పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? (4 వ భాగం) ....           (29-Sep-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా?
(4 వ భాగం)
(పాము కాటు మరణాలను తగ్గించడానికి రాస్తున్న వ్యాసాలు )
రామసుబ్బయ్య ఉదంతం :
నిత్యం మందహాసంతో కనిపించే మంచి మనిషి రామ సుబ్బయ్య. 16 ఏళ్లుగా నేను వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ ని.
ఓ ఆదివారం ఉదయం వాంతులై నీరసించిపోతే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికి 32 గంటల క్రితం ఆయన్ను పాము కరిచిందట! “సార్! పాముకాటుకు వైద్యమంతా మేం చేయించాం. వాంతులు తగ్గేందుకు ఒక ఇంజక్షను చేసి, నీరసం తగ్గేందుకు సెలైన్ పెట్టండి...” అని వారి బంధువులు నన్నడిగారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండ, అన్ని పరీక్షలూ చేసి చూస్తే- ఆయన రీనల్ ఫెయిల్యూర్(మూత్ర పిండ వైఫల్యం)లో ఉన్నాడు. ఆయన్ని కరిచింది ‘రక్త పింజర’ అయి ఉండాలి. మూత్రపిండాల్ని పాడు చేసి, రక్తం గడ్డ కట్టనీయని లక్షణం ఆ పాము విషానికే ఉంటుంది మరి.
అర్జెంటుగా నెఫ్రాలజిస్టు (మూత్రపిండాల స్పెషలిస్టు) దగ్గరకు తీసుకెళ్లమని చెప్పాను. ఓ ప్రక్క రోగి పరిస్థితి క్షణ క్షణానికి విషమిస్తూంటే- రోగికి వైద్యం చేసిన నాటు వైద్యునితో పాటు, వచ్చిన బంధువులంతా-“అవసరం లేదు సార్! రామసుబ్బయ్య భార్యకు గత సంవత్సరం పాము కరిస్తే ఇతడే వైద్యం చేశాడు. ఇదిగో ఆమె నిక్షేపంగా ఉంది చూశారా? మా ఊళ్ళో ఎంతమందిని ఈయన బ్రతికించాడో తెలుసా? రామసుబ్బయ్యకు కూడా ఈయన చేయవలసిన వైద్యం పూర్తిగా చేశాడు. మీరిప్పుడతనికి నీరసం తగ్గేందుకు సెలైన్ పెట్టండి చాలు” అని నాకే భరోసా ఇచ్చారు.
ఐనా, పరిస్థితి గమనించిన నేను పట్టుబట్టి బలవంతాన విజయవాడలోని మూత్రపిండాల స్పెషలిస్టు దగ్గరకు పంపాను. అతనికి మూత్రపిండాల వైఫల్యంతో పాటు మెదడులో రక్త స్రావం కూడా జరిగింది. ఆ ఆసుపత్రిలో అత్యుత్తమైన వైద్యమే జరిగింది. కాని, అప్పటికే ఆలస్యమవ్వడం వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా అతణ్ని వారం రోజులు కంటే బ్రతికించలేకపోయారు.
* ఆలస్యంగా డాక్టరు దగ్గరకు వస్తే ఎంత మంచి వైద్యంతోనైనా ప్రయోజనం ఉండదు.
తిరువూరు డాక్టరు అనుభవం :
తిరువూరులోని నా మిత్రుడు ‘డాక్టర్ రవీంద్ర’ వద్దకు ఒక రోజు రాత్రి 11 గంటల సమయంలో ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. “ఉదయం 8 గంటలకు పాము కరిచింది. మేం పొద్దున్నే వైద్యమంతా చేయించాం. సాయంత్రం నుంచి వాంతులై నీరసంగా ఉన్నాడు. నీరసానికి మందు వాడండి” అని అడిగారట. అర్జంటుగా ‘Anti Snake Venom' చెయ్యాలని డాక్టర్ రవీంద్ర ఎంత చెప్పినా వాళ్ల తలకెక్కలేదు. బంధువులంతా సెలైన్ పెడితే చాలని ఏక గ్రీవంగా పట్టుపట్టారు.
“నేను చెప్పింది నచ్చకపోతే మరొక డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఒక్క నిముషం ఆలస్యం కూడా ప్రమాదమే” అని డా. రవీంద్ర ఎంత మొత్తుకున్నా వినకుండా రోగిని ఇంటికి తీసుకుపోయారు. కనీసం మరో డాక్టర్ సలహా కూడా తీసుకోలేదు! తెల్లవారుజామున 4 గంటలకు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వేరే డాక్టర్ వద్దకు తీసుకుపోతే, ఆయన Anti snake venom 10 Doses చేసి, వెంటనే హైదరాబాదు పంపాడు. అక్కడ ఎంతో ఖర్చు పెట్టి వైద్యం చేయించారు గానీ మనిషి దక్కలేదు.
* తగిన సమయంలో Anti Snake Venom ఇవ్వకపోవడమే ఇక్కడ జరిగిన లోపం.
మరో రెండు అనుభవాలు:
ఇటీవల ఒకరోజు సాయంత్రం జగన్మోహనరావు అనే 40 సంవత్సరాల వ్యక్తిని రక్త పింజర కరిస్తే తీసుకువచ్చారు. 30 మంది బంధు మిత్రులు ఆసుపత్రి హాలులో భయాందోళనలు చెందుతూ, మా సిబ్బందిని కంగారు పెడుతున్నారు. అటు చూస్తే రోగి పరిస్థితి విషమిస్తూంది. ఎవరినీ గుర్తు పట్టడం లేదు. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ మహా చిరాకుగా, అశాంతి(irritable)గా ఉన్నాడు.
ఒక వంక రోగి బంధువుల్ని శాంతింపజేస్తూ, మరొక వంక రోగి కాళ్లు, చేతుల్ని గట్టిగా అదిమి పట్టుకొని బి.పి. చూసి, ఒక చేతికి సెలైన్ పెట్టి, వెంటనే 10 డోసులు Anti Snake Venom ఇచ్చాం. ఏ మార్పు కనిపించక పోగా మరో 10 డోసులు కూడా చేశాం. కొంచెం ఫరవా లేదనుకుంటుండగానే ఐదు నిమిషాలలోనే పెద్ద వాంతి అయ్యింది. అప్పుడు మళ్లీ 10 ఇంజక్షన్లు చేశాం. అప్పటికి రోగ ప్రకోపం కొంత తగ్గింది. ఆ తరువాత మమ్మల్ని, బంధువులని గుర్తు పట్టగలిగాడు.
ఈ వైద్యమంతా గమనించిన నా డాక్టర్ మిత్రుడు “ఒకేసారి ఇంత తక్కువ వ్యవధిలో 30 ఇంజక్షన్లు ఇవ్వడమా? డోసులు ఎక్కువైపోయి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది కదా? దానికి బదులు సెలైన్ లోనే ఏ.ఎస్.వి. ని కలిపి రోగికి ఎక్కిస్తే సరిపోదా...” అని సందేహం వ్యక్తపరిచాడు.
రోగి రక్తంలోని 'విషం మోతాదును' కొలిచే పరికరాలు ఇప్పటికింకా మన దేశంలో లేవు. రక్తంతో పాటు శరీర భాగాలన్నిటికి ప్రసరిస్తున్న పాము విషాన్ని విరిచి, తటస్థీకరించాలంటే ఎన్ని ఇంజక్షన్లు ఇవ్వాలో రోగి లక్షణాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయించాల్సిందే. సాధారణంగా రక్త పింజర విషానికి 5 నుండి 35 వరకు అవసరమవ్వడం నా అనుభవంలో గ్రహించాను. రోగి సాధారణ స్థితి(General condition )నిలకడగా ఉంటే తొలుత 10 ఇంజక్షన్లు ఇచ్చి పరిశీలనలో వుంచుతాం.
ప్రారంభంలోనే రోగికి 'విష లక్షణాలు తీవ్రంగా వుండి 'కొనసాగుతుంటే 30 - 35 వరకు డోసులివ్వక తప్పదు. అంతే గాని సెలైన్ లో కలిపి Anti Snake Venom ని నెమ్మదిగా ఎక్కించడం సరికాదు, సరాసరి సిర(Intra Venous)లోనికి ఎక్కించడమే మెరుగైన చికిత్స. (నేషనల్ ప్రోటోకాల్-2009 కి నేను పాటించే ఈ ఒక్క పద్ధతే భిన్నం)
మరో రెండు రోజులలోనే రాఘవమ్మ అనే స్త్రీని 'రక్త పింజర 'కరిస్తే హడావుడిగా ఆసుపత్రికి తెచ్చారు. వచ్చీ రాగానే ఆమెకు కళ్లు తిరిగినట్లై పడిపోయింది. రక్తపోటు 40 మాత్రమే ఉంది. తక్షణమే సెలైన్ పెట్టి బి.పి. 100 దాటగానే వరుసగా 20 డోసులు Anti Snake Venom ఇచ్చాం. కేవలం అరగంటలోనే ఆమె చక్కగా మాట్లాడింది. రెండు రోజులు పరిశీలనలో వుంచి ఇంటికి పంపించాం.
- తరువాయి భాగం రేపు