సరిగ్గా 50 సంవత్సరాల క్రితం........           (24-Oct-2020)


 గుర్తుకొస్తున్నాయి...44

సరిగ్గా 50 సంవత్సరాల క్రితం....

మీకు బఱ్ఱె ఉందా?
బఱ్ఱె ఏమిటి?
మీకు బఱ్ఱె ఉందా?
బఱ్ఱె ఏమిటి?
ఉందికదయ్యా!
ఎక్కడ ఉంది?
అదిగో లారీలో ఉందికదా!
ఓ గేదా! అవును మాకు గేదె ఉంది.
మీ బర్రా అది!
అవును మా గేదె అది.
గేదను బర్రె అంటారని నాకు తెలియదు.
బర్రెను గేద అంటారని అతనికి తెలియదు.
ఇది సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ‘మూలపాడు’ లో నాకూ,నాఈడు కుర్రాడికి మధ్య జరిగిన సంభాషణ.
మా నాన్న గారు డ్రిల్లు మాష్టారు. నాకు ఊహ తెలిసేటప్పటికి ఆయన ‘ముదినేపల్లి హైస్కూల్’ లో పని చేసేవారు. ఆ తర్వాత ‘కైకలూరు స్కూలు’ కు మారారు. నా చదువు "అ..ఆ... నుండి 9 వ తరగతి "వరకు కైకలూరు ప్రక్కనే ఉన్న గోపవరంలోనూ, కైకలూరు లోనూ సాగింది. 1970 లో నాన్నగార్ని ‘మూలపాడు’ బదిలీ చేశారు. మాకున్న సామాను, గేదెను లారీలో తెచ్చుకుని దించుతున్నప్పుడు జరిగిన సంభాషణ అది.
----
ఒక కుర్రవాడి చేతిలో మంచి కర్ర ఉంది.
నాకు చేతి కర్రలంటే బాగా ఇష్టం.
ఒకటికి రెండు సార్లు తడిమి చూసి కర్ర చాలా బాగుంది అన్నాను.
‘నీకు తెచ్చేదా?’ అన్నాడు.
‘నాకెప్పుడు తెచ్చావు!’ అని నా సమాధానం.
‘నీకు తెచ్చేదా?’ అని స్వరం పెంచి మరీ అడిగాడు.
నా దగ్గర్నుండీ మళ్ళీ అదే సమాధానం ‘నువ్వెప్పుడు తెచ్చావ్’ అని.
మేం ఇలా వాదులాడుకొంటున్నట్లుగా మాట్లాడుకుంటుంటే ఒకాయన వచ్చి “బాబూ నీకు ఆ కర్ర నచ్చింది కదా! ఒక కర్ర తీసుకువచ్చి నీకు ఇవ్వనా అని అడుగుతున్నాడు అతను” అని చెప్పారు.
ఓహో తెచ్చేదా? అంటే తీసుకురానా అని అప్పుడు అర్ధం అయింది.
---
'వచ్చిండు,
పోయిండు,
ఉరికిండు,
యాడ ,
ఈడ ,
పోరి,
పోరగాడు,
మోరీ (వంతెన )...
ఈ పదాలు కొత్త.
అంతకముందు ఎప్పుడు వినలేదు.
ఏ వస్తువైనా బాగుంటే ‘మొనగాడు’ అనేవారు.
మంచి కర్ర అయితే 'మొనగాడు కర్ర 'అని, మంచి పెన్నును 'మొనగాడు పెన్ను 'అని ,
మంచి ఎద్దు ని 'మొనగాడు గిత్త' - ఇలా అన్నమాట.
‘మొనగాడు సిమెంట్... నాగార్జున సిమెంట్’ - అనే వాణిజ్య ప్రకటన మీరూ వినే ఉంటారనుకోండి.
ఇదంతా జరిగింది 1970 లో.
నాకు 13 వ సంవత్సరం అప్పుడు (1957 లో పుట్టాను).
అప్పటి వరకూ నేను పెరిగిన గుడివాడ తాలూకా, దివి తాలూకా, కైకలూరు తాలూకాలలో ఈ మాటలు లేవు.
అదంతా కృష్ణా జిల్లాలోని మాగాణి ప్రాంతం.
విజయవాడ -హైదరాబాద్ దారిలో 25 వ కి.మీ వద్ద మూలపాడు ఉంటుంది. ఈ హైవే ఊరిని రెండుగా చీల్చినట్లుగా ఉంటుంది. పాత మూలపాడు కృష్ణానది ఒడ్డున, కొత్త మూలపాడు కొండల ప్రక్కన ఉంటాయి. పాత ఊళ్ళో కొద్దిగా మాగాణి ఉంది గానీ కొత్త ఊరు దాదాపుగా మెట్ట ప్రాంతమే! పొగాకు, చెరకు పండించేవారు. చెరుకు నుండి బెల్లం తయారు చేసేవారు. పొగాకు బ్యారన్లు ఊళ్లోనే ఉండేవి. మేము కొత్త మూలపాడు లో ఉండేవారిమి.
