మరువలేని నాయకుడు కామ్రేడ్ వెంకటపతి గారు....           (30-May-2021)


 గుర్తుకొస్తున్నాయి ... 51

"మరువలేని నాయకుడు కామ్రేడ్ వెంకటపతి గారు"
'ఢంకా మీద దెబ్బ కొట్టి
గెలుస్తాడు వెంకటపతి'
అంటూ జనం నినదిస్తున్నారు
...
1985- సత్తెనపల్లి
పుతుంబాక వెంకటపతి గారు CPIMతరపున MLA అభ్యర్థి. అంతకు రెండు సంవత్సరాల క్రితమే 1983లో MLA గా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు తెలుగుదేశం గాలిలో కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన నన్నపనేని రాజకుమారి గారి చేతిలో ఓడిపోయారు.
30 సంవత్సరాలకు పైగా నిస్వార్థమైన, సమర్థవంతమైన రాజకీయ జీవితంగల వెంకటపతి గారు ఓడిపోవడం కార్యకర్తలకు మింగుడుపడలేదు.
ఆ తరువాత NTR ను నాదెండ్ల దించివేసినపుడు కమ్యూనిష్టులు NTR ను బలపరిచారు. 1985 లో జరిగిన ఎలక్షన్లో రెండు పార్టీలకు సర్దుబాటు కుదిరింది. ఈసారి తెలుగుదేశం బలపరచిన అభ్యర్థిగా వెంకటపతి గారు బరిలో దిగారు.
ప్రచారం ఊపందుకొంది. ఈసారి ఏమైనా గెలిపించుకోవాలనే పట్టుదల కార్యకర్తలకే కాదు, ప్రజలకీ వచ్చేసింది. ఆయనంటే గౌరవమే అందరికీ . కానీ ఎలక్షన్లలో ఓటెయ్యాలంటే కేవలం వ్యక్తి యొక్క నీతి నిజాయితీలే కాదు జనం చూసేది. ఆ సమయంలో ఉన్న భావోద్వేగాలు ఓటు చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి కదా !
1983లో NTR గారి వేవ్ లో వెంకటపతి గారి లాంటి నిజాయితీపరుడు కూడా ఆ ప్రాంతంలో ఏమాత్రం పరిచయం లేని క్రొత్తగా ఎలక్షన్ల లో నిలబడిన వ్యక్తి చేతిలో ఓడిపోవలసి వచ్చింది.
ఈసారి ఎలక్షన్లో వెంకటపతి గార్ని గెలిపించాల్సిందే అని నిర్ణయించేసుకున్నారు జనం. అప్పుడు వచ్చిందే ఈ నినాదం .
'ఢంకా మీద దెబ్బ కొట్టి '
- అని ఒకళ్లు బొడ్డులోంచి మాటలు తెచ్చుకొని చెయ్యి ఎత్తి నినదిస్తే
ఉరుము ఉరిమినట్లుగా మిగిలిన అందరూ
'గెలుస్తాడు ఎంకటపతి’ అని అరిచేవారు.
పెద్ద మెజారిటీ తో వెంకటపతి గారు సత్తెనపల్లి MLA గా ఎన్నికయ్యారు.
ఈ రోజు వెంకటపతి గారి వర్ధంతి అని
‘శాంతి శ్రీ’ గారు ఫేస్ బుక్ లో రాసిన పోస్టు చదవగానే ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి.
...
గుంటూరు మెడికల్ కాలేజీ లో వైద్య విద్యార్థులు గా ఉన్నప్పుడు వారిని దగ్గరగా చూసే అదృష్టం కలిగింది.
నమ్మిన సిద్ధాంతాలను, విలువలను ఆచరించి చూపడం ద్వారా అనేకమంది కార్యకర్తలకు ఆదర్శంగా ఉండేవారు.
ఎప్పుడూ రాజీ పడేవారుకాదు.
చూస్తానికి గంభీరంగా,సీరియస్ గా ఉన్నట్లు ఉండేవారు. మాట్లాడటం మొదలుపెడితే నవ్వులే నవ్వులు. ఆయన నవ్వేవారు కాదు కానీ వినేవాళ్లకు భలే సరదాగా ఉండేది ఆయన మాటలు వినడం.
డా. బాబూరావు గారి పెళ్లికి మేము వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఏదో పని మీద వారిని కలవడానికి పార్టీ ఆఫీసుకు వెళ్లాం. వధూవరుల గురించి రాసిన పద్యాలు ఉన్న కాగితం మా చేతిలో ఉంది. పెళ్లిలో అందరకూ కోటేశ్వర రావు గారు(బాబురావు గారి నాన్నగారు) అవి పంచారు .
