పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? – 2....           (27-Sep-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా? – 2
ఆయాచిత వరం... రోటరీ పధకం...
ఇది జరిగిన కొన్నేళ్లకు కె.సి.పి. షుగర్ ఫాక్టరీ మెడికల్ ఆఫీసరైన డాక్టర్ నారాయణరావు గారు మాకు ఫోన్ చేసి “పాము కాటు, కుక్క కాటులకు మందుల్ని రోటరీ క్లబ్ తరపున ఒక సంవత్సరం పాటు ఉచితంగా యివ్వదలచు కొన్నాం. కుక్క కాటు మందును మా కె.సి.పి. క్లినిక్ లో యిస్తాం, పాము కాటు మందును మీ ఆసుపత్రిలో ఇద్దురు” గాని అని చెప్పారు.
‘పాముకాటు రోగులు అర్హులైన డాక్టర్ దగ్గరకు రారు’ అనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న నేను పై సూచనను వెనువెంటనే అంగీకరించలేకపోయాను. ఐనా ఆ డాక్టర్ గారి మీద నాకున్న గౌరవం వల్ల, ఆయనలోని సేవాదీక్షను గమనించీ, ఒప్పుకొన్నాను.
తరువాత కొద్ది రోజులకు రోటరీ తరపున అప్పటి కె.సి.పి. మేనేజర్ ‘ఆంజనేయులు ‘గారు లాంఛనంగా ఈ ‘ఉచిత ఏ.ఎస్.వి. ‘పధకాన్ని ప్రారంభించిన రోజుకు గూడా పాముకాటు రోగులు నాటు వైద్యుల దగ్గరకూ, మంత్రగాళ్ల వద్దకు తప్ప మా ఆసుపత్రికి వస్తారనే నమ్మకం నాకైతే లేదు.
కాని, అనూహ్యంగా పాము కాటు కేసులు మా దగ్గరకు రావడం మొదలయింది. అందుకు కారణమిది –
చెరుకు పొలాల్లో ‘రక్త పింజెర’ లుంటాయి. వ్యవసాయ కూలీలు చెరుకు నరికే సమయంలో అవి వారిని కరవడం పరిపాటి. షుగర్ ఫాక్టరీకి చెందిన ‘ఫీల్డ్ మాన్ ‘ప్రతి ఊళ్ళో ఉంటాడు.
వారి ద్వారా “విషపు పాముల కాటుకు మందులను రోటరీ తరపున చల్లపల్లిలోని ఫలనా ఆసుపత్రిలో ఉంచాం. ఇంజెక్షన్లు ఉచితం. వెళ్ళండి”
అని ముందుగా ఊరూరా చెప్పించారు. ఆ విధంగా రోగులు రావడం మొదలుపెట్టారు.
కేసులు వచ్చేటప్పటికి నాకు ఆసక్తియితే బాగా పెరిగింది గాని, వైద్యం మొదలయ్యాక సవాలక్ష సందేహాలు! ప్రతి జబ్బు వైద్యానికీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఉదాహరణకు గుండెనొప్పి రోగికి వైద్యంలో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్... ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఏమి చేయాలో నిర్దిష్టమైన విధివిధానం ఉన్నది. కానీ, పాము కాటుకు అలాంటి ప్రోటోకాల్ ‘అప్పట్లో’ మా పాఠ్య గ్రంధాల్లో ఎక్కడా వివరంగా లేదు.
మెడికల్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళినప్పుడల్లా నాకు తెలిసిన, తెలియకపోయినా తారసపడిన వైద్యులందరి పాము కాటు వైద్యాన్ని గూర్చి పదే పదే చర్చలు జరిపినా సంతృప్తికర సమాధానాలు దొరకటానికెక్కువ కాలమే పట్టింది.
అంతిమంగా మద్రాసులోని ఓ కాన్ఫరెన్స్ లో కేరళ గ్రామీణ ప్రాంతాన పదేళ్ళకు పైగా వైద్య వృత్తి నిర్వహిస్తూ, అత్యధికంగా పాముకాటు కేసుల్ని విజయవంతంగా నిర్వహించిన ఒక డాక్టరు గారు ఈ ప్రత్యేక విషయం మీద ఇచ్చిన ఉపన్యాసంతో నా బుర్రలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఆ కాన్ఫరెన్స్ ముగిశాక గూడ అరగంటసేపా డాక్టర్ ను ప్రశ్నలతో వేధించి, సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గాని, ఈ వైద్యంలో నాకు పూర్తి ఆత్మవిశ్వాసం కలుగలేదు.
చెన్నై రామచంద్రా మెడికల్ కాలేజి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఈ వైద్యాన్ని సన్నిహితంగా పరిశీలించాను.
కేరళలోని “తిరువళ్ల” ఆసుపత్రి వారి “15 ఏళ్ల పాము కాటు వైద్యం – 1500 కేసులు” గ్రంధం చదివాక నా అవగాహన మరింత విస్తృతమైంది.
