పాము కాటుకు నాటు వైద్యమా? నేటి వైద్యమా? - 1....           (26-Sep-2020)


 పాము కాటుకు నాటు వైద్యమా?

నేటి వైద్యమా? - 1
నేను గుంటూర్లో ఎం.బి.బి.ఎస్. చదివే రోజుల్లో (1974 – 80) కృష్ణాజిల్లా – పెదమద్దాలిలో మా తాతగారి దగ్గర పనిచేసే ‘పైడియ్య’ ని త్రాచుపాము కరిచింది. వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న పామర్రు పట్టణంలోని పాము కాటు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లారు. అతడు ఏదో మందు వేసి నీకేమీ ఫర్వాలేదని ధైర్యం చెప్పాడు! కాని ఒక గంట అయినా గడవకుండానే పైడియ్య పరిస్ధితి విషమించగా, “ఎం.బి.బి.ఎస్ డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళండి” అని చెప్పి ఆ నాటు వైద్యుడూ చేతులు దులిపేసుకున్నాడు. డాక్టరు దగ్గరకు వెళ్ళినా కొద్ది సేపటికే పైడియ్య మరణించాడు. అప్పటికీ ఇప్పటికీ మా కుటుంబానికి అదొక బాధాకరమైన జ్ఞాపకం.
నేను చల్లపల్లి లో ఆసుపత్రి పెట్టిన మొదటి రోజు నుండి (జనవరి 1, 1988) యాంటీ స్నేక్ వీనమ్ మూడు డోసులు అట్టి పెట్టుకున్నాను. అప్పట్లో ఈ మందు మార్కెట్లో అంతగా దొరికేది కాదు. బ్లాక్ మార్కెట్లో కొనవలసిన పరిస్థితి! విషపు పాము కరిచిన మనిషికి ఆ మూడు డోసులు ఏ మూలకీ చాలదని గ్రహించటానికి చాలా కాలం పట్టింది.
ఆ రోజుల్లో పాము కాటు కేసులు నాటు వైద్యులు దగ్గరకు, మంత్రగాళ్ల దగ్గరకు తప్ప ఎం.బి.బి.ఎస్. డాక్టర్ల దగ్గరకు వచ్చేవి కావు. పాము కరిచిన ఒక మహిళ తొలి కేసుగా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎందరో సీనియర్ డాక్టర్లకు, నా డాక్టరు మిత్రులకు ఫోన్ చేసి, “రోగిలో ఏ లక్షణాలు మొదలైనపుడు యాంటి స్నేక్ వీనమ్ చేయాలి?
ఎన్ని డోసులు ఇవ్వాలి?
ఎంత సమయం పరిశీలిస్తూ వుండాలి? ఎప్పుడు రోగిని డిశ్చార్జ్ చేయవచ్చు?...”
ఇలాంటి ఒక వంద ప్రశ్నలడిగాను.
నేను హౌస్ సర్జన్ చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాని, రెండు సంవత్సరాలు పనిచేసిన ఒంగోలు ఆసుపత్రిలో గాని పాముకాటు కేసు ఒక్కటైనా రాలేదు. పాము విషానికి యాంటి స్నేక్ వీనమ్ ఇవ్వాలని తెలుసుగాని వాస్తవంగా రంగంలోకి దిగినపుడు పై సందేహాలకు సమాధానాలే దొరక లేదు.

లైటనింగ్ కాల్

ఎక్కడో సుదూరంగా వున్న హనుమాన్ జంక్షన్ లోని పెద్ద మంత్రగాడు ఫోను ద్వారా మంత్రం వేస్తే ఏ పాము కరిచినా వాడైనా బ్రతుకుతాడని చల్లపల్లి పరిసర జనాల ప్రగాఢ విశ్వాసం. పాము కరిచినపుడు జంక్షన్ మంత్రగాడికి ఫోన్ చేయవలసి వస్తే ఎస్. డి. టి. సౌకర్యం లేని ఆ రోజుల్లో టెలిఫోన్ ఎక్సేంజ్ వాళ్ళు మానవతా దృక్పధంతో ‘లైటనింగ్ కాల్’ ఇచ్చేవారు! కొంతమంది బ్రతికి బట్టకట్టేవారు. మరికొంతమంది చనిపోయేవారు. మంత్రం అద్భుతంగా పనిచేసి రోగులు బ్రతికారని ప్రజలలో ప్రచారం జరిగేది. మృతి చెందిని వారి విషయంలో వాళ్ళకు కాలం తీరిందని, విధిరాతనీ, లేక మరొక కారణమనీ జనం సానుభూతి పూర్వకంగా సర్ది చెప్పుకునేవారు.