ఆ కాగితం తీసుకుని 'ఈ పద్యాలకు అర్థం తెలుసా 'అన్నారు. మాకు అవేమీ అర్థం కాలేదు. ఆయన వాటిని చదివి తెలుగు మాష్టారి లాగా మాకు అర్థం అయ్యేట్లు చెప్పిన తీరు మా అందరికీ ఆశ్చర్యం వేసింది. వారికి కవిత్వంతో అంత పరిచయం ఉన్నట్లు అప్పటి వరకు తెలీదు. ఆ తర్వాత ఎవరో చెప్పారు వారు 'భాషా ప్రవీణ' వంటి డిగ్రీ పూర్తి చేశారని. Hindu News Paperను క్రమం తప్పకుండా చదివేవారు.
మేము వారి పిల్లల వయస్సు వాళ్లం. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆప్యాయంగా 'ఏరా' అని పిలిచేవారు.
'ఫిరంగి పురం' పంచాయితీ సమితి అధ్యక్షుడిగా గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
ఒక కమ్యూనిష్టుకు అధికారం ఇస్తే చట్ట పరిధిలోనే అభివృద్ధికరమైన పనులు ఎన్ని చేయవచ్చో సమర్థవంతంగా చేసి చూపించారు.
ఆయన మాటలు కొన్ని మరచిపోలేము.
అంతకు ముందు పోటీచేసిన ఎలక్షన్లలో చాలా సార్లు ఓడిపోయారు.ఒక ఎలక్షన్లో ఓడిపోయిన మర్నాడు ఆఫీసులో కలిశాము.
“అరేయ్ ఈసారి నేను ఓడిపోన్రా” అన్నారు.
... వచ్చేసారి గెలుపు గ్యారంటీ అని చేబ్తున్నారు అనుకొని ఆసక్తిగా ముందుకు జరిగాం అందరం.
ఇంకేం చెబుతారో అని.
'వీణ్ణి ఓడిస్తానురా ' అన్నారు 'మన్నెం కోటేశ్వరరావును' చూపిస్తూ.
పెద్దగా నవ్వుకున్నాం.
ఓడిపోవడం గ్యారంటీ.కాకపోతే కోటేశ్వర రావును నుంచో పెడదాం అని ఆయన ఉద్దేశ్యం. ఇలా సరదాగా మాట్లాడుతుండేవారు.
ఇప్పుడు ప్రజాశక్తిలో పనిచేస్తున్న కోటేశ్వర రావు అప్పుడు SFI జిల్లా అధ్యక్షునిగా, ఆఫీస్ సెక్రటరీగానూ ఉండేవాడు .
ఒకసంవత్సరం మా కాలేజీ ఎలక్షన్లో చాలా సంవత్సరాల నుంచి మాకు అండగా ఉన్న మిత్రుల బృందం మా ఎదుటి వర్గంతో కలిసి పోటీ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత మొదట సారి ఓడిపోతామేమోనని అనిపించింది.
ఎలక్షన్ పూర్తయ్యింది.
కౌంటింగ్ జరుగుతోంది.
దిగులుగా ఆఫీసుకు వచ్చి కూర్చున్నాము. ఆయన ఆఫీసుకు వచ్చారు.
మామూలు మాటలు మొదలుపెట్టారు. ప్రతిపక్షం పోషించగలిగిన పాత్ర గురించి రకరకాల ఉదాహరణలతో బోధించారు .
‘ అరె ఇప్పుడు మనం గెలిస్తే ఎట్లా!ప్రతిపక్షం పాత్ర పోషించలేమే’
అనే భావన వచ్చింది అక్కడున్న కుర్రాళ్లకు.
"అందుకేగా నేను వచ్చింది. ఓడిపోతే దిగులుపడతారని అర్థమయ్యి 103 జ్వరంలో ఉన్నా వచ్చాను .
గెలిస్తే విధ్యార్థులకుపయోగపడే పనులు చేస్తాం. ఓడిపోతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పనులు జరిగేట్లు చూస్తాం. దిగులుపడకూడదు” అని చెప్పారు.
ఇవే మాటలు కాకపోవచ్చు. ఈ అర్థం వచ్చేటట్లు కౌన్సిల్ చేశారు.
.....
‘కమ్యూనికేషన్ గాప్’ ఎలా ఉంటుందో నాకు నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
మా బావకు BP, సుగర్ లు కంట్రోల్లోలేక మూత్రపిండాలు పాడైపోయాయి. ఆయన ఆ తేడాతోనే చిన్నవయస్సులోనే చనిపోయారు. మా బావ మందులు చాలా మిగిలిపోయాయి. వెంకటపతి గారికి BP ఉండేది. వారికి ఉపయోగపడతాయని పట్టుకొచ్చి వారికిచ్చి ‘ మా బావ ఈ మందులు వాడే వాడండి. చనిపోయాడు. మీకోసం తీసుకువచ్చాను’ అన్నాను.
