పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? (5 వ భాగం)....           (30-Sep-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా?
(5 వ భాగం)
(పాము కాటు మరణాలు తగ్గాలంటే ప్రజలకు అవగాహన పెరగాలి . అందుకోసం రాస్తున్న వ్యాసాలు)
ఒక డాక్టరు గారి సందిగ్ధం :
ఒక రోజు రాత్రి 11 గంటలకు ఒక డాక్టర్ మిత్రుని నుంచి ఫోన్. “ఒక వ్యక్తి కాలుకు పాము కరించింది. ఏ పామో తెలియదు. నొప్పి విపరీతంగా ఉంది” అని.
బ్లడ్ క్లాటింగ్ టైం (రక్తం గడ్డకట్టే సమయం)తో సహా కొన్ని రక్త పరీక్షలు చేయించమన్నాను. క్లాటింగ్ టైమ్ 4 నిముషాలని మళ్లీ ఫోన్ లో చెప్పారు. పాము కరచిన కాలి వైపు గజ్జలో బిళ్ల కట్టిందని, అక్కడ నొక్కితే భరించరానంత నొప్పిగా ఉందనీ చెప్పారు. కాలికైతే గజ్జల్లోనూ, చేతికైతే చంకల్లోనూ బిళ్ళలు కట్టి నొప్పి వచ్చేది రక్త పింజర కరిస్తేనే.
అందుకని, నేను మళ్లీ ఫోన్ లోనే "క్లాటింగ్ టైమ్ రిపోర్ట్ తప్పేమో. ఈ సారి స్వయంగా నువ్వే ఆ టెస్టు చేసిచూడు” అని చెప్పాను. ఆయన చేసిన క్లాటింగ్ టెస్ట్ లో నాలుగు కాదు- 20 నిముషాలు దాటినా రక్తం గడ్డకట్టలేదు! మరింక అనుమానమే లేదు. ఆ రోగిని కరిచింది రక్త పింజరే. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే Anti snake venom పది ఇంజక్షన్లు ఇవ్వమని చెప్పాను. ఆ విధంగా ఆరేడు గంటల పోరాటంతో ఆ వ్యక్తి బ్రతికిపోయాడు.
*లేబొరేటరీ పరీక్షనే పూర్తిగా నమ్ముకొని పాముకాటుకు వైద్యం చేయరాదు. అవసరమైతే డాక్టర్ స్వయంగా పునః పరీక్షించి, ధృవీకరించుకోవాలి.
*అంతే గాదు,
క్లినికల్ కండిషన్, లాబొరేటరీ డేటా ఏకీభవించనపుడు క్లినికల్ ఎవాల్యుయేషన్ ప్రకారమే వైద్యం చేయాలి.
జనారణ్యంలో విష సర్పాలా? :
రెండు దశాబ్దాల క్రితం హైదారాబాద్ లో ఎమర్జెన్సీ మెడికల్ కాన్ఫరెన్స్ జరిగినపుడు ఒక ఎమెర్జెన్సీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని “సార్! మీ ఆసుపత్రి లో స్నేక్ పాయిజన్ ట్రీట్ మెంట్ కి ప్రోటోకాల్ ఏమిటి?” అని అడిగితే ఆయన బిగ్గరగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారని అడిగితే, “ ఈ హైదారాబాద్ మహా నగరం రద్దీలోకి పాము వస్తుందా? వచ్చి బ్రతుకుతుందా? పాము కాటు కేసులు మాకు రానూరావు, మాకా అనుభవమూ లేదు” అని వివరించారు.
నిజమే! పట్టణాల్లో పాములంతగా ఉండవు. పల్లెటూళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి, కరుస్తాయి! కాని, ఆ పాము కాటు కేసులు అర్హులైన డాక్టర్ల దగ్గరకు కాక, నాటు వైద్యుల దగ్గరకో, మంత్రగాళ్ల దగ్గరకో పోతాయి. ఇదీ పరిస్థితి!
అన్ని రాష్ట్రాల డాక్టర్లు పాల్గొన్న ఆ సమావేశంలో నే పాము కాటు కేసుల మీద ఆసక్తి ఉన్న50-60 మందిమి ఓ గంటకు పైగా ప్రత్యేకంగా దీన్ని గురించి చర్చించాం. చర్చల సారాంశమిది: ఎవరి అనుభవాన్ని బట్టి వారు పాముకాటుకు వైద్యాలు చేస్తున్నారే తప్ప ఒక నిర్దిష్ట విధానమే లేదు.
*“ పాము విషానికి విరుగుడు Anti snake venom తప్ప మరొకటి లేదు”. అనే ఒక్క విషయంలో మాత్రం అందరిదీ ఏకాభిప్రాయమే.
నాటు వైద్యంతో బ్రతకటం నిజమా? :
“నాటు వైద్యంతో, మంత్రంతో బ్రతికిన వాళ్ళను చాలమందిని చూశాం!”
ఛాలెంజ్ లాంటి ఈ మాటను గ్రామీణ ప్రాంతాల్లో మనం తరచూ వింటుంటాం. మనం కూడ అలా బ్రతికిన అదృష్టవంతుల్ని చూసే ఉండొచ్చు.
అన్ని పాములూ విష సర్పాలు కావు. విషం లేని పాములు కరిస్తే, ఏ రకమైన వైద్యం చేసినా, అసలు చేయకపోయినా, ప్రాణహాని ఉండదు. మహా ఐతే కరచిన చోట కొంచెం వాపు రావచ్చు. నొప్పి కలుగవచ్చు. ఇలాంటి వారికి మంత్రాలు, నాటు వైద్యాలు కొంత ధైర్యాన్ని కల్గించడం మినహా మరే ప్రయోజనమూ ఉండదు.