అనివార్య మరణమా?
ఒక సాయంత్రం ఓ.పి. లో ఉండగా ఒక ప్రముఖ వ్యక్తి నా దగ్గరకు హడావిడిగా వచ్చి “డాక్టరు గారూ! మా ఊళ్ళో ఫలానా వ్యక్తిని పాము కరిచింది. దయచేసి, ఉన్నఫళాన నాతో బయల్దేరి రండి...” అని కంగారు పెట్టారు.
ఒక్క నిమిషం పాటు నేనాయన కంగారును తగ్గించి ‘రోగికి ఏ.ఎస్.వి. (యాంటీ స్నేక్ వీనమ్) ఆస్పత్రిలో మాత్రమే యివ్వాలని, తక్షణమే రోగిని ఆసుపత్రికే తీసుకురమ్మనీ, అప్పటికి నేను సర్వసన్నద్ధంగా ఉంటాననీ” చెప్పి పంపాను.
సుమారు గంట తర్వాత లారీలో తీసుకు వచ్చారు – పాము కరిచిన వ్యక్తిని కాదు, అతని మృతదేహాన్ని! ఓపికగా విచారిస్తే తేలిందేమంటే – అతణ్ణి పొలంలో పాము కరిచి 2 ½ నుండి 3 గంటలు గడిచింది. పొరుగూరి నాటు వైద్యుని దగ్గర పసరు వైద్యం చేయించి, పరిస్థితి విషమించాకే నన్ను సంప్రదించారు. దశాబ్దాల తరబడి ప్రపంచమంతా అమలు జరుగుతున్న, సమీపంలోనే ఉన్న అసలైన శాస్త్రీయ వైద్యాన్ని చేరుకోకముందే ఒక నిండు ప్రాణానికి పుణ్యకాలం ముగిసిపోయింది. చావుకీ, బ్రతుక్కీ సంధి కాలమైన ఆ అరగంట ముందే ఏ.ఎస్.వి. ఇంజక్షన్ యివ్వలేకపోతినే అనే వేదన మాత్రం మిగిలింది.
నిస్సందేహంగా యిది నివార్యమరణమే. (Preventable Death)
1989 లో ఈ దుస్సంఘటన జరిగిన తక్షణం జనవిజ్ఞానవేదిక చల్లపల్లి శాఖ సమావేశమై, ఇక ముందిలాంటి మరణాల నివారణ కోసం “పాము కాటు నుండి రక్షించేది ఏ.ఎస్.వి. మాత్రమేనని, ఆశాస్త్రీయ, మంత్ర తంత్రాల, ఆకు పసరుల వైద్యం కానే కాదనే” వాస్తవాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించింది. 7000 కరపత్రాలు ప్రచురించి చల్లపల్లి, పరిసర ప్రాంతాలలో పంచిపెట్టాం. ఏ గ్రామంలోని ఏ వేడుకలకు, సమావేశాలకు వెళ్ళినా గ్రామ పెద్దలకు పదేపదే యీ విషయాన్ని చెప్పిచూశాం. ప్రతి గ్రామ పంచాయితీ కనీసం 2 ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు నిలువ చేసుకొని, విష సర్పం కరిచిన వ్యక్తికా రెండు డోసులూ యిచ్చి, ఆ వెంటనే సమీపంలో ఏ డాక్టర్ దగ్గరకైనా రోగిని తీసుకు పొమ్మని విన్నవించాం. ఐతే, దురదృష్టవశాత్తూ మా ప్రచారాలేవీ ప్రజల మీద చేయవలసినంతగా పనిచేయలేదు.
ఒక స్కూల్ వార్షికోత్సవ సభలో ఇదే విషయాన్ని సవివరంగా చెప్పి, వేదిక దిగానో లేదో – ఒకాయన నా చేయి పట్టుకొని ఆపి రెండో చేత్తో తనజుట్టు పట్టి చూపిస్తూ “పిచ్చి డాక్టరు గారూ! నా జీవితంలో ఇదిగో ఇంతమందికి నాటు వైద్యం చేశాను. ఒక్కడైనా చనిపోలేదు. వేలకొద్దీ డబ్బు ఖర్చయ్యే ఇంజక్షన్ల ఇంగ్లీషు వైద్యం వేస్టు. నాటు వైద్యమే బెస్టు...” అని ఎగతాళిగా నవ్వాడు. నేనూ నవ్వాను... నిస్సహాయంగా! అతను ఆవూరి నాటు వైద్యుడు.
అన్ని వ్యయప్రయాసాలతో అంతకాలం మేము చేసిన ప్రచారం ఏమైపోయినట్టు? మరి జనం మీద ఆ ప్రచార ప్రభావమే ఉంటే ఆసుపత్రులకు పాముకాటు కేసులు రావాలిగదా? నిరాశచెంది, మా ప్రచారాన్ని నిలిపేశాం.
తరువాయి భాగం రేపు...