కొడగు కబుర్లు....           (24-Sep-2020)


 గుర్తుకొస్తున్నాయి ...42

 

"కొడగు కబుర్లు"
 
-ఏడేళ్ళ నాటి సంగతులు
 
“కూర్గు” చూసిన నా మిత్రులు ఎప్పుడోనే నన్ను కూడా వెళ్లి రమ్మని సలహా ఇచ్చారు. మహీంద్రా రిసార్ట్స్ లో ఉండడం చాలా హాయిగా ఉంటుందనేది వారి అనుభవం.
 
కూపస్థ మండూకంలా ఒకేచోట తిష్ట వేసుకొని ఉండడం కాకుండా పలు ప్రదేశాలు తిరిగి చూడడం నాకిష్టం. దీన్ని “వాండరింగ్ థర్స్ ట్” అంటారని చిన్నప్పుడు చదివిన గుర్తు. తిరిగే కాలు, తిట్టే నోరు ఖాళీగా వుండవనేది సామెత. ఈ “తిరిగే కాలు” మా అమ్మగారి నుండి జెనిటిక్ గా వచ్చిందనేది మా ఆవిడ ఉవాచ! కాలేజి చదువులప్పుడు ఆరు నెలలు దాటగానే కాళ్ళ తీట మొదలయ్యేది. సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి మన దేశంలోని ఏదో ఒక కొత్త ప్రదేశం చూసి వచ్చేవాడిని మిత్రులతో సహా.
అయితే ఈ డాక్టరీ వృత్తిరీత్యా చల్లపల్లిలో ప్రైవేటు ప్రాక్టీసు పెట్టిన తర్వాత కొంతకాలం తిష్ట వేసుకు కూర్చోక తప్పలేదు. అయినా అడపా దడపా ప్రయాణాలు చేస్తూ దేశ విదేశాల్లోని కొన్ని ప్రాంతాలు తిరిగేను. ఎక్కడకు వెళ్ళినా కేవలం ఆ ప్రదేశం అందచందాలను చూసి రావడం నాకు తృప్తి కలిగించదు. అక్కడి మనుష్యులతో మాట్లాడడం, వారి ఆచార వ్యవహారాలూ, ఆర్ధిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. ఈ కోరిక కొన్నిసార్లు సంతృప్తిగానూ, మరి కొన్నిసార్లు పాక్షికంగానూ నెరవేరుతుంది.
 
