‘శివయ్య, నాగరాజుల కధాకమామిషు’ ....           (25-May-2021)


 గుర్తుకొస్తున్నాయి...48

‘శివయ్య, నాగరాజుల కధాకమామిషు’
నాగరాజా..
నేను నాగరాజా
నేను నాగరాజా వదిలిపెట్టు .... వదిలిపెట్టు అని బ్రతిమిలాడుతున్నాడు శివయ్య.
చేతిలో ఉన్న త్రాచుపాము రెండో చేతి వేలును కొరికి పట్టుకొని ఉంది.
చుట్టూ జనం.
కోలాహలంగా ఉంది.
...
1986 లో పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు వచ్చాయి. దాదాపు మూడు వంతుల జిల్లా మునిగిపోయింది. ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చేసి జనానికి నిలువ నీడ లేకుండా పోయింది. వరి పైరు నిండా మునిగిపోయింది. ప్రాణనష్టం అయితే పెద్దగా జరగలేదు కానీ ఆస్తి నష్టం చెప్పలేనంత. ఇటువంటి పరిస్థితులలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం సవాలే! జనం ఆరోగ్యం కాపాడాలంటే ప్రభుత్వం ఒక్కదానికే కుదరని పని.
అందుకే కొంతమంది డాక్టర్లు కాంపౌండర్లను, వాలంటీర్ల ను తీసుకుని వైద్య సహాయం ఇవ్వడానికి బయలుదేరారు.
నేను అప్పుడు ఒంగోలులో ‘డా.బెతూన్ నర్సింగ్ హోం’ నిర్వహిస్తున్న ‘డా. రంగారావు గారి’ వద్ద పనిచేస్తున్నాను. వైద్యంలో మెలకువలతోబాటు, తన ఆచరణ ద్వారా క్రమశిక్షణను, విలువలను మాకు నేర్పిన మహానుభావుడాయన. నేను డాక్టర్ల బృందంతో వెళ్లడానికి రంగారావు గారు నన్ను ప్రోత్సహించారు.
ఒంగోలు నుండీ నేను, విజయవాడ నుండీ డా. భాస్కరరావు గారు (ప్రజా వైద్యశాల), నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల నుండి మిత్రులు డా. రమేష్, డా. జి. విజయ్ కుమార్ మరికొంత మంది కాంపౌడర్లు, వాలంటీర్ల తో కలసి ముందుగా ఏలూరు చేరుకున్నాము. అక్కడ నుండీ మూడు బృందాలుగా విడిపోయాం.
మా బృందం ముందుగా పోలవరం వెళ్ళింది. మా నాయకుడు డా. భాస్కర రావు గారు. జనమంతా గోదావరి కట్ట మీదనే ఉన్నారు. కట్ట క్రింద ఉన్న ఇళ్ళ నిండా మూడు నాలుగు అడుగుల బురద, గోడలకు ఏడు అడుగుల ఎత్తున వరద నీరు నిలిచిన చారలు కన్పిస్తున్నాయి. మనుషులు మునిగి పోయేంత ఎత్తుగా నీళ్లు వచ్చినా ప్రాణ నష్టం జరగకపోవడం విని సంతోషపడ్డాం.
మేం పోలవరం వెళ్లేటప్పటికే ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చూడడంలోనూ, వచ్చిన వారికి వైద్య సహాయం చేయడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమయ్యింది. మేం చాలా సంతోషపడ్డాం. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తే మరి సంతోషంగా ఉండదా!
మేము అక్కడ ఉండడానికి ఒక్క ఇల్లూ లేదు. అందరూ ఇళ్ళు వదిలి గోదావరి కట్ట మీదే ఉంటున్నారు. వరద వచ్చిన రాత్రి ఇళ్ళ నుండీ వీలైనన్ని సామాన్లు తెచ్చుకొన్నారు. మిగిలినవి బురదలోనే ఉండిపోయాయి. ఇంకా మమ్మల్ని ఎక్కడ అట్టిపెడతారు?
‘కేశవరావు’ గారని ఒక పెద్దాయన పరిచయం అయ్యారు. ఆయనకు ఆ ఊళ్లో చాలా మంచి పేరు ఉంది. వారి ఇల్లు కూడా బురదలోనే ఉంది. మా కార్యక్రమాలకు ఆయన సహాయం చేసేవారు. కట్ట ప్రక్కన ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. వరద వచ్చిన రోజు ఆ గుడిలో చాలా మంది తలదాచుకొన్నారట. అందులోనే మమ్మల్ని అట్టిపెట్టారు. అక్కడ ఉన్నన్ని రోజులూ మా మకాం గర్భ గుళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రక్కనే.
‘సాంబయ్య’ గారనే పెద్దాయన మా గురించి తెలుసుకొని భోజనానికి ఆహ్వానించారు. అక్కడ ఉన్నన్ని రోజులు రెండు పూటలా భోజనం వాళ్ళింట్లోనే. సాంబయ్య గారి భార్య, కుమార్తె రాణి మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు.
