నేను చాలా తెలివిగల వాణ్ణి....           (30-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి ... 35

 

చిన్ననాటి సంగతులు

 

*"నేను చాలా తెలివిగల వాణ్ణి"*

 

బాగా చదువుకునేవాణ్ణి కాబట్టి చిన్నప్పటినుండీ నాకు బాగా తెలివిగల వాణ్ణని పేరు.

 

నా తెలివికి కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయండోయ్!

 

వేసవి సెలవుల్లో కజిన్స్ అందరం మా అమ్మమ్మ గారింట్లో కొంతకాలం గడిపేవాళ్లం.


10-12 మంది పిల్లలం ఉండేవాళ్లం. అంతమందికి మంచాలుండవు కదా! అందరం ఇంటి ముందు నేల మీదే చాపలు, పరుపులు వేసి పండుకునేవాళ్లం.

 

ఒకరోజు మేం పక్కలన్నీ వేసుకున్న తరువాత మా అమ్మమ్మ గారు వచ్చి ‘ అదేమిట్రా ఉత్తరం వైపు తలపెట్టుకున్నారు, మార్చండి’ అన్నారు.

 

‘అబ్బా’ అనుకొన్నాం.


ఎందుకంటే ఈ పక్కలు వేయడం అంటే ముందుగా చాపలు వేసి వాటిపై పరుపులు ,దుప్పట్లు, దిళ్లు వేయాలి. రోజూ ఇది ఒక ప్రహసనం. మళ్లీ ఇప్పుడు మార్చాలా అనుకొని ‘ పట్టండ్రా’ అన్నాను....

ఇద్దరం ఒక వైపు, మరో ఇద్దరు రెండో వైపు పరుపును పట్టుకుని దక్షిణం వైపు తల వచ్చేట్లు 180 డిగ్రీలు తిప్పాం.

 

అప్పుడు మా అమ్మమ్మ గారు తల పట్టుకుని
‘పిచ్చి గున్నల్లారా దిండు ఒక్కటి మారిస్తే సరిపోయేది కదరా! మీ తెలివి తెల్లారినట్లే ఉంది’ అని విసుక్కుని వెళ్లిపోయారు.

 

ఇదండీ నా తెలివికి ఒక ఉదాహరణ.

 

ఇంకా ఉన్నాయండోయ్ !

 

ఆ ముచ్చట్లు మరోసారి ...

 

డి. ఆర్. కె
30.08.2020