప్పాలి.
ఈ చిన్న పుస్తకాన్ని చదివిన విజ్ఞులు అందలి ప్రధాన విషయాన్ని, పది మందితో చర్చించి, ప్రజల అవగాహన పెంచాలని మనవి. జనం మధ్య అలాంటి అవగాహన పెరిగి, పామూకాటు మరణాలు క్రమేపీ తగ్గితే అదే ఈ పుస్తకానికి సార్థక్యం!
ఇండియాలోని ప్రముఖ హెర్పిటాలజిస్ట్ (పాము శాస్త్రజ్ఞుడు) 'రోములస్ విటేకర్ 'అభిప్రాయమిది....
“అసలే వైద్యమూ లేకున్నా సగం మంది పాముకాటు రోగులు బ్రతుకుతారు.
కొన్ని చిన్న జబ్బులకు మీరే వైద్యాలైనా చేయండి;
పాము కాటుకు మాత్రం మంత్రతంత్రాల, పసరు వైద్యం చేసి, ఒక్క రోగి చనిపోయినా ఆ నాటు వైద్యుణ్ణి హంతకుడుగానే భావించాలి”.
***
డా. వి. కళైఅరసన్ (మాజీ డైరెక్టర్, చెన్నై స్నేక్ పార్క్ ) గారితో మాటా మంతీ ...రేపు