భగవంతుడు - భక్తుడు - నాస్తికుడు....           (26-May-2021)


 గుర్తుకొస్తున్నాయి...49

భగవంతుడు - భక్తుడు - నాస్తికుడు
1986 లో పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చిన వరదల సందర్భంగా అక్కడి ప్రజల వైద్య సహాయం కోసం కొన్ని బృందాలు వెళ్లాయని చెప్పాను కదా. మా బృందానికి నాయకుడు డా. భాస్కరరావు గారు.
నేనూ, డా. భాస్కరరావు గారు ఇద్దరం నాస్తికులమే. మా బృందం ముందుగా వెళ్లిన పోలవరం గ్రామంలో వరదల వలన ఇళ్లన్నీ బురదలో నిండిపోయి ఉన్నాయి. ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడిలో మా బస ఏర్పాటు చేశారు. గర్భ గుడిలోనే మా మకాం (ఆ గుడికి ఉన్నది ఆ ఒక్క గదే). గుడి బయట క్లినిక్ ను నిర్వహించేవారిమి.
అప్పుడే ఈ చిత్రమైన వార్త గుర్తుకొచ్చింది.
1979 లో “రష్యా అధ్యక్షుడు బ్రెజ్నేవ్, అమెరికా అధ్యక్షుడు 'జిమ్మీ కార్టర్' ల శిఖరాగ్ర సమావేశం జరిగింది.
మారణాయుధాలను నియంత్రించడానికి SALT పేరుతో అప్పటికే ఈ ఇరుదేశాల అధ్యక్షుల మధ్య చర్చలు జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి.
ఈ ఆఖరి సమావేశం జరిగిన మర్నాడు దిన పత్రికలలో వచ్చిన పతాక శీర్షిక
“దేవుణ్ణి తలుచుకొన్న కమ్యూనిస్ట్ బ్రెజ్నేవ్” అని.
అమెరికా, రష్యాలు పోటాపోటీగా తయారుచేసుకున్న మిసైల్స్, అణ్వాయుధాల వలన ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అని కంగారు పడుతున్న రోజులవి. వస్తే గిస్తే అణ్వాయుధాల ప్రయోగం జరిగితే ఇక మనుషులు మిగలరేమో అని జనంలో ఒక భయం ఉంది.
జరిగిందేమిటంటే చర్చలు మొదలుపెట్టేముందు కార్టర్ తో
"ఈ సారి కూడా మనం ఒక ఒప్పందానికి రాకపోతే ఆ భగవంతుడు కూడా క్షమించడు” అన్నాడట బ్రెజ్నేవ్. వార్తా పత్రికలన్నీ దాదాపుగా ఇదే హెడ్డింగును పెట్టాయి.
బ్రెజ్నేవ్ నాస్తికుడయినా వాడుకలో ఉన్న సామెతను వాడి ఉంటాడు.
మనకు కూడా
'దేవుడు మేలు చేస్తే'
'ఏదో దేవుడు దయ వల్ల'
'భగవంతుడు కూడా క్షమించడు' - అనే పలుకుబడులు వాడుకలో ఉన్నాయి గదా...
గోదావరి కట్ట ప్రక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడే మాకు ఆశ్రయ మిచ్చింది. దేవుడి ప్రక్కనే మా పడక.
మాలాంటి నాస్తికులకు కూడా ఆశ్రయమిచ్చిన దేవుడు గొప్పవాడా? ఆ గుడి కట్టిన మనుషులు గొప్పవారా?
ఇదంతా ఆ అంజనేయ స్వామి గుళ్ళో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలు .
...
4 దశాబ్దాల క్రితం గుంటూరు బ్రాడీ పేటలో CPM పార్టీ కొత్తగా కట్టిన ఆఫీసు భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. ఆ సభలో జిల్లా కార్యదర్శి పుతుంబాక వెంకటపతి గారు మాట్లాడుతూ 'ఈ పేటలో ఇంత స్థలం కొనడం మాకు సాధ్యమయ్యేది కాదు. కానీ భగవంతుడు దయ వలన మాత్రమే కుదిరింది' అన్నారు. సభికులంతా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
కమ్యూనిస్టు నోటిలో నుంచి ఈ మాటలు ఏమిటి అని ఆశ్చర్యం గా ఉంది అందరికి. ఆ అనుమానాన్ని తీర్చడానికి ఆయనే ఇలా చెప్పారు. 'బ్రాడీ పేటలోని ఈ స్థలాన్ని కొనడం పార్టీ వల్ల అయ్యేది కాదు. ప్రక్కనే గుడి ఉంది. గుడి ధ్వజ స్తంభం నీడ ఈ స్థలంలో పడుతోందని ఎవ్వరూ కొనడానికి రాలేదు. అందుకే మనకి చాలా చౌకగా దొరికింది' అని నవ్వారు.
దేవుణ్ణి నమ్మని వాళ్ళను కూడా అప్పుడప్పుడు దేవుడు కరుణిస్తాడన్న మాట.
ఆఖరి మాట :
దశావతారం సినిమాలో హీరో హీరోయిన్ ల ఈ ఆఖరి మాటలు నేనెప్పటికీ మరిచిపోలేను.
అసిన్ : దేవుడు లేడని మాత్రం ఎప్పుడూ చెప్పొద్దే.
కమల్ హాసన్ : అయ్యో! నేను దేవుడు లేడని ఎప్పుడన్నాను.
ఉండుంటే బాగుండేది అన్నాను.
అవును కదా!
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
26.05.2021