మహీంద్రా రిసార్ట్స్ లో ఉండాలంటే మనం అందులో సభ్యులం అయి ఉండాలి లేదా సభ్యులకు అతిథులమన్నా అయి ఉండాలి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సభ్యత్వం కొనుక్కుని మళ్ళీ ప్రతి సంవత్సరం నిర్వహణ కోసం వేలకు వేలు చెల్లించడం మనలాంటి వాళ్లకు కుదరని పని. కనుక ఇప్పటికే సభ్యులైన మన మిత్రులలో వున్న “బడా రిసార్టు కామందు”లను బాదేయడమే!
విజయవాడ నుండి మైసూరు రైల్లో వెళ్ళాము. అక్కణ్ణుంచి కార్లో కూర్గుకు ఓ రెండు గంటల ప్రయాణం. మహీంద్రా రిసార్ట్స్ రిసెప్షన్ చాలా బాగుంది. ప్రాంగణమే కాదు వారి రిసెప్షన్ కూడా! మనం వరుసలో నుంచోనవసరం లేదు. ప్రయాణపు బడలిక తీరడానికి ఒక పానీయం యిచ్చి ఒక సోఫాలో కూర్చోబెట్టారు. వారిలో ఒకరు వచ్చి ఫారం నింపుకొని, సంతకం పెట్టించుకున్నారు. రిసార్ట్స్ లో ఉండే సౌకర్యాలన్నీ వివరంగా చెప్పారు. బిల్లు కూడా మేం ఉండబోయే మూడు రోజులలో భోజనానికి మాత్రమే కట్టాలని గది అద్దె కట్టనక్కరలేదని వివరంగా చెప్పి, మాకు కేటాయించిన గదికి తీసుకు వెళ్ళారు. మా సామాను మారుతీ ఆమ్నీ వేన్ లో వచ్చింది. ఒక అడవిలో ఎక్కువగా చెక్క ఉపయోగించి ఎంతో అందంగా కట్టిన రిసార్టు అది. ధ్వని కాలుష్యం కూడా లేకుండా ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా ఉందో! కొన్ని నెలలు పని వత్తిడి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సరైన ప్రదేశం అనిపించింది.
అక్కడ మూడు రోజులు ఉన్నాం. అందులో పని చేసే మూడు వందల మందిలో ఎక్కువ భాగం ఆ ప్రాంతం వారే. చుట్టుప్రక్కల ప్రాంతాలు తిరుగుతూ వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నేను సేకరించిన వివరాలు ఇవి.
కొడగు
కూర్గు అసలు పేరు “కొడగు”. తెల్లోడికి నోరు తిరక్క ‘కొజికోడ్’ను ‘కాలికట్’గా పిలిచినట్లే ‘కొడగు’ను కూడా ‘కూర్గు’గా నామకరణం చేశాడు. ఇది కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. పూర్తిగా కొండ ప్రాంతం. ఇందులో మూడు పట్టణాలు ఉన్నాయి. పట్టణాలు అంటే మరీ పెద్దవేం కాదు. ఇందులో “మడికిరి” అనే పట్నంలో ఉంది ఈ రిసార్టు. జిల్లా మొత్తం జనాభా 6 లక్షల లోపే.
రొములస్ విటేకర్
నేను కూర్గు రావడానికి మరో ముఖ్య కారణం “రొములస్ విటేకర్”ను కలుసుకోవాలని. విటేకర్ భారతదేశంలో ప్రముఖ హెర్పిటాలజిస్టు (పాములపై పరిశోధన చేసేవారు). మద్రాసు అడయార్ లో “స్నేక్ పార్కు” స్థాపించి కొన్నాళ్ళు నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి అప్పజెప్పి, మహాబలిపురం రోడ్డులో మొసళ్ళ పార్కు నిర్వహించాడు. “ఇండియన్ స్నేక్స్” అనే గ్రంధమే వ్రాసాడు. “కింగ్ కోబ్రా”ల సంఖ్య తగ్గిపోతున్నాయని, వాటి జీవన విధానాన్ని అధ్యయనం చేసి వాటి సంఖ్య పెంచే పనిలో కూర్గులో ఉన్నాడని తెలిసి ఆయన కోసం విచారించాను. నా దురదృష్టం కొద్దీ అప్పటికే ఆయన కూర్గు వదిలి వెళ్లిపోయాడని తెలిసింది.
అయితే “చెంగప్ప” అనే నేచురలిస్ట్, స్నేక్ కాచర్ వద్ద నుండి నాకు కూర్గు గురించి, అక్కడ ఉండే పాముల గురించీ చాలా సమాచారం తెలిసింది.
కాఫీ ప్రియులు
అక్కడ ప్రజలంతా సన్నగా ఉన్నారు. బానపొట్టల వాళ్ళు కనిపించలేదు. ప్రజలు కాఫీ ప్రియులట. ప్రొద్దున్నే పెద్ద గ్లాసుడు కాఫీ తాగుతారట. కూర్గు అంతా కాఫీ తోటలమయం. వారి సొంత భాష “కొడవ”. ఇంట్లో అందరూ ఆ భాషనే మాట్లాడుకుంటారట. లిపి లేని భాష కనుక కన్నడ, ఇంగ్లీషు మీడియంలలోనే చదువు సంధ్యలు. చదువుకు బాగా ప్రాముఖ్యం ఇస్తారట.
సైనికులుగా
దాదాపు ప్రతి కుటుంబం నుండి మిలటరీలో పని చేసేవాళ్ళు ఒక్కళ్లన్నా ఉంటారట. మిలటరీలో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తారు. ‘సెలవుల్లో ఇంటికి వచ్చిన మిలటరీ ఉద్యోగస్తులను కలుసుకోవడానికి ఇచ్చే ప్రాముఖ్యం భారత రాష్ట్రపతి వచ్చినా ఇవ్వం’ అని చెప్పాడు చెంగప్ప.
‘ఫీల్డు మార్షల్ కరియప్ప’ కూర్గు వాడే అని ఎంతో గర్వంగా చెప్పాడు.
హాకీ
దారిలో ఒక ఆటస్థలం కనిపిస్తే ‘ఫుట్ బాల్ గ్రౌండ్ లాగా ఉంది’ అన్నాను. ‘కాదు హాకీ గ్రౌండ్’ అన్నాడు. ‘ఇక్కడ హాకీ ఆడతారా?’ అని అడిగాను. ‘ఇక్కడ హాకీ చాలా ప్రియమైన ఆట. ప్రతి సంవత్సరం జరిగే హాకీ టోర్నమెంట్ లో 250 టీంలు పాల్గొంటాయ’ని చెప్తే ఆశ్చర్యపోయాను. హాకీ ఉత్తర భారతదేశంలోనే ప్రాచుర్యం ఉన్న ఆట అనుకునేవాణ్ణి నేను.
రెండవ పెళ్ళి కుదరదు
పెళ్ళిళ్ళు గ్రీకు సాంప్రదాయాలను పోలి ఉంటాయట. కారణం నాకు తెలీలేదు. ఒకసారి పెళ్లి అయిన తర్వాత జీవితాంతం కలిసి ఉండాల్సిందేనట. భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి అనేది ఛస్తే ఒప్పుకోరట. కానీ అత్తమామలు కోడల్ని, ఆవిడ పిల్లల్ని జీవితాంతం పూర్తి బాధ్యత తీసుకుంటారట. బాధ్యత తీసుకోవడం బాగానే ఉంది గానీ మళ్ళీ పెళ్ళికి ఒప్పుకునే ప్రశ్నే లేదని వినడం బాధగా అనిపించింది.
కూర్గు పాముల గురించి, కింగ్ కోబ్రాల గురించి నాకు కావలసిన సమాచారం చెంగప్ప వద్ద దొరికింది. “Snakes of Coorg” అనే పుస్తకం కూడా కొని చదివేశాను.
తలకావేరి
కావేరి నది పుట్టిన స్థలం “తలకావేరి” అనే ప్రదేశం ఒకరోజు వెళ్ళాము. ఉన్న మూడు రోజులలో మిగిలిన పట్టణాలు చూడడం కుదరలేదు. అవి కూడా చూసి మరి కొంతమందితో మాట్లాడితే బాగుండేది అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాము.
-దాసరి రామకృష్ణ ప్రసాదు
10-02-2013
...
అప్పటి మా కూర్గు ప్రయాణం గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళి ఉందామా ఆ ప్రకృతిలో అనిపిస్తూఉంటుంది .
ఓ వారంగడిపేయవచ్చు ...
డి .ఆర్.కె .
24.09.2020