పోస్టు చెయ్యని ఉత్తరం....           (08-Nov-2020)


గుర్తుకొస్తున్నాయి 45
...
“పోస్టు చెయ్యని ఉత్తరం...”
‘ఎప్పుడూ మంచి పిల్లగా ఉండాలంటే ఎంత కష్టం... ఎంత బోరు...’
- మూడో సీత
...
‘బాబ్జీ ఉత్తరం పోస్ట్ చేశావా?’ దమయంతక్క అడిగింది.
‘అయ్యో బాబ్జీ చేయకుండా ఎందుకుంటాడు!’
- నేను సమాధానం చెప్పకముందే మరో అక్క నా తరపున ఇచ్చిన సమాధానం అది.
‘రాముడు మంచి బాలుడు’ లాగా నేను ‘మంచి బాలుణ్ణి’ చిన్నప్పుడు.
“పెద్దవాళ్ళు ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేయడం” మంచి బాలుడి ముఖ్య లక్షణం.
ఆ పనులన్నీ చేయడంలో అలిసిపోతుండేవాడిని. నా మీద నమ్మకంతో ప్రతి వారూ నాకే పనులు చెబ్తుండేవారు. ఒక్కోసారి ఏడుపొచ్చినంత పనయ్యేది.
ఒకసారి పోస్టు డబ్బాలో ఒక కార్డు వేసి రమ్మని ఇచ్చింది దమయంతక్క. నాకు అప్పటికే ఈ పనులన్నీ చేయడం కష్టం గా ఉంది. పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లాలంటే ఊరు చివరకు వెళ్లాలి. నా మీద నాకే జాలి, కోపం వచ్చి ఆ ఉత్తరాన్ని ఎవ్వరూ చూడకుండా చించివేశాను.
కానీ ఆ అపరాధ భావన నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది – నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానే అని’.
ఆ తర్వాత జీవితంలో ఎప్పుడూ అటువంటి పని చేయలేదు.
మూడో సీత కధ :
మిత్రులు డా. కోనేరు శ్రీధర్ గారు పంపిన ‘మూడో సీత కధ’ నవల చదివినప్పుడు -
‘ఎప్పుడూ మంచి పి‌ల్లగా ఉండడం ఎంత కష్టం... ఎంత బోరు...’ అనే సీత మాటలు చదవగానే నా బాల్యంలో జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చింది.
‘భువన చంద్ర’ గారు 50 – 60 ఏళ్ల క్రితం (1960 లలో) మన పల్లెటూర్లలో జీవితాన్ని ఓ గడుగ్గాయి అయిన “సీత” అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాసినది ఈ నవల.
నా వయస్సు వాళ్ళందరికీ తమ బాల్యాలను గుర్తు చేస్తుంది.
ఈ పుస్తకం గురించి రాయాలంటే చాలా రాయొచ్చు.
కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ...
‘తప్పక చదవండి’
- దాసరి రామకృష్ణ ప్రసాదు
08.11.2020.