ఒక కి.మీ దూరంలోనే కొండలు, అడవి ఉండేవి. మగవాళ్ళు కాలకృత్యాలకు అడవిలోనికి వెళ్ళవలసిందే! ఉదయం 8 గంటల తర్వాత ఆవులు కాసేవారు వచ్చి పశువుల దొడ్లలోకి వెళ్ళి ఆవుల పలుపులు ఊడదీసేవారు. ఆవులన్నీ రోడ్డు మీదకు వచ్చి వరుసలో అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవి. పశువులు కాసేవారు వాటిని అడవిలో వదిలేసి ఆడుకుంటూ, తెచ్చుకున్న భోజనం తిని మధ్యాహ్నం 3 గంటలకు ఒక రకమైన కూత వేసేవారు. అడవిలో ఎక్కడ ఉన్నా ఆవులన్నీ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి వరుసలో నడుస్తూ వాటి దొడ్లు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినుంచునేవి. యజమానులు కట్టేసుకునేవారు. నాకు ఈ కార్యక్రమం అంతా చూడముచ్చటగా ఉండేది.
పొగాకును బ్యారన్లలో కాల్చడం, చెరకు నుండీ బెల్లం తయారుచేయడం ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్లం.
1970 – 1971 లో పదవ తరగతి మూలపాడు స్కూల్లో చదివాను. ఆ తరువాత ఇంటర్మీడియట్ చదవడానికి గుంటూరు వెళ్లిపోయాను. మా నాన్న గారు అక్కడ పనిచేసినంత కాలం సెలవులకి వస్తుండేవాడిని. వారు అక్కడ నుండీ బదిలీ అయిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళడం కుదరలేదు.
-----
50 సంవత్సరాల తర్వాత ఈ రోజు మూలపాడు వెళ్ళాను. వర్షం వస్తే ఒకప్పుడు ఊరు మధ్యగా వాగు వచ్చేది. కొండలపైనుండీ వచ్చిన నీరు పారుతుండేది .ఇప్పుడు చక్కటి సిమెంటు రోడ్డు వచ్చింది. కొండల వద్దకు వెళ్లాను. గోకరాజు గంగరాజు గారి క్రికెట్ స్టేడియం కనిపించింది. అడవిలో రోడ్డు రెండు వైపులా ప్రైవేటు స్థలాలుగా అనిపించాయి. కొంత దూరం వెళ్ళాక షిరిడి సాయి గుడి, ఆపైన ‘Butterfly Park’ ఉంది. అక్కడ నుండీ అడవిలోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ పార్కు ముందు బురదగా ఉండడంతో లోనికి వెళ్ళలేకపోయాను.
‘దొంగమర్ల బావి’ అని ఊరికి 10 కి.మీ దూరంలో ఉండేది. గతంలో అక్కడ వరకు నడిచి వెళ్ళి చూసి వస్తుండేవారు. నేనెప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడెవరన్నా చూద్దామన్నా అవకాశం లేదు.
మేం అద్దెకు ఉన్న ఇల్లు చూద్దామని ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో కొత్త ఇళ్ళు వచ్చాయి. ఒక ఇంటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుంటే ‘నువ్వా ప్రసాదూ’ అని గుర్తు పట్టారు. మా కుటుంబసభ్యులని, వారి కుటుంబసభ్యులని ఇద్దరం గుర్తు చేసుకున్నాం. పొగాకు ఇప్పుడు పండించడం లేదని, ప్రత్తి పండిస్తున్నారని చెప్పారు. ఆవులు గురించి అడిగితే అస్సలు ఎవ్వరూ ఇప్పుడు ఆవులను పెంచడం లేదని చెప్పారు.
అక్కణ్ణుంచి నేను చదివిన స్కూలుకు వెళ్ళాను. మేం చదివేటప్పుడు 270 మంది విద్యార్ధులు ఉండేవారు. ఇప్పుడు వెయ్యి మంది పైగా ఉన్నారట. తూర్పు కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్ధులు తగ్గిపోతుంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్ధుల సంఖ్య బాగా పెరుగుతూ ఉందట. పెద్ద చెట్లతో స్కూలు నీడగా ఉంది. కైకలూరు స్కూల్లో ఇలా పెద్ద చెట్లుండేవి. 1968 తుఫాన్ లో వాటిలో కొన్ని పడిపోయినప్పుడు చాలా బాధపడ్డాము. మూలపాడు స్కూల్లో మేం ఉన్నప్పుడు పెద్ద మొక్కలు లేవు. అప్పటి మా హెడ్ మాస్టర్ అప్పారావు గారు పూల మొక్కలను మాతో నాటించి,నీళ్ళు పోయించేవారు. ఇప్పుడు స్కూలుకు కొత్త భవనాలు కూడా వచ్చాయి.
నాడు – నేడు పధకం క్రింద కొత్త టాయిలెట్లను కడుతున్నారు. ముచ్చట వేసింది స్కూలును చూస్తే. 50 సంవత్సరాల తర్వాత పాత జ్ఞాపకాలతో తిరిగి చల్లపల్లి కి బయలుదేరాను.
 - డి.ఆర్.కె
24.10.2020.