పాము కాటుకు నాటు వైద్యమా ? నేటి వైద్యమా ? 3 వ భాగం....           (28-Sep-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా ?

నేటి వైద్యమా ?
3 వ భాగం
మృత్యుంజయుడు – రామకృష్ణ
చల్లపల్లి ప్రక్కనే ఉన్న 'చిట్టూర్పు' గ్రామంలోని ప్రభాకరరావు మాస్టారి వద్ద చదువుకుంటున్న 12 ఏళ్ల రామకృష్ణకు తెల్లవారుజాము 3 గంటలకు మూత్ర విసర్జనకు బైటకు వచ్చినప్పుడేదో కుట్టినట్లనిపించింది. మాస్టార్ని లేపి, ఆ విషయాన్ని చెప్తే, అది పాము కాటే కావచ్చని ఊహించి, మోటర్ సైకిల్ పైన 3-30 కి మా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరొక్క పావుగంటలోనే అతని శ్వాస ఆగిపోయింది. చకచకా ఊపిరితిత్తుల్లోకి గొట్టం వేసి కృత్రిమ శ్వాస కల్పించి, ఏ.ఎస్.వి. ఇంజెక్షన్లు 10 యిచ్చాం. రెండు రోజుల పాటు మేం వంతుల ప్రకారం ఒకరి తర్వాత ఒకరం యాంబూ బ్యాగ్ ను వత్తుతూనే ఉన్నాం. అప్పటికి గాని, అతను సహజ శ్వాసలోకి రాలేదు. అతనికిచ్చిన మొత్తం ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు 30! ఇప్పుడు అతను చదుకుని, డప్పు బృందంలో ముఖ్యుడై జీవితంలో స్థిరపడ్డారు.
పాము కరిచిన గంట తర్వాతే విషంతో మరణం సంభవిస్తుందనీ, గంటలోపే చనిపోతే అది భయం వలన వచ్చిన షాక్ తో మాత్రమేననీ, కొందరు భావించడం తప్పని యిప్పుడు తేలింది.
రామకృష్ణను పాము కరిచిన 45 నిముషాలలోపే శ్వాస ఆగిపోయింది. మరొక్క 5 నిముషాలు గడిస్తే కృత్రిమ శ్వాసకు గూడ కాలాతీతమై, అతడు దక్కేవాడు కాదు. సరాసరి రక్తనాళాల లోనికి పాము విషం ఎక్కితే బహుశా 15 నిమిషాలకే రోగి చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
అందుకే – పాము కాటు రోగికి డాక్టర్ వైద్యం ఎంత ముఖ్యమో, సకాలంలో ఆస్పత్రిలో చేర్చడం కూడా అంతే ముఖ్యం.
ఒక మహారాష్ట్ర మత్తు వైద్యుడు రూపొందించిన చిన్న వెంటిలేటర్ ను ఆరేళ్ళ క్రిందట మా ఆసుపత్రి కోసం కొన్నాం. అప్పటి నుండి కట్లపాము, త్రాచుపాము కాట్లతో వచ్చిన రోగులకు కృత్రిమ శ్వాస అందించాలంటే ఈ పరికరాన్ని వాడుతున్నాం.
మెదడు స్తంభించిన మరణమేనా?
(Is it Brain Death?)
ఒకనాటి ఉదయం 3.30 గంటల సమయానికి ఎనిమిదేళ్ళ శ్రీలతను కట్లపాము కరిస్తే చంపిన పాముతో సహా ఆ పామును తీసుకువచ్చారు. కొద్ది నిముషాలు నాతో బాగా మాట్లాడింది. “నాకు ఇంజక్షన్ లు చేయవద్దు” అని బ్రతిమాలింది. కాని, కాసేపటికీ మాట్లాడటం ఆగిపోయి నిశ్శబ్దంగా పడుకున్నది. కాళ్ళూ, చేతులూ కొట్టుకోవడం మొదలైంది. నాడి నమోదు యంత్రం (Pulse Oxymeter) లో ఆక్సిజన్ శాతం తగ్గుతూ వచ్చింది. సాధారణ స్ధాయి 100 కాగా, 90 వద్దకు పడిపోగానే, ఊపిరితిత్తుల లోనికి గొట్టం వేసి, యాంబు బ్యాగ్ తో కృత్రిమ శ్వాస ఏర్పాటు చేశాం.
