అమానుల్లా ఖాన్ గారూ – సలాం....           (29-Sep-2020)


 గుర్తుకొస్తున్నాయి ...43

 అమానుల్లా ఖాన్ గారూ – సలాం

‘ఒక్క ముక్కలో కౌన్సిలింగ్’ అంటే?
30 సంవత్సరాల క్రితం రామ మందిరం నిర్మాణం కోసం అద్వానీ రధయాత్ర ప్రారంభించారు.
రధయాత్ర పూర్తయ్యేసరికి బాబ్రీ మసీదు కూలిపోతుందేమోనని దేశం అంతా కంగారు పడుతోంది..
మా చల్లపల్లి లో కూడా అదే పరిస్ధితి. ఈ పరిణామాల నేపధ్యంలో ఒక మిత్రుడు ‘అన్ని పార్టీల నాయకులతో’ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఒకరి తరువాత ఒకరు అన్ని పార్టీల నాయకులూ మాట్లాడారు. దేశ సమగ్రత, మతాల మధ్య సామరస్యం ఉండాల్సిన ఆవశ్యకత, బాబ్రీ మసీదు వివరాలను గురించి ఉపన్యసించారు.
అంతా బాగానే ఉంది. రేపు బాబ్రీ మసీదుకు నష్టం జరిగితే ఏం చేయాలి? అందరం ఉగ్గబట్టుకొని కూర్చుకొన్నాం.
ఆఖరుగా చల్లపల్లి మసీదు చైర్మన్ “అమానుల్లా ఖాన్” గారు మాట్లాడారు. “అయ్యా, రేపు అక్కడ ఏం జరిగినా మనం ఈ రోజు ఒకళ్లకు ఒకళ్లం ఎలా ఉన్నామో అలానే ఉందాం” అని ఒక వాక్యంలో చెప్పి కూర్చొన్నారు.
ఒక్క ముక్కలో ఊరందరికీ ఎంత కౌన్సిలింగ్ ఇచ్చారో కదా! కర్తవ్యం అర్ధమయింది అందరికీ. తేలిక హృదయాలలో అందరం ఇళ్లకు వెళ్ళాం.
ఆ సారికి బాబ్రీ మసీదుకు ఏమీ నష్టం జరగలేదు. కానీ మరికొన్ని సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు కూలిపోయింది. కానీ చల్లపల్లి ప్రశాంతంగానే ఉంది.
అమానుల్లాఖాన్ గారి వంటి విజ్ఞులు ఇక్కడ ఉన్నారు కదా!
ఖాన్ గారు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు.
కానీ నా మనస్సులో ఎప్పుడూ ఎంతో ఎత్తులో ఉంటారు.
రేపు బాబ్రీ మసీదు కూల్చిన వారిపై తీర్పు రాబోతోంది.
ఆ తీర్పు ఎలా ఉన్నా ‘అమానుల్లాఖాన్’ గారి వంటి మానవతావాదులు ఆశలే నెరవేరుగాక!
- డి.ఆర్.కె
29.09.2020.