'అయితే ఇప్పుడు నేను ఇవి వాడి చావాలా’ అన్నారు నవ్వుతూ. అందరం ఫక్కున నవ్వాము. నా మాటలు అదే అర్థం వచ్చేట్లున్నాయి కదా!
.....
గుంటూరు పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన విషయం మొన్నటి పోస్టులో రాశాను.
...
ఒకసారి ఏదో పని మీద వారింటికి వెళ్లాను. భారతి గారు,వెంకటపతి గారు పిల్లలిద్దరితో చిన్న ఇంట్లో ఉండేవారు . ఆ సమయంలోనే ఒక లేడీ టీచరు అక్కడకు వచ్చారు. అప్పుడు వెంకటపతి గారు ఫిరంగిపురం సమితి ప్రెసిడెంటు.
ఆవిడని 'కూర్చోమ్మా' అన్నారు. ‘ఫరవాలేదండీ’ అందామె.
‘ కూర్చోమ్మా’ అన్నారు మెల్లగా
‘ఫరవాలేదండీ’ మళ్ళీ అదే సమాధానం.
ఇలా 3-4 సార్లు జరిగింది.
సమితి అధ్యక్షుడంటే టీచర్లకు టెర్రర్ ఆ కాలంలో.
‘కూర్చోవాలి ’ గట్టిగా అన్నారు ఆయన.
వెంటనే గబుక్కున కూర్చుంది ఆవిడ.
నుంచోపెట్టి మాట్లాడటం మర్యాదకాదని వెంకటపతి గారి ఉద్దేశం. సమితి ప్రెసిడెంటు ఎదురుగా అదేస్థాయి కుర్చీలో కూర్చోవడం టీచర్లకు ఇబ్బంది. ఆవిడ సమస్య సావధానంగా విని ధైర్యం చెప్పి పంపారు.
“ గతంలో ఫిరంగిపురం సమితిలో UTF సభ్యత్వం 30 ఉండేది. ఇప్పుడు 300 ఉంది. దీనిని ఏమంటార్రా!” అని అడిగారు .
‘అభివృద్ధి ఆండీ’ అన్నాడు అక్కడ ఉన్న కార్యకర్త.
‘నేను అవకాశవాదం అంటానురా ” అని నవ్వారు.
ఇలా ఉంటుంది ఆయనతో సంభాషణ.
.....
"చండ్ర రాజేశ్వరరావు గారు రాసిన 'పార్టీ నిర్మాణం ' పుస్తకం చదవండిరా . నేను చాలా సార్లు చదివాను. ఇప్పుడు దొరికితే మళ్ళీ చదువుతాను " అనేవారు .
అప్పట్నుంచీ ఆ పుస్తకం కోసం ప్రయత్నించితే గత సంవత్సరమే దొరికింది.
మిత్రులు కాంచనరావు గారు నాకది బహూకరించారు .
...
గుంటూరులో నా చదువు అయిపోయిన తర్వాత ఒంగోలు పెళ్లిపోయాను. అక్కడ బెతూన్ నర్సింగ్ హోంలో డా. రంగారావు గారి వద్ద రెండు సంవత్సరాలు పని చేసి ప్రాక్టీసు మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నాను.
పిన్నమనేని మురళీ కృష్ణ గార్ని ,ఉమామహేశ్వరరావు గార్ని కలవడానికి విజయవాడ పార్టీ ఆఫీసుకు వెళ్లాను.
నేను లోపలికి వెళ్లబోతుంటే
వారు బయటకు వస్తున్నారు.
‘నమస్కారమండీ,బాగున్నారా’ అని పలకరించాను.
BP
సుగర్
థైరాయిడ్
గూడునొప్పి
మెడనొప్పి
నిద్రపట్టక పోవడం
కాళ్ళవాపులు
- ఇవన్నీ చెప్పాననుకో
ఎందుకు పలకరించానా వీణ్ణి
అనిపిస్తుంది.
‘ బాగున్నానయ్యా’ అంటే పోలా!
అంటూ నవ్వారు.
నా ట్రైనింగు, భవిష్యత్తు ఆలోచనలను అన్నీ కనుక్కొని వెళ్లి పోయారు.
అదే ఆఖరుసారి చూడడం వారిని.
వారి గురించిన ఇంకా అనేక సంఘటనలు నా మదిలో ఎప్పుడూ మెదుల్తూనే ఉంటాయి.
వారికి జోహార్లు 🙏
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
30.05.2021.