మన దేశంలో ఉన్న 250 జాతుల పాముల్లో 52 రకాలు మాత్రమే విష సర్పాలు.
మనిషికి ప్రమాదం చేయగల విష సర్పాలు 5 రకాలే .
1.త్రాచుపాము,
2.కట్ల పాము,
3.రక్త పింజర(దీన్నే గుమ్మడిత్తుల పింజర, పొడపాము అని కూడా అంటారు),
4.సాస్కేల్డ్ వైపర్ (ఫుర్సా),
5.హంప్ నోస్డ్ పిట్ వైపర్.
వీటిలో మొదటి మూడు రకాలే మన ప్రాంతంలో ఉంటాయి. నాల్గవ రకమైన సాస్కేల్డ్ వైపర్ ఉత్తర భారత దేశంలో ఉంటుంది. ఐదవది కేవలం కేరళ అడవుల్లోనే ఉంటుంది. సముద్రపు పాములన్నీ విషపూరితాలే కాని, మనదేశంలో ఆ పాము కాట్లు చాలా అరుదు.
‘పై విష సర్పాలు కరిచినా సరే, నాటు వైద్యంతో బతికిన వాళ్ళను చూశాం... ‘అంటారా? అది నిజమే కావచ్చు గానీ పాక్షిక సత్యం! ఎలాగంటారా?
ఈ రెండు అనుభవాలనూ చిత్తగించండి
ఒకరోజు ప్రొద్దుటే 6 గంటలకు ఒక యువకుడు తనను కరచిన రక్త పింజరను చంపి, తీసుకొని వచ్చాడు. సాధారణంగా పామూకాటుతో వచ్చిన వారందర్నీ 24 గంటల పాటు హాస్పటల్ లో ఉంచి, నిరంతర పరిశీలన (అబ్జర్వేషన్) లో ఉంచుతాం. ఆ సమయంలో నోటి ద్వారా ఆహారం ఇవ్వం. అలాగే ఈ యువకునికి గూడ టెట్వాక్ ఇంజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టి ‘పరిశీలన’ లో ఉంచాం.
ఆదేరోజు సాయంత్రం 6 గంటలకు వేరే గ్రామం నుండి ఇంకొకాయన కూడా తనను కరిచిన పామును చంపి తీసుకొచ్చాడు. అదీ రక్త పింజరే. ఇతడిని కూడ అబ్జర్వేషలో ఉంచాం. మరొక రెండు గంటల్లోనే ఇతడు పెద్ద నెత్తురు వాంతి చేసుకొన్నాడు. పింజర విష ప్రభావం అది. చిగుళ్ళ నుండి, నోటి నుండి, మూత్రనాళం నుండి, ఆసనం నుండి, సెలైన్ పెట్టిన రంధ్రం నుండి, పాము కరచిన గాట్ల నుండి... ఎక్కడ నుండైనా ఈ రక్త స్రావం జరగొచ్చు. ఇతనికి జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి, నోటి ద్వారా పెద్ద రక్తపు వాంతి అయింది. అప్పుడిక వరుసగా పది Anti snake venom ఇంజక్షన్లు చేశాం. అర్థరాత్రి దాటాక నెమ్మదిగా కోలుకున్నాడు.
ఈ వ్యక్తి కి దుష్ప్రభావం కనిపించిన కొద్ది సేపటికే విరుగుడు మందు ఇవ్వడం వల్లనే బ్రతికాడు. నాటు వైద్యంతో గానీ, మంత్ర వైద్యంతో గానీ బ్రతికే అవకాశం లేనేలేదు.
ఇక మొదటి వ్యక్తి సంగతి. మర్నాడు ఉదయం గంటల వరకు పరిశీలనతో ఉంచినా, ఎలాంటి విష లక్షణాలూ కనిపించలేదు. ఐతే అతడిని కరిచిందీ రక్త పింజరే. అందులో సందేహమే లేదు. అతని వంటిపై పాముగాట్లూ, అతడే స్వయంగా చంపి తెచ్చిన రక్త పింజర అందుకు తిరుగులేని సాక్ష్యాలు. మరి నేను మందు వేయకుండానే అతడెలా బ్రతికాడు? అతడిని ఆ పాము కరిచిందేగాని, విషం ఎక్కించలేదు. ఇతనికి నాటు వైద్యం చేసినా, నోరులేని మూగవాడు మంత్రం చదివినా,
చారెడు దుమ్మో, నీళ్లో పైన చల్లి అదే వైద్యమన్నా కూడ ఇలాగే బ్రతికేవాడు!
24 గంటల పరిశీలన తర్వాత ఇతడిని ఇంటికి పంపించేశాం.
ఉత్తుత్తి పాము కాటులు (Dry Bites) :
విష సర్పాల కాటులలో సుమారు 30 నుండి 50 శాతం విషం ఎక్కని, ఉత్తుత్తి కాటులే ఉంటాయి. అనేక కారణాల వల్ల విష సర్పాలు కరిచిన ప్రతిసారీ తగిన మోతాదులో విషం ఎక్కదు .
వీటినే "డ్రై బైట్స్" అంటారు.
ఈ ఉత్తుత్తి కాటులే నాటు వైద్యులకు, మంత్రగాళ్లకు గుర్తింపును, కీర్తిని తెచ్చి పెట్టేవి!
*సరైన మోతాదులో పాము విషం శరీరంలోకి ఎక్కితే Anti snake venom తో తప్ప ఈ ప్రపంచంలో మరే వైద్యం వల్లనైనా ఎవరైనా బ్రతికిన దాఖలా ఇంతవరకూ లేదు.
మరిన్ని విశేషాలు రేపు ...