రాజేశ్వరి ఉదంతం
1993 లో మద్రాసు కాన్ఫరెన్స్ కు వెళ్ళే నెల రోజుల ముందే ఒకరోజు రాత్రి 11-30 కు నేను నిద్రకు ఉపక్రమిస్తుండగా పాముకాటు రోగి వచ్చిందని కాంపౌండరు ఫోన్ చేశాడు. ఐదే నిముషాల్లో రోగి వద్ద హాజరయ్యాను. 6 నెలల గర్భవతియైన ఆ పేషెంట్ పేరు రాజేశ్వరి. (ఇక్కడా, ఇకముందూ వచ్చే కొన్ని పేర్లు మార్చబడినవి) పాము కరిచిన 3 ½ గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
వాళ్ళ ప్రక్క ఊరి నాటు వైద్యుడామె 'కంట్లో కలికం, నోట్లో పసరు' దట్టించాడు. గంట గడిచాక వాంతులు మొదలైనపుడు – రాత్రి 10 గంటల వేళ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని పంపేశాడు. రిక్షాలో 4 కిలోమీటర్ల దూరం నుండి మా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
కలికం వల్లనో, విష ప్రభావంతోనో గాని కళ్ళు తెరవలేకపోతున్నది. మా ఈ సందిగ్ధం తీరక ముందే వాంతి చేసుకున్నది. వాంతులు విషం వల్లనా, పసరు వల్లనా అని తేల్చుకోలేక పోతుండగానే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఊపిరితిత్తుల్లోకి కృత్రిమ శ్వాస గొట్టం (ఎండో ట్రేఖియల్ ట్యూబ్) పంపి, కృత్రిమ శ్వాస కల్పించాం. నాడి, రక్తపోటు తగినంతగా ఉన్నాయి. నా దగ్గర ఉన్న 3 కాక, చల్లపల్లిలో దొరికిన 4 తో గలిపి మొత్తం 7 ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు యిచ్చాం. ఇంకా ఎన్ని యివ్వాలో తెలియలేదు. ఐనా సరే, మరిన్ని ఏ.ఎస్.వి.ల కోసం సమీప పట్టణమైన బందరు పంపాను.
'యాంబు బ్యాగ్' తో ఒక కాంపౌండర్ కృత్రిమ శ్వాస యిస్తూనే ఉన్నాడు. వెంటిలేటర్ మిషన్ మా దగ్గర లేదు. విజయవాడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లలో ఉంటుంది గాని ఆ ఖర్చు భరించే స్తోమత రోగికి లేదు. అందుచేత అలా నాలుగు గంటల పాటు చేతితో ఆ బ్యాగ్ ను వంతుల వారీగా వత్తుతూనే ఉన్నాం. ఇంకెన్ని గంటలలా కృత్రిమ శ్వాస యివ్వగలమో తెలియదు. వేకువ 3-30 దాటినా బందరు నుండి ఏ.ఎస్.వి.లు రాలేదు. ఆశ నిరాశల అయోమయం! అప్పుడు రోగి కనురెప్పలు కొద్దిగా కదలడం గమనించాను. రాజేశ్వరీ...రాజేశ్వరీ... అని పిలవగా కళ్లు తెరిచింది. ఆమెలో వచ్చిన ఈ మంచి మార్పును చూసి ధైర్యం కలిగి, పట్టరాని సంతోషం కలిగింది.
తెల్లవారే సమయానికామె తనంతట తానే ఊపిరి పీల్చోకోవటం మొదలుపెట్టింది. గొంతులోని ‘శ్వాస గొట్టం’ తీసేశాం. మరి కాసేపట్లో మాట్లాడటం మొదలుపెట్టింది. రాత్రంతా నిద్ర లేక శ్రమించిన మా 8 మంది సంతోషం వర్ణనాతీతం.
ఆ విధంగా మృత్యువును జయించిన రాజేశ్వరి కాలు వాచి ఇన్ఫెక్షన్ రావడంతో గాయం మానడానికి నెల పట్టింది. మరో రెండు నెలల తర్వాత ఆమె చక్కటి బిడ్డను కన్నది.
ఇక, యీ కేసు అనుభవం నుండి నేను గ్రహించిన గుణ పాఠాలివి:
1. 'కళ్ళలో కలికం, నోట్లో పసరు 'పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, విష ప్రభావాన్ని అంచనా కట్టడంలో ఆలస్యం జరిగి, రోగికి నష్టం వాటిల్లుతుంది.
2. పాము కరిచిన రోగిని సాధ్యమైనంత తొందరగా 'ఎం.బి.బి యస్ .డాక్టర్ 'వద్దకు మాత్రమే తీసుకెళ్లి అడ్మిట్ చేయాలి. మరికొన్ని నిముషాలు ఆలస్యమైనా పై రోగిని మేము కాపాడగలిగే వాళ్ళం కాదు
3. లక్షల విలువైన వెంటిలేటర్ లేకున్నా, కేవలం 2000/- ఖరీదైన యాంబు బ్యాగ్ తో కృత్రిమ శ్వాసనిస్తూ గూడ ప్రాణం నిలబెట్టవచ్చు.
కాలమే ప్రాణప్రదాయిని (Time saves life)
చల్లపల్లికి 26 కి.మీ. దూరంలో ఉన్న కోడూరుకు చెందిన ఒక కుర్రవాడిని పాము కరవగా, సుమారు 4 గంటల తర్వాత మా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు –
సాంప్రదాయ నాటు వైద్యాలన్నీ చేసి చూసిన తర్వాత! చల్లపల్లికి 2 కి.మీ. దూరంలో ఉండగానే చనిపోగా, మృత దేహాన్ని మాత్రం నాకు తెచ్చి చూపారు.
ఇతర వైద్యాల కోసం సమయం వృధా చేయక, మరో అరగంట ముందుగా వచ్చి ఉంటే – యీ బాలుడు కూడా రాజేశ్వరిలాగా బ్రతికేవాడేమో!
తరువాయి భాగం రేపు...
కార్టూనులు వేసిన
'అభ్యాస విద్యాలయం''నిర్వహిస్తున్న మితృడు 'కృష్ణ ' కు ధన్యవాదాలు 🙏

కృష్ణ