1977 దివిసీమ తుఫాను తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి విపత్తులను ఎదుర్కోవడంలో కొంత అనుభవం వచ్చింది. మేము గతంలో దివిసీమలో చేసిన పనులన్నీ ఇక్కడ చేయవలసిన అవసరం రాలేదు. అందుకే నిర్వాహకులు ఆ జిల్లాలోనే దూరంగా మరో ప్రాంతానికి మమ్మల్ని పంపించారు.
అక్కడ ఒక మండల కేంద్రంలో ఉండి చుట్టూ ఉన్నఊళ్లలో వైద్య సహాయం చేసే వాళ్ళం. ఆ ప్రాంతానికి చెందిన ఒక కుర్రవాడు కూడా మాతో పాటు పనిచేస్తుండేవాడు.
అతను చెప్పాడీ సంఘటన.
అంతకుముందు సంవత్సరం ఆ కుర్రవాడి గ్రామంలో శివయ్య అనే రైతు తన పొలం గట్టు పై నడుస్తుంటే దారిలో నాగుపాము కనిపించిందట. చేతి కర్రతో నాలుగు దెబ్బలు వేసి చచ్చిందనుకొని ఇంటికి వెళ్లాడట. నాలుగు రోజుల తర్వాత తన పొలానికి జనం చాలా మంది వెళ్లి వస్తున్నారని తెలిసింది. వివరాలు సేకరించాడు. ఆడవాళ్ళెవరో అటు వెళ్తుంటే నాగుపాము కన్పించిందట. జనం తిరుగుతున్నా కదలకుండా అలాగే ఉంటోందది. ‘నాగరాజు’ అని దండం పెట్టిందట ఆవిడ. అదేమీ కదలలేదు. దెబ్బలు తిని కదలలేని పరిస్థితి ఆ పాముది.
ఈ పాము ‘నాగరాజు’ అని జనానికి నమ్మకం వచ్చేసింది. ఒకళ్ళకు ఒకళ్ళు చెప్పుకుని అనేకమంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఆ సందడంతా శివయ్య కూడా చూశాడు. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది.
నాగరాజుకు ఒక పాక వేశాడు. హుండీ పెట్టాడు. జనాలు వేలల్లో వస్తున్నారు. ఆటోలు, టాక్సీలు వస్తున్నాయి. ఆ జిల్లానే కాక చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా వస్తున్నారు. తన పొలంలో వాహనాల రాకకు దారి వేయించాడు. వచ్చే పోయే జనాలకు తినడానికి, తాగడానికి రకరకాల వ్యాపారాలు వచ్చాయి. తండోప తండాలుగా వచ్చే జనం కోసం RTC వారు బస్సులు వేశారు. హుండీ ఆదాయం బాగానే ఉంది.
నాగరాజుకు ఒక గుడి కట్టాలనే ఆలోచన వచ్చింది శివయ్యకు. శివయ్య నాగరాజు దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. పామును పట్టుకొని అందరికీ చూపించడం లాంటి విన్యాసాలు చేస్తున్నాడు. నాగరాజును చూడడానికి వచ్చే జనం రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వచ్చే వాళ్లు పెట్టే ఆహారంతో దానికి కాస్త ఓపిక, బలం వచ్చాయి.
ఒకరోజు నాగరాజును తన చేత్తో పట్టుకుని ఆడిస్తూ ఉంటే అకస్మాత్తుగా అది ఒక వేలు పట్టుకొని వదలలేదు.
విస్తు పోయాడు పెద్ద మనిషి.
అమ్మో, అబ్బో అనడానికి వీలులేదు.
చేతిలో ఉన్నది దేవుడు.
ఎదురుగా ఆ విశ్వాసం బలంగా ఉన్న జనం.
ఏం చేయాలో పాలుపోవడం లేదు.
భయం వేస్తోంది.
చెమటలు పడుతున్నాయి.
నాగరాజా.. నేను నాగరాజా..
నాగరాజా నేను నాగరాజా
వదులు నాగరాజా అని బ్రతిమాలుతున్నాడు.
దానికి అర్థం అవుతుందా?
ఆ వేలును అది వదల్లేదు.
చావు భయం వచ్చింది.
ఒక్కసారిగా చేతిని విదిలించి కెవ్వున కేక వేసి ‘నన్ను ఆసుపత్రికి తీసుకుపోండ్రా’ అని గట్టిగా అరిచాడు.
అందరూ చెల్లాచెదిరిపోయారు.
ఆసుపత్రిలో చేర్చారు.
చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లైంది.
వేలు కాస్త కుళ్ళింది కానీ బ్రతికి బయట పడ్డాడు.
పాము ఎటు పోయిందో తెలీదు.
జనం రావడం ఆగిపోయింది.
ఆటోలు, టాక్సీలు లేవు.
వ్యాపారాలు అన్నీ ఆగిపోయాయి.
RTC వాళ్లు ఆ రూటు కాన్సిల్ చేశారు.
.....
ఇప్పుడు
కేశవరావు గారు లేరు.
సాంబయ్య గారు లేరు.
డా. భాస్కర రావు గారు లేరు.
డా. విజయ్ కుమార్ అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు.
నేను మాత్రం ఈ కథ చెప్పడానికి ఉన్నాను.
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
25.05.2021.