40 సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఎర్రమల్లెలు’ సినిమా టికెట్టు సంపాదించిన విధానమెట్టిదనిన... ....           (04-May-2021)


 గుర్తుకొస్తున్నాయి...46

40 సంవత్సరాల క్రితం వచ్చిన
‘ఎర్రమల్లెలు’ సినిమా టికెట్టు సంపాదించిన విధానమెట్టిదనిన...
...
1981 మే 2 వ తేదీ
విజయవాడ రామా టాకీస్
సాయంత్రం 7.30 గంటలు
ఎర్రమల్లెలు సినిమా టిక్కెట్ కోసం 2 గంటల నుండీ నిలబడ్డాను.
క్యూలో మూడో వాడినే నేను.
టిక్కెట్ కౌంటర్ లైటు వెలిగింది.
అప్పుడే జరిగింది ఈ సంఘటన!
...
దేశంలో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ 1977 లో ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వామపక్ష భావాలు యువతను బాగా ఆకర్షిస్తున్న రోజులవి.
1980 వ సంవత్సరంలో ‘మాదల రంగారావు’ తీసిన మొదటి సినిమా ‘యువతరం’ కదిలింది మా అందరికీ బాగా నచ్చింది.
ఆయన తన 2 వ సినిమా అయిన ‘ఎర్ర మల్లెలు’ ను 1981 మే 1 న విడుదల చేశాడు. మొదట రోజునే ‘మంచి టాక్’ సొంతం చేసుకుంది.
2 వ తేదీ మొదటి ఆట చూడాలని ఉత్సాహపడ్డాను. మా అక్క, వదిన, మరో ఇద్దరు కూడా సిద్ధం అయ్యారు. నేను ముందే వెళ్లి టిక్కెట్లు తీసుకుంటాను మీరు 6 గంటలకు రండి అని చెప్పి కొత్త ఇస్త్రీ చొక్కా వేసుకొని బయలుదేరాను.
సాయంత్రం 5 గంటలకే హాలుకు వెళ్ళినా టిక్కెట్లు అయిపోయాయని బోర్డు పెట్టేశారు. రెండవ ఆటకు ఏడున్నర గంటల నుండీ బుకింగ్ కౌంటర్ తెరుస్తామన్నారు.
టిక్కెట్లు అయిపోయాయి.
మీరు బయలుదేరవద్దు. నేను ఇప్పటి నుండీ లైనులో ఉండి టిక్కెట్లు తీసుకుంటాను. మీరు ఎనిమిదిన్నరకు రండి అని మా వాళ్ళకు కబురు చేశాను.
అప్పట్నుండీ లైనులోనే ఉన్నాను.
మూడో వాణ్ణి నేను. టిక్కెట్లు గారంటీ కదా!
గంట గడిచింది. ఆరున్నర అయింది.
మరో గంట ఉంటే బుకింగ్ తెరుస్తారు. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.
ఈ లోపు మాసిన బట్టలు వేసుకుని ఒకతను వచ్చి నా ముందు ఇద్దరితో కబుర్లు పెట్టాడు. అప్పటికి నా వెనుక క్యూ చాలా ఉంది. నాతో కూడా కబుర్లు చెప్పడానికి ప్రయత్నించాడు. అతని ప్రవర్తన నాకు అయిష్టం గా ఉంది.
లైనులో లేకుండా ఇలా ప్రక్కకు వచ్చాడేమిటి అని మనసులో విసుగ్గా ఉంది. కానీ పైకి చెప్పలేకపోయాను. మొహమాటం కదా! ఎప్పటి నుంచో తెలిసిన స్నేహితుల్లాగా అందరితో మాట్లాడుతున్నాడు. నాకు కంపరంగానే ఉంది.
క్యూ ఇంకా పెరిగింది.
7.30 అయింది.
బుకింగ్ తెరుస్తున్నట్లు లైటు వెలిగింది.
అంతే! ఏం జరిగిందో నాకు తెలీదు.
కళ్ళు తెరిచేటప్పటికీ ఒక గుంపు మధ్యలో ఉన్నాను.
లైను, గియ్నూ ఏమీ లేదు.
గుంపులో నలిగిపోతున్నా.
అప్పటి వరకూ కబుర్లు చెప్పినాయన అందరి కంటే ముందున్నాడు.
నా ముందాయనికి లుంగీ ఊడిపోయింది.
లోపల లాగూ ఉందనుకోండి!
టిక్కెట్లు దొరికేదాక లుంగీని పట్టించుకుంటే ఒట్టు.
నా ఇస్త్రీ చొక్కా నలిగిపోయింది. గుండీలు ఊడిపోయాయి.
టిక్కెట్ల సంగతి దేవుడెరుగు ,ఆ త్రొక్కిసలాటలో బయట పడితే చాలుఅనిపించింది.
కాసేపటికి టిక్కెట్లు అయిపోయినట్లుగా కౌంటర్ మూసేసి లైట్లు తీసేశారు.
ఏం చెయ్యాలో తెలియలేదు. అలానే హాలు ముందు నుంచున్నాను.
ఇంతలో మా అక్క వాళ్ళంతా వచ్చేశారు.
‘ఏంటిరా?’ అంది మా అక్క
ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
జుట్టు చెరిగిపోయి, చొక్కా నలిగిపోయిన నన్ను చూసేటప్పటికీ అర్ధమైపోయినట్లుంది.
సరాసరి ఆడవాళ్ళంతా మేనేజర్ రూమ్ లోకి వెళ్లారు.
ఏం మాట్లాడారో ఏమో కాసేపటికి టిక్కెట్లతో బయటకు వచ్చారు.
మొత్తానికి ఆ రోజు రెండో ఆట సినిమా చూశాం.
...
మా అందరికీ సినిమా బాగా నచ్చింది.
సినిమా పెద్ద హిట్.
ఆ పాటలు ఇప్పటికీ నా నోటిలో నానుతూనే ఉంటాయి.
టిక్కెట్ల ప్రహసనం కూడా మరచిపోలేను.
- డి. ఆర్. కె
04.05.2021.