బాబోయ్! మర్యాదస్ధుడు!....           (10-Sep-2020)


 గుర్తుకొస్తున్నాయి ...39

 

కొన్ని సంవత్సరాలక్రితం ఒక మిత్రుడికీ నాకూ జరిగిన సంభాషణ ..

 

*‘బాబోయ్! మర్యాదస్ధుడు!’*

 

‘నాకు మర్యాదస్తులంటే భయం బాబూ’ అన్నాను నేను.

 

అదేంటి సర్ అలా అన్నారు. మనందరికీ చిన్నప్పటి నుండీ మర్యాదస్ధుల్లాగా ఉండాలని మన పెద్దలు చెప్తారుగా – నా మిత్రుడి ప్రశ్న.

 

'అవునయ్యా అలానే చెప్తారు.


మర్యాదలు వరకూ నేర్చుకుంటాం.


కానీ అస్సలు మనస్తత్వం మారదుగా.

 

అంటే మనం మంచి వాళ్ళం అయ్యి ఉండచ్చు, లేదా చెడ్డవాళ్ళం అయ్యి ఉండవచ్చు. '

 

‘చెడ్డ వాడంటే ఏమిటి సార్?’ అడిగాడు మిత్రుడు.

 

ఎదుటి వాణ్ణి తొక్కేసి మరీ తాను పెరిగి పోవాలని ఆశించేవాడు, తాను పెరగడం కోసం ఎంతమందినయినా మోసం చేసేవాడు.

 

ఇప్పుడు నీకొక మర్యాదస్ధుడయిన వ్యక్తిని పరిచయం చేశాననుకో. అతను మంచి వ్యక్తే అయితే నీకు అతని వలన ప్రమాదం ఉండదు. మాట్లాడినంత సేపు ఆనందంగా కూడా ఉంటుంది.

 

అలాగే మర్యాదస్తుడయిన మరో వ్యక్తిని పరిచయం చేశాననుకో. అతనితో స్నేహం చేసేస్తావు. చెడ్డవాడని తెలిసే లోపలే నువ్వు మోసపోతావు.

 

బ్యాంకులకి , జనానికి డబ్బులెగ్గొట్టిన పెద్ద పెద్ద వ్యాపార సంస్థల యజమానులంతా మర్యాదస్ధులేగా! మరి ఎంతమందికి టోపీ పెట్టలేదు.


శ్రీ 420 లంతా మర్యాదస్తులు కాదూ !

 

ఇక మర్యాదలు తెలీని ముక్కోపి వ్యక్తులతో ఎవరికన్నా ప్రమాదం జరిగిందా! ఆలోచించు.

వాళ్లేంటో వెంటనే అర్ధం అయిపోతుంది కదా మనకు. వాళ్లేం దాచుకోరు. నిర్మొహమాటంగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉండడం, వారి మాట తీరు వలన సాంఘికంగా ఇబ్బందిగా ఉంటుంది కానీ మనకు అంతకంటే ప్రమాదం జరగదు.

 

అందుకే ఇలా మొహం మీద మాట్లాడుతూ, మర్యాదలు పెద్దగా తెలియని వాళ్ళంటే నాకు అస్సలు భయం ఉండదు.

 

మర్యాదస్ధుడు మంచివాడు, సమర్ధుడు అయితే అందరికీ ఉపయోగపడతాడు.

 

ఒకవేళ సమర్ధుడు కాకపోయినా మంచివాడు ప్రమాదం చేయడు.

 

మర్యాదస్ధుడు కనుక చెడ్డ వాడైతే మనల్ని ముంచేస్తాడు.

 

అందుకే మర్యాదస్ధులంటే మాత్రం నాకు చచ్చేంత భయం.

 

ఎవరన్నా కొత్తగా పరిచయం అయి అతను మర్యాదస్ధుడిగా కనబడితే భయపడుతూ స్నేహం చేస్తా!

 

'సార్! మీరెంతో మర్యాదస్ధుడని ఇన్నాళ్లూ స్నేహం చేశానే! '- మిత్రుడు కంగారుగా అన్నాడు .

 

'అవునా! ఇంతకీ నేను మంచోణ్ణా, చెడ్డోడినా?'

 

ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ఫ్రెండూ!😀

 

- డి.ఆర్. కె
10.09.2020.