అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఉంటుందా?....           (21-May-2021)


 గుర్తుకొస్తున్నాయి...47

అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఉంటుందా?
మా మందుల్లో సైడ్ ఎఫెక్ట్ లు అస్సలు ఉండవండీ!
ఇది కెమికల్ కాదు కదా!
చెట్ల నుండీ నేచురల్ గా తీసింది కదా!
సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగుంటాయి?
10 సంవత్సరాలు క్రితం ఉదయం 7 గంటలకు భీమారావు ఫోన్ చేశాడు.
సార్ ! “అన్నయ్యకు సీరియస్ గా ఉంది. మీరు అర్జంటుగా రావాలి “ అని.
వెంటనే వెళ్ళి చూస్తే భీమరావు అన్న చనిపోయి ఉన్నాడు.
నెమ్మదిగా అదే చెప్పాను.
ఆ “వేరు ప్రాణం తీసిందండీ! "అన్నాడు.
ఏమిటి విషయం? అని అడిగాను.
నేను శ్రీశైలం అడవుల నుండి ‘నాగ ముష్టి’ వేరు తీసుకువచ్చాను. అది చెంబు నీళ్లలో వేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగాడట. సుగర్ వ్యాధికి ఈ నీళ్లు తాగితే పూర్తిగా తగ్గి పోతుందట. ఇంగ్లీషు వైద్యంలో పూర్తిగా పోదుగదండీ. అందుకే చాలామంది అడుగుతున్నారు. నేను RTC driver ని కదా తెచ్చి పెడుతుంటాను.
అన్నయ్య ఇది ఒక గ్లాసు తాగాడు. తాగాక వెంటనే నాకు ఫోన్ చేసి “ అరే నేను చచ్చిపోతున్నా! నాన్నకు కూడా తాగమని ఇచ్చాను. నాన్నను కాపాడరా” అన్నాడు.
మా నాన్నకు ఫోన్ చేసి ఆ నీళ్లు తాగద్దని చెప్పి అన్నయ్య ఇంటికి వెళ్లి మీ దగ్గరకు తీసుకువచ్చానండీ!
ఈ వేరే ప్రాణం తీసేసిందండీ అని ఏడ్చాడు.
‘లేదు భీమరావ్ , ఆ వేరు వల్ల అంత ప్రమాదం జరిగి ఉండదు. షుగర్ ఉంది కదా! గుండె పోటు వచ్చి ఉంటుంది’ అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను.
అన్న శవాన్ని తీసుకుని వెళ్లిపోయాడు భీమారావు.
మర్నాడు ఉదయం ఓపి లో మా కాంపౌండరు నా దగ్గరకు వచ్చి “ భీమారావు మీతో మాట్లాడాలంటండీ “అన్నాడు.
‘రమ్మను’ అన్నాను.
నా ఎదురు కుర్చీలో కూర్చొని తాను తెచ్చిన సంచిలో నుండీ ఒక చెంబు తీసి నా బల్లపై పెట్టి అందులో నుండీ ఒక చెక్క ముక్క లాంటి దానిని తీశాడు.
‘ఈ ముక్క రాత్రంతా ఈ నీళ్లలో ఉంచానండీ. ఒక్క స్పూను నీళ్లు మీరు తాగండి’ అని ఇచ్చాడు.
తాగేశాను.
ఒక్క నిముషం తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
హార్ట్ రేట్ పెరిగి గొంతు పొడిబారిపోయింది. ఒళ్ళంతా చెమటలు.
మరో నిముషంలో చచ్చిపోతున్నాను అనిపించింది.
‘ఏమిటి ఇంత పొరపాటు చేశాను? ఇలా చచ్చిపోతున్నానా చివరికి ‘అనుకున్నాను.
ఓ పది నిముషాల తర్వాత గానీ మామూలు పరిస్థితికి రాలేదు .
‘సార్ ఒక్క చెంచా నీళ్లు తాగితే మీరు ఇలా ఐపోయారు. మా అన్న ఒక గ్లాసు నీళ్లు తాగాడు. అందుకే చచ్చిపోయాడు. మీరు చెప్పినట్లు గుండె పోటు కాదు సార్! మీరు పెద్ద వాళ్లు. ఎదురు చెప్పకూడదు అని నిన్న నేను ఏమీ మాట్లాడలేదు. మీకు అర్థం కావాలని ఇది పట్టుకువచ్చాను సార్ అన్నాడు’ భీమారావు.
'నాన్నను మాత్రం బ్రతికించుకోగలిగాను'అంటూ వెళ్ళబోయాడు.
విషయం నాకు అర్థం అయింది.
‘ఆ వేరును నాకు ఇవ్వు ఎనాలసిస్ చేయిద్దాం’ అని తీసుకున్నాను. హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంటుకు పంపాను.
ఇంకా రిపోర్ట్ రావలసే ఉంది!
మరో నెల తర్వాత మా మావయ్య ఇదే నీళ్లు తాగి విపరీతంగా వాంతులు చేసుకొని నా దగ్గరకు వస్తే వైద్యం చేశాను.
ఇది జరిగి పదేళ్లకు పైనే అయింది. ఎవ్వరూ దీనిని ఎనలైజ్ చేయలేదు. ఇంకా ఎంతమంది చనిపోయారో, ఇబ్బంది పడ్డారో తెలీదు..
అది నాగ ముష్టి వేరు లాగా లేదు. కొమ్మలాగా ఉంది. ఇప్పటికీ ఒక ముక్క నా దగ్గర ఉంది. ఆ నీళ్లలో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో , వాటి ప్రభావం శరీరంపై ఎలా ఉంటుందో పరిశోధించాల్సిన అవసరం ఉంది.
ప్రకృతిలో సహజంగా దొరికే ఎన్నో రకాల మొక్కలు కొన్ని జబ్బులకు వైద్యం గా ఉపయోగపడుతున్నాయి. మొక్కలలోని వేర్లలో గాని, పువ్వులలో గాని, కాయలలో గాని, ఆకులలో గాని ఉన్న కెమికల్స్ ఏ ఏ జబ్బులకు ఉపయోగపడతాయో పరిశోధించి తెలుసుకుని వాడుకోవాలి.
ఉదాహరణకు ప్రతి ఊరిలోనూ పూసే 'బిళ్ల గన్నేరు(Vinca Rosea) ' మొక్క నుండి తీసిన “విన్ క్రిస్టిన్, విన్ బ్లాస్టిన్ “ అనే కెమికల్స్ కాన్సర్ వైద్యంలో ఉపయోగపడుతున్నాయి.
నా భార్య డా. పద్మ చాలా సార్లు అంటుంటుంది.
“ ఎఫెక్ట్స్ లేని వాటికే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్ లేదంటే ఎఫెక్ట్ లేదనే అర్థం”అని.
మనం మింగే ప్రతి కెమికల్ కు ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి.
వేరు, కాండము, ఆకు, పువ్వు, కాయ - ఏది తిన్నా ఉపయోగపడేయో, ప్రమాదం చేసేవో అందులో ఉన్న కెమికల్సే !
ఎంత మోతాదులో ఎఫెక్ట్ ఉంటుంది.
ఎంత మోతాదు ఇస్తే సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి.
ఎంతమందికి ఇస్తే ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని పరిశోధించిన తర్వాతే జనం వాడటానికి ప్రభుత్వం అనుమతించాలి.
మరోసారి చెబుతున్నా ...
సైడ్ ఎఫెక్ట్ లేదంటే ఎఫెక్ట్ లేనట్లే!
డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు
21.05.2021