హోమియోపతితో నా ప్రయాణం....           (29-May-2021)


 గుర్తుకొస్తున్నాయి ... 50

“హోమియోపతితో నా ప్రయాణం”
“అల్లోపతి డాక్టరు అయి ఉండి మీరు హోమియో డాక్టరు దగ్గరకు వెళ్లమంటారేంటి సార్” అని ప్రశ్నించాను.
‘పులిపిర్లకు హోమియో వైద్యం బాగా పని చేయడం చూశానయ్యా’ అన్నారు ఆ సర్జన్ నాతో.
...
1980 లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. సర్జరీ వార్డులో పోస్టింగ్. నాకు ‘ఆపరేషన్ చేసే కత్తి’ ఎలా పట్టుకోవాలో మొట్టమొదటిగా నేర్పించిన గురువు గారు డా. ఘట్టమనేని లక్ష్మీ ప్రసాదు గారు అప్పుడు సర్జరీ అసిస్టెంటు. ఆపరేషన్లు ఎంతో నైపుణ్యంతో, చూడముచ్చటగా చేసేవారు. నాకు వారంటే ఎంతో గౌరవం.
తన ముఖం పై ఉన్న పులిపిరికాయ తీయమని ఒకాయన ఈ డాక్టరు గారి దగ్గరకు వస్తే “హోమియో డాక్టరు వద్దకు వెళ్లయ్యా. ‘తూజా’ అనే మందు ఇస్తారు. రాలిపోతాయి” అన్నారాయన.
అప్పుడు నేనడిగిన ప్రశ్న - వారి సమాధానం ఇంతకు ముందు రాసినవి.
నమ్మకం :
పెద్దాయన చెప్పిన తర్వాత హోమియోపై నమ్మకం పెరిగింది. అప్పట్లో గుడివాడలో అమ్మ, నాన్న గారు ఉండేవారు. గుడివాడ వెళ్లినప్పుడు పని గట్టుకుని “గురురాజు హోమియో వైద్య కళాశాల” కు వెళ్ళి అక్కడ చదివే మెడికల్ స్టూడెంట్స్ ను పరిచయం చేసుకుని వారితో కొంత సమయం గడిపేవాడిని. దీర్ఘకాలిక జబ్బులకు హోమియోలో మంచి వైద్యం ఉందని వారనేవారు.
“మన లాంటి బీద దేశానికి హోమియో వైద్యం అవసరం. హోమియో వైద్యంలో నయమయ్యే జబ్బులన్నింటికీ అదే వైద్యం ఇప్పించాలి. తక్కువ ఖర్చుతో వైద్యం పూర్తవుతుంది” అనే సిద్ధాంతానికి వచ్చాను.
1980 నుండీ హోమియో వైద్యంలో తగ్గే జబ్బులకు హోమియో డాక్టర్ల వద్దకు రోగులను పంపడం మొదలుపెట్టాను. 1988 లో చల్లపల్లిలో ప్రాక్టీసు మొదలుపెట్టాను. మా ఊరు ప్రక్కనే యార్లగడ్డ అనే ఊర్లో ప్రభుత్వ హోమియో క్లినిక్ ఉండేది. అక్కడ పనిచేసే డాక్టరు పరిచయం అయ్యారు. చాలా మంచి వ్యక్తి. వారి వద్దకు నేను కొన్ని కేసులు పంపుతుండేవాడిని. 6 నెలలు హోమియో వాడితే ఆస్థమా తగ్గిపోతుందని మరో హోమియో డాక్టరు చెప్పారని మా నర్సు ‘పద్మ’ నాతో చెప్పి ఆ వైద్యం తీసుకుంది. ‘6 నెలల తర్వాత నాకేం ఉపయోగంగా లేదండీ’ అని చెప్పి ఆ వైద్యం మానేసింది.
అనుభవం :
1980 లో హోమియో ను ఒక శాస్త్రంగా నమ్మాను. అనేక మంది రోగులను హోమియో డాక్టర్ల వద్దకు పంపాను. Self limiting diseases తప్పితే ఒక్క జబ్బు తగ్గలేదు. కనీసం ఒక్కరికి కూడా పులిపిర్లు రాలిపోలేదు. నాలో అంతర్మధనం మొదలయింది. రాష్ట్రం లోని నాకంటే సీనియర్లైన డాక్టర్లతో హోమియో వైద్యం గురించి చర్చించడం మొదలుపెట్టాను. ఒక పెద్దాయన “There is no science in it ప్రసాదూ!” అని సెలవిచ్చారు.
