పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? (6 వ భాగం)....           (01-Oct-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా?
(6 వ భాగం)
(పాము కాటు మరణాలు తగ్గాలంటే ప్రజలకు అవగాహన పెరగాలి. అందుకోసం రాస్తున్న వ్యాసాలు)
పాము కాటులు – విష లక్షణాలు
త్రాచుపాము, కట్ల పాముల్లో ఉండే విషం ‘న్యూరోటాక్సిన్’. ఈ విషం నరాల మీద, కండరాల మీద ప్రభావం చూపటం వల్ల పాముకాటు రోగులకు కండరాలు పనిచేయవు.
* రోగుల మొదటి లక్షణం –
కళ్లు మూతపడిపోవడం. మనం కళ్లు తెరవమంటుంటే భృకుటి ముడి పడుతుంది గాని, కనురెప్పలు సరిగా తెరవరు.
* రెండోది - వాంతి కాబోతున్నట్లనిపించడం, కొంత సేపటికి నిజంగానే వాంతులు కావడం.
* ఒకే మనిషి ఇద్దరుగా కనపడటం.
* మరికొంత సేపటికి శ్వాస కండరాలు పనిచేయక ఊపిరి ఆగిపోవడం.
* ఆ తరువాత గుండె కొట్టుకోవడం ఆగి, కొద్ది నిమిషాలకు మెదడు స్తంభించి, (బ్రైయిన్ డెత్) మరణం ప్రాప్తించడం.
*రక్త పింజర విషం శరీరంలోని ఏ భాగంలోకి ఎక్కితే ఆ భాగం వాస్తుంది. దగ్గరలో ఉన్న లింఫు గ్రంథులూ వాస్తాయి. గజ్జల్లోనో, బిళ్ళలు కడతాయి. భరించలేనంతగా నొప్పి వస్తుంది. ఆ తరువాత రక్త స్రావం మొదలౌతుంది. శరీరంలోని ఏ భాగం నుండైనా ఈ రక్త స్రావం జరగవచ్చు. మెదడు లోగనుక జరిగితే రోగి కోమాలోకి వెళ్లిపోతాడు.
* ఒక్కోసారి రక్త పింజర విషం మూత్రపిండాలను దెబ్బ తీస్తుంది. కిడ్నీలు పని చేయకపోతే రక్తంలోని వ్యర్థ పదార్థాలు శరీరంలోని పెరిగిపోయి – యురీమియా వల్ల మరణం సంభవిస్తుంది.
* కట్ల పాము కరిచినపుడు తీవ్రమైన మగత, నీరసం, తూలు రావచ్చు. అది పాము కాటు అని గమనించక పక్షవాతమనో, ఒంట్లో షుగర్ స్థాయి పడిపోయిందనో, సారా త్రాగటం ఎక్కువైందనో సర్ది చెప్పుకొని సెలైన్ పెట్టిస్తూ కాలక్షేపం చేయకూడదు. ముఖ్యంగా తెల్లవారే సమయంలో అయితే అది కట్లపాము కాటుగా అనుమానించి, విష లక్షణాలను గుర్తించి, ఏ.ఎస్.వి. ఇంజక్షన్ల వైద్యం ప్రారంభించాలి.
సామాజిక నేపధ్యం
పాము కాటుకు గురయ్యే వారిలో నూటికి 80 మంది రెక్కాడందే డొక్కాడని వ్యవసాయ కూలీలే. చెరకు జడ వేసేప్పుడో, చెరకు కోతలప్పుడో, మినప పీకుడు సమయంలోనో వాముల్లోంచి వరిగడ్డి లాగేప్పుడో గురౌతున్నారు. పూరి పాకల్లో, పెంకుటిళ్లలో నివసించే వారికే గాక, డాబాల్లో ఉంటూ నేలమీద నిద్రించే వారికి గూడ పాము కాట్లు తప్పడం లేదు.
ఎక్కువ సందర్భాల్లో పాము కాటుకు 10 ఏ.ఎస్.వి. డోసులివ్వవలసి ఉంటుంది. ఒక్కో డోసు 600 రూపాయల చొప్పున ఇంజక్షన్లకే ఆరువేలు, ఇతర ఖర్చులతో గలిపి 15-20 వేల ఖర్చు గ్రామీణ పేదలకు తలకు మించిన భారమనక తప్పదు.
పాపం కోటేశ్వరమ్మ!
ఆమెది చల్లపల్లికి దగ్గర్లోని కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామం. వయస్సు 40 ఏళ్లు. రక్త పింజర కరచిన గంటలోపే తీసుకువచ్చారు. మూడు గంటల తర్వాత కరచిన చోట వాపు పెరిగి గజ్జల్లో బిళ్ళ కట్టింది. రక్తం గడ్డ కట్టడం లేదు. 10 ఏ.ఎస్.వి. లు ఇచ్చాక ప్రాణ గండం తప్పింది గాని, మూత్రపిండాలు పాక్షికంగా దెబ్బతిన్నవి. విజయవాడ నెఫ్రాలజిస్టు దగ్గరికి తీసికెళ్లి ఒకటి రెండు సార్లు డయాలసిస్(రక్త శుద్ధి) చేస్తే తప్ప ఆమె ఎక్కువకాలం బ్రతకదని వివరించి చెప్పాను.
ఐతే ఆమెది దయనీయమైన ఆర్థిక స్థితి. సెంటు భూమి లేదు, గేదెలు కాచుకొని బ్రతుకీడుస్తున్నది. బంధువులు తలా పదీ, పరకా వేసుకొని, నా ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా నాకు వివరించి వాళ్ళు నిస్సహాయంగా తమ ఊరికి తిరిగి వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.
నేను మళ్ళీ వాళ్ళను ఆపి, విజయవాడలోని నెఫ్రాలజిస్టు 'డాక్టర్ అమ్మన్న' గారికి ఉన్న పరిస్థితంతా వివరించి చెప్తే, ఆయన పెద్ద మనస్సుతో – “మందులు మాత్రం వాళ్లు కొనుక్కోగలిగితే, నేను వైద్యమంతా ఉచితంగా చేస్తా” నన్నారు.
నా ఆస్పత్రి ఫీజులకు, బిల్లులకు వారేమీ చెల్లించనవసరం లేదనీ, ఆ డబ్బుతో విజయవాడలో మందులు కొనవచ్చనీ, వారిని ఒప్పించి విజయవాడ పంపించగా, డయాలసిస్ జరిగి, ఇప్పుడా కోటేశ్వరమ్మ యధావిధిగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నది.
ఇందులో కొసమెరుపేమిటంటే – ఈ కోటేశ్వరమ్మ సంవత్సరం తిరిగే సరికి, రక్త పింజర కాటుతో మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. సకాలంలో 10 ఏ.ఎస్.వి.లతో పునః పునర్జీవించింది.
సానుకూల పరిణామం
రోటరీ వారి ధర్మమా అని మూడు సంవత్సరాల పాటు ఏ.ఎస్.వి.లు ఉచితంగా పొంది చాలా మంది బ్రతికి బట్ట కట్టారు. ఆ ఉచిత పథకం ఆ తర్వాత ఆగిపోయినా పాము కాటు రోగులు డాక్టర్ల దగ్గరకు బాగానే వస్తున్నారు. పాము విషానికి నాటు వైద్యమే సరైనదని, ఇంగ్లీషు వైద్యం దండగ మారిదనే బలమైన నమ్మకం సడలిపోయి, ఏ.ఎస్.వి. అనే విరుగుడు మందే నమ్ముకొదగిందనే గట్టి విశ్వాసం ఇటీవలి కాలంలో చల్లపల్లి ప్రాంతపు జనంలో బలపడింది. ఇప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని పాము కాటు కేసులు నాటు వైద్యుల దగ్గరకు వెళుతున్నా, ఎం.బి.బి. ఎస్. డాక్టర్ల దగ్గరకు పోయి, ప్రాణ గండం దాటుతున్న వారి సంఖ్య క్రమంగా 95 శాతం దాటింది.
ఈ ప్రాంతంలో వచ్చిన ఈ పరిణామ క్రమానికి రోటరీ- కె.సి.పి. సంస్థలూ, జనవిజ్ఞాన వేదిక కారణాలని చెప్పాలి. ఇటీవల చల్లపల్లి సమీప గ్రామంలోని ఒక ప్రముఖ సీనియర్ నాటు వైద్యుడు తన బంధువును పాము కరిస్తే తాను చేయవలసిన వైద్యం చేసి వెంటనే ఆ పేషెంట్ ను ఇంగ్లీషు వైద్యం కోసం నా దగ్గరకు పంపారు.
పరిమి గారి ‘ జీవన వికాస విద్యావనం’ పాఠశాల(అడవి నెక్కలం)లో మా అవగాహనా సదస్సు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతానికి ఒక పాము వచ్చినప్పుడు, ఆ పిల్లలు దాన్ని చంపకుండా ప్రక్కన పొలాల్లోకి పంపడం పర్యావరణ రక్షణలో పాముల ప్రాముఖ్యతను విద్యార్థులు గ్రహించారనడానికి నిదర్శనం.
వెయ్యికి పైగా పాముకాటు కేసులకు చికిత్స చేసిన నా అనుభవంలో కేవలం ఒక్క కేసులో మాత్రమే పాము కరిచిన పదకొండున్నర గంటల తరువాత విష ప్రభావం కనిపించింది. మిగిలిన అన్నింటిలోనూ ఆరు గంటల లోపే విష లక్షణాలు కనిపించడం గమనార్హం.
కృష్ణాజిల్లాలో పేపర్లో పడిన పాముకాటు మరణాలు ఒక సంవత్సరంలో 55 దాకా లెక్కించాం. పేపర్ కందని దురదృష్ట మరణాలెన్నో మరి! వీరిలో కనీసం 52 మందిని పల్లె ప్రాంతాల ఎం.బి.బి.ఎస్. డాక్టర్లు బ్రతికించగలరనేది మా అనుభవపూర్వకమైన అంచనా.
ఇక మిగిలిన ఆ రెండు మూడు కేసులకూ స్పెషలిస్టు డాక్టర్స్ అవసమౌతారు
– రక్త పింజర కాటు వల్ల మూత్రపిండాలు చెడినప్పుడో, రక్తస్రావమధికమై తీవ్ర ప్రమాదంలో ఉంటేనో,
-త్రాచు ,కట్ల పాముల కేసుల్లో వెంటిలేటర్ అవసరమైతేనో తప్ప
మిగతా అన్ని కేసులకూ గ్రామీణ ప్రాంతపు ఎం.బి.బి.ఎస్. డాక్టర్లూ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వైద్యులూ సరిపోతారు. ఇందుకోసం వాడే పరికరాల ఖరీదు నాలుగైదువేలకు మించదు.
మరిన్ని విశేషాలు రేపు ...