శ్రీలత తల్లిదండ్రుల ఇంటెన్సివ్ కేర్ ఖర్చు భరించగలరు. పాపను సమీప నగరానికి త్తరలించి ICUలో వెంటిలెటర్ తో కృత్రిమ శ్వాస ఏర్పాటు మంచిదని సలహాయిచ్చాను. దాన్ని వారు తక్షణమే అంగీకరించారు. వెంటనే ఫోన్ చేసి, కృత్రిమ శ్వాస యంత్రం (వెంటిలేటర్) తో సహా అంబు లెన్స్ నూ, ఇంటెన్సివ్ కేర్ నిపుణుడినీ రప్పించాం. ఆ స్పెషలిస్ట్ శ్రీలతను పరీక్షించి, గుండైతే పనిచేస్తున్నది గాని, మెదడు స్తంభించిందనీ, ‘ఇది బ్రెయిన్ డెత్ కేసు’ అని అభిప్రాయపడ్డాడు..
అది బ్రెయిన్ డెడ్ కేసు కాదనీ, 3 రోజుల పాటు వెంటిలేటర్ తో కృత్రిమ శ్వాస యిస్తూ, వైద్యం చేస్తే రోగి చక్కగా కోలుకుంటుందనీ, ఇటువంటి మా ఏడెనిమిది పాము కాటు కేసుల అనుభవాన్ని ఆ డాక్టర్ కు వివరించాను.
“కంటిపాప పూర్తిగా వ్యాకోచించింది. కనీస స్పందన కూడా లేదు. ఈ పరిస్థితిలో, ఇంత అధిక వ్యయంతో పేషెంట్ ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించినా ప్రయోజనం ఉండదు” అని ఆ స్పెషలిస్టు, ఆయనపై అధికారి చాల మర్యాదగా నా ప్రతిపాదనను తిరస్కరించారు. అంబులెన్స్ తో సహా ఆ స్పెషలిస్టు తిరిగి వెళ్లారు.
ఆ తరువాత కధ మామూలే! ఒకరి తర్వాత ఒకరం,నేనూ, మా సిబ్బందీ రెండు రోజుల పాటు నిర్విరామంగా యాంబు బ్యాగ్ తో శ్రీలతకు కృత్రిమ శ్వాస కల్పిస్తూనే ఉన్నాం. సుదీర్ఘ వైద్యం తర్వాత ముందుగా ఆమె కనురెప్పలతో చిన్న కదలిక! ఆ పిదప ఆమె కాలివేళ్ళ కొనలలో మరికొన్ని స్వల్ప చలనాలు. అప్పడిక నెమ్మదిగా కళ్ళు విచ్చుకొన్నాయి. మా మాటలకామెలో ప్రతి స్పందనలు మొదలయినవి. నెమ్మదిగా తానే శ్వాస పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మరో ఐదారు గంటల పాటు కృత్రిమ శ్వాస కొనసాగించిన తర్వాత శ్వాస గొట్టాన్ని ఊపిరితిత్తుల నుండి తీసేశాం. తర్వాత రోజు తానే లేచి కూర్చున్నది. తర్వాత మంచందిగి నడవ గల్గింది. ఆ మరుసటి రోజే ఆసుపత్రి నుండి ఆమెను డిశ్చార్జి చేశాం.
త్రాచు, కట్ల పాములు కరిచిన కేసులలో కనుపాపల ప్రతి స్పందనలతో నిమిత్తం లేదని యీ కేసుతో మా కర్ధమయింది.
పాము కాటు వైద్యంలో మాకిదొక వినూత్న, ఉత్కంఠ భరితమైన అనుభవం!
మరిన్ని విశేషాలు రేపు ....