‘నరిసెట్టి ఇన్నయ్య’ గారు రచించిన ‘అబద్ధాల వేట - నిజాల బాట’ పుస్తకంలో అన్ని వైద్య విధానాల పైనా శాస్త్రీయ అవగాహన కలిగించే వ్యాసాలున్నాయి. హోమియోపైన కూడా కొన్ని వ్యాసాలున్నాయి. అవి చదివిన తర్వాత హోమియోపై నాకున్న నమ్మకం పటాపంచలైపోయింది.
1980 నుండీ 2001 వరకు 21 సం.ల పాటు నేను హోమియో వైద్యానికి మద్ధతిచ్చాను. అందులో శాస్త్రీయత ఏమీ లేదని తెలిసిన తర్వాత ఎవ్వరినీ హోమియో వైద్యం కోసం రిఫర్ చేయలేదు. హోమియోతో నా ప్రయాణం అక్కడితో ముగిసింది.
ఐతే హోమియోపతి వైద్యంతో మంచి ఫలితాలున్నాయని అనేక మంది చెప్తుంటారు. వారికున్న అనుభవాలు నాకు కూడా చాలానే ఉన్నాయి. మా చిన్నతనంలో మా నాన్నగారు కూడా ‘తరచుగా అయ్యే విరోచనాల’ కోసం హోమియో వైద్యం తీసుకున్నారు. అవి తగ్గినవని వారు సంతోషంగానే ఉన్నారు. ఇలా అనేకమంది హోమియో వైద్యంతో సంతోషంగా ఉన్న వారు నాకు తెలుసు.
జబ్బులలో Self limiting diseases,
psycho somatic problems కు మాత్రమే హోమియో వైద్యం వలన ఫలితం కనిపిస్తుంది. అది మందు వలన వచ్చిన ఫలితం కాదు.
వైద్యం చేయించుకున్నామన్న నమ్మకంతోనూ, వైద్యుని కౌన్సిలింగ్ తోనూ,
దేహానికున్న జబ్బులను మాన్పించే గుణం వల్లను ఫలితం కనిపిస్తుంది.
అంతే తప్ప హోమియో గుళికలలో ఉన్న మందు వల్ల మాత్రం కాదు. ఇది అర్ధం కావడానికి నాకు 21 సంవత్సరాలు పట్టింది.
“మేం ఇంగ్లీషు మందులు వాడం. ఏ తేడా వచ్చినా హోమియోనే వాడతాం” అనే వారుంటారు. 'మీకు ఆ వైద్యంలో సుగుణం కనిపిస్తే అలానే కానివ్వండి ' అని చెబుతాను. అర్ధం చేసుకోగలిగిన వారనుకుంటే నా అనుభవాన్ని చెబుతాను.
కొన్ని సాంఘిక సంస్థలు (క్లబ్బులు, యువజన సంఘాలు) హోమియో క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. మెదడు వాపు వంటి వ్యాధులు ప్రబలమైనపుడు హోమియో గుళికలు పంచుతుంటారు. తెలిసినవారైతే నా అభిప్రాయం ఇలా చెబుతాను. “ నిస్వార్ధంగా జనానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే మీరు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మందులు పంచుతున్నారు. కానీ రుజువు చేయబడని వైద్యాన్ని ప్రచారం చేసి జనంలో అనవసరమైన ఆశను కల్పించడం సరికాదు” అని.
హోమియో వైద్యుల గురించి :
హోమియో వైద్యులపై నాకున్న గౌరవం ఇప్పటికీ ఏం తగ్గలేదు. హోమియో వైద్యులలో రెండు రకాల వారున్నారు.
వైద్య విద్యార్ధులుగా చేరి పట్టా తీసుకుని ప్రాక్టీస్ చేసేవారు కొందరు.
హోమియో వైద్యాన్ని నమ్మి సొంతంగా చదువుకొని ప్రవృత్తిగా ప్రాక్టీస్ చేసే వారు మరికొందరు. హోమియో వైద్యం చాల చౌక. హోమియోని నమ్మి మందులు ఇచ్చేవారిలో ఎక్కువ మంది ఫీజు తీసుకోరు. ఉచితంగానే వైద్యం చేస్తారు.
వీరెవ్వరి మీద నాకు ఫిర్యాదులేమీ లేవు. వారిని డాక్టర్లు గానే గుర్తిస్తాను.
...
హోమియోలో శాస్త్రమూ లేదు – మందూ లేదు.
ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు ,స్పెయిన్ ఇంకా మరికొన్ని దేశాలు ఇది అశాస్త్రీయ వైద్యమని తేల్చిపారేశాయి.
ఆఖరుగా
మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?
‘రాల్తాయి’ అనే సమాధానం వస్తే
హోమియో మందులు వాడుకోవచ్చు.
- మరి ‘రేకీ, ప్రాణిక్ హీలింగ్’ వైద్యాల సంగతేమిటి?
పై సమాధానమే వీటికీ వర్తిస్తుంది.
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